తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు.. TTD కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2021-12-11T21:52:37+05:30 IST

జనవరి 13న వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 10 రోజులపాటు భక్తులకు

తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు.. TTD కీలక నిర్ణయాలు

తిరుమల: శ్రీవారు కొలువై ఉన్న తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్డును నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నమయ్య నడిచొచ్చిన మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చిందని, దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలు సడలిస్తే పండుగ తర్వాత సర్వదర్శనం పెంచుతామన్నారు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. హనుమాన్‌ జన్మస్థలమైనా అంజనాద్రిని అభివృద్ధి చేస్తామని టీటీడీ తెలిపింది. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత మండపం నిర్మిస్తామని పేర్కొంది.


అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర కొట్టుకుపోయిన ఆలయాలను పునఃనిర్మిస్తామని పేర్కొంది. రూ.2.6 కోట్లతో నూతన పరకామణి మండపంలో యంత్రాల కొనుగోలు చేస్తామని టీటీడీ తెలిపింది. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామని టీటీడీ ప్రకటించింది. రూ.3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్‌లో భవనాలను నిర్మిస్తామన్నారు. రూ.12 కోట్లతో మహిళా వర్సిటీలో హాస్టల్ భవనాల నిర్మాణాలను చేడుతామని టీటీడీ ప్రకటించింది. 




  .

Updated Date - 2021-12-11T21:52:37+05:30 IST