తరగని శుభాలిచ్చే పర్వం

Published: Fri, 29 Apr 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తరగని శుభాలిచ్చే పర్వం

వైశాఖ శుద్ధ తదియ.... అక్షయ తృతీయ. ఇది మహిమాన్వితమైన పర్వదినం. మన సంకల్పాలన్నిటినీ ‘అక్షయం’గా అంటే తరిగిపోనివిగా చేసే శుభదినం. అక్షయ తృతీయ ప్రత్యేకతను భవిష్య, శివ పురాణాలు శ్లాఘించాయి. 


ప్రతి యుగం ఒక్కొక్క పవిత్రమైన రోజున ప్రారంభమైనట్టు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కృతయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమినాడు, ద్వాపర యుగం భాద్రపద బహుళ త్రయోదశి నాడు, కలియుగం మాఘ బహుళ అమావాస్య నాడు ఆరంభమయ్యాయని పేర్కొంటోంది. అక్షయ తృతీయ పర్వాన్ని కృతయుగం నాటి నుంచే జరుపుకొంటున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆ యుగంలో ధర్మదేవత నాలుగు పాదాల మీద నడిచిందనీ, జన బాహుళ్యం సకల సౌభాగ్యాలనూ అక్షయంగా అనుభవించారనీ పురాణ కథలు పేర్కొంటున్నాయి. 

తరగని శుభాలిచ్చే పర్వం

సింహగిరిపై చందనస్వామిగా...

అక్షయ తృతీయ ప్రాముఖ్యతను భాగవత పురాణం వివరించింది. అది ప్రహ్లాద చరిత్రకు సంబంధించినది. ప్రహ్లాదవరదుడైన శ్రీ వరాహ లక్ష్మీ నారసింహుడు ఎంతో కాలం పాటు సింహాచల క్షేత్రంలో పూజలు అందుకున్నాడు. ఆ తరువాత ఆరాధనలు లేక... విగ్రహాలు పుట్టలలో కనుమరుగైపోయాయి. తదనంతర కాలంలో షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు వ్యాహ్యాళికి వెళుతున్న సమయంలో అతని రథం వినువీధిలో ఆగిపోయింది. కారణం తెలుసుకున్న చక్రవర్తి... సింహగిరి మీద ఉన్న పుట్టను తొలగించి, అర్చా మూర్తులను అభిషేకించి, ఆలయం నిర్మించాడు. పురూరవుడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీహరి అక్షయ తృతీయ రోజున అతడికి దర్శనం ఇచ్చి.... ‘‘ఈ ఒక్క రోజునే నా నిజరూప దర్శనం లభిస్తుంది. అర్చామూర్తుల చుట్టూ తొలగించిన పుట్టమన్ను ఎంత బరువు ఉందో... అంత బరువున్న చందనాన్ని ఏడాదిలో మిగిలిన కాలమంతా నా విగ్రహానికి పూయాలి’’ అని ఆదేశించాడు. ఆ పుట్ట మన్ను బరువు పన్నెండు మణుగులు. కాలక్రమంగా ఈ పద్ధతిలో కొంత మార్పు జరిగింది. అక్షయ తృతీయ, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో... మూడేసి మణుగుల బరువున్న చందనాన్ని పూస్తారు. ఈ కారణంగా సింహాచలాధీశుడు ఏడాదంతా చందనం పూతలో ఉంటాడు. భారతదేశంలోని సుప్రసిద్ధమైన 32 నారసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. అక్షయ తృతీయ రోజున ఇక్కడ చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజున నారసింహుని నిజరూప దర్శనానికి దేశమంతటి నుంచీ భక్తులు విచ్చేస్తారు. స్వామిను దర్శించుకొని, అక్షయమైన అనుగ్రహాన్ని పొందుతారు.


రథాలకు అంకురార్పణ...

నీల మాధవుడే సింహాచలాధీశుడనీ, అతడే పూరీలో జగన్నాథుడిగా ప్రభవించాడనీ ఒడిశా వాసుల విశ్వాసం. పూరీ క్షేత్రంలో ఆషాఢ శుద్ధ విదియ రోజున రథోత్సవం జరుగుతుంది. ఆలయంలోని మూలవిరాట్టులైన జగన్నాథ, సుభద్ర, బలభద్రుల కోసం... మూడు వేర్వేరు రథాలను నిర్మించడానికి అంకురార్పణ అక్షయ తృతీయనాడు జరుగుతుంది. రథోత్సవం నాటికి రథాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారు.


లక్ష్మీ ఆరాధన...

అక్షయ తృతీయ నాడు నిర్వహించాల్సిన విధులను కూడా శాస్త్రాలు నిర్దేశించాయి. దీని ప్రకారం.. వేకువ జామునే సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే.. పాపాలన్నీ క్షయమై, అక్షయమైన సత్ఫలాలు లభిస్తాయి. ఈ రోజున వారం, వర్జ్యంతో నిమిత్తం లేకుండా... ఏ శుభకార్యం ప్రారంభించినా... అనంత మైన ప్రతిఫలాలను అందుకుంటారనీ చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి... ఉదకదానం, విసనకర్ర, గొడుగు, పాదరక్షలు లాంటివి దానం చెయ్యాలి. వసంత ఋతువులో వైశాఖమాసం మాధవ మాసం. ‘మా’ అంటే లక్ష్మీదేవి. మాధవుడికి ప్రియమైనది. కాబట్టి లక్ష్మీ ప్రతిమను లేదా రూపును పూజిస్తే శుభం జరుగుతుందంటారు. అందుకే అక్షయ తృతీయ నాడు చిన్నమెత్తైనా బంగారాన్ని కొనడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ. ఇప్పుడది దేశమంతటా వ్యాపించింది.       


-ఆయపిళ్ళ రాజపాప

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.