మహిళలకూ ఆ అర్హత ఉంది!

ABN , First Publish Date - 2021-04-29T05:35:52+05:30 IST

పౌరోహిత్యం పురుషులకే పరిమితం కాదు... శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే మహిళలూ పురోహితులుగా రాణించగలరు అంటున్నారు తాళ్లూరి వైష్ణోదేవి. మూమూలు పూజల నుంచి షోడశ సంస్కారాల వరకూ అన్నిటినీ చేయిస్తారామె...

మహిళలకూ ఆ అర్హత ఉంది!

పౌరోహిత్యం పురుషులకే పరిమితం కాదు... శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే మహిళలూ పురోహితులుగా రాణించగలరు అంటున్నారు తాళ్లూరి వైష్ణోదేవి. మూమూలు పూజల నుంచి షోడశ సంస్కారాల వరకూ అన్నిటినీ చేయిస్తారామె. తన నేపథ్యం గురించీ, ఈ వృత్తిలోకి తను ప్రవేశించడానికి దారితీసిన కారణాల గురించీ ఆమె నవ్యతో పంచుకున్నారు.


ఆర్యసమాజ్‌కు దగ్గరవక మునుపు వరకూ మాది మాంసాహార కుటుంబమే! ఆ తర్వాత పూర్తి శాకాహారులుగా మారడంతో పాటు, ఆర్యసమాజ్‌ తరఫున కుటుంబం మొత్తం ఊరూరా తిరుగుతూ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయడం మొదలుపెట్టాం. ఈ విషయంలో నాన్న మమ్మల్ని ముందుండి నడిపించేవారు. స్వయంగా పౌరోహిత్యం చేయాలనే ఆలోచన మాత్రం 2007లో పెళ్లయ్యాక వచ్చింది. మా వారు డాక్టర్‌ ధర్మతేజ పుట్టుకతోనే ఆర్యసమాజ్‌కు చెందినవారు. వైదిక ధర్మ ప్రచారం చేయాలనే ఆసక్తి ఆయనకు ఉండేది. ఆధ్యాత్మికంగా వైదిక ధర్మం అందరికీ చేరుతుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. పౌరోహిత్యం అనేది వైదిక ధర్మ ప్రచారానికి ఓ మాధ్యమం మాత్రమే! వైదిక ధర్మం ద్వారా సంస్కారాలు చేయడం వల్ల ఆ ధర్మం ప్రాచుర్యంలోకి వస్తుందనేది మా విశ్వాసం. అలాంటి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టడంతో నాకున్న మునుపటి ఆసక్తి రెట్టింపయింది. అలా మా వారి నేతృత్వంలో వైదిక ధర్మం, పౌరోహిత్యం నేర్చుకున్నాను. దాన్లో భాగంగా షోడశసంస్కారాలన్నీ చేస్తాను. గర్భాదానం మొదలు పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం... అంతిమంగా అంత్యేష్ఠి... ఇలా మొత్తం 16 సంస్కారాలు చేస్తాను. వీటితో పాటు హోమాలు కూడా చేస్తూ ఉంటాను. 


మహిళలూ అర్హులే!

సమాజంలో ఒక వర్గం వారికి, మరీ ముఖ్యంగా పురుషులకే పౌరోహిత్యం పరిమితం అనే రూఢి వాదం ప్రబలి ఉంది. అలాంటప్పుడు మహిళలు ఈ పని చేపట్టినప్పుడు సర్వత్రా ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే ఏ ఆధారాల పరంగా అడ్డు చెప్తున్నారో సమాధానం చెప్పగలగాలి. మహిళలు పౌరోహిత్యానికి అనర్హులని వేదంలో ఎక్కడ ఉంది? యజుర్వేదంలో వేదం అందరిదీ అని చెప్పబడి ఉంది. రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో కౌశల్యాదేవి యజ్ఞం చేస్తున్నట్టు రామాయణంలోనూ ఉంది. ఇది చేయకూడదు అని చెప్పడానికి ఆధారాలు ఎక్కడా లేవు. వేదం పరమాత్మ వాణి. వేదాన్ని మాత్రమే ప్రమాణ సూత్రంగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన వాదనలను పరిగణలోకి తీసుకోవడం సరి కాదు. ప్రారంభంలో నేనూ ప్రశ్నలను, నిరసనలను ఎదుర్కొన్నాను. నిజానికి వేదం నేర్చుకుని తీరాలనే గట్టి నిర్ణయం ఇంటర్‌లోనే తీసుకున్నాను. ఇందుకు దారితీసిన ఓ సంఘటన గురించి చెప్పాలి.


వేద శ్లోక పఠనంతో...

నాన్న ఆర్మీ ఆఫీసరే అయినా తర్వాత దాన్ని వదిలేసి, బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కెనరా బ్యాంక్‌ అసిస్టెంట్‌ మ్యానేజర్‌గా ఉన్న రోజుల్లో గుంటూరులో ఓ సంఘటన జరిగింది. అక్కడి తమిళసంఘం వాళ్లు బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ తరఫున జగద్గురు ఆది శంకరాచార్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాన్నగారి ప్రోద్భలం మీద ఆ కార్యక్రమానికి నేనూ హాజరయ్యా. ఆ సమయంలో నేను చాలా చక్కగా వేదం చదువుతానని నాన్న అనడంతో అందరూ నన్ను ప్రార్థన చేయమన్నారు. అలా ఓ వైదిక శ్లోకాన్ని పఠించడం మొదలుపెట్టిన కొద్ది సేపటికే నాకు ఆటంకం కల్పించారు. ఆ శ్లోకం చదవవద్దు అని కార్యక్రమానికి హాజరైన వాళ్లు నన్ను ఆపేశారు. అప్పటివరకూ నాకు ఆర్యసమాజం పట్ల విశ్వాసం ఉండేది కాదు. అయితే ఆ సంఘటనతో సర్వత్రా ప్రబలిన నిరాధార నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయో అర్థమైంది. దాంతో ఆ క్షణమే వేదం చదివి తీరాలనే మొండి పట్టుదల పెంచుకున్నాను. పట్టుబట్టి వేదం నేర్చుకున్నాను. 



మాది గుంటూరు జిల్లా, మంగళగిరి. నాన్న ఆర్మీ ఆఫీసర్‌గా జమ్మూలో విధుల్లో ఉన్న సమయంలో నేను పుట్టాను. అయితే పెరిగింది మంగళగిరిలోనే. ఆర్యసమాజ్‌లో పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ప్రస్తుతం భారతీయ విద్యాభవన్‌లో హిందీ అధ్యాపకురాలిగా పని చేస్తున్నాను. అయినప్పటికీ ఖాళీ సమయాలను వేద సంస్కారాలకు, పౌరోహిత్యానికి కేటాయిస్తూ ఉంటాను. నియమనిష్ఠలతో పౌరోహిత్యం చేస్తాను. ఒక పెళ్లి చేయాలంటే నాకు రెండు గంటల సమయం పడుతుంది. అంతసేపూ కదలకుండా కూర్చోవాలని ముందుగానే చెప్పేస్తాను. అలా అయితేనే ముందుకు రండి అని కచ్చితంగా చెప్పేస్తాను. ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో ఆచరిస్తామో అప్పుడే ఆ ప్రభావాన్ని పొందగలం. నాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 మందికి పైగా మహిళా పురోహితులు ఉన్నారు. నా మటుకు నేను అలంకృత రిసార్ట్‌ ఓనర్‌ దీన్‌దయాళ్‌ గారి కూతురి పెళ్లి చేశాను. కాంటినెంటల్‌ ఆస్పత్రి గురునాథరెడ్డి గారి మనవడి పెళ్లి చేశాను. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ పెళ్లిళ్లు చేశాను. అలాగని నేను ఉన్నత కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తానని కాదు. మహబూబ్‌నగర్‌కు వెళ్లి  కేవలం 20 మంది గ్రామస్థుల సమక్షంలో నా డ్రైవర్‌ పెళ్లి కూడా జరిపించాను.


శ్రద్ధాభక్తులతోనే సాధ్యం!

కాలక్రమేణా మన సిద్ధాంతాలు, సంస్కారాలు, ఆచారవ్యవహారాల పట్ల శ్రద్ధ తగ్గిపోతోంది. వీటి ఆంతర్యం గురించి తెలుసుకుని, శ్రద్ధగా చేయించుకోవడానికి బదులుగా మొక్కుబడిగా జరిపించుకునేవాళ్లే ఎక్కువయ్యారు. మరీముఖ్యంగా వీటిని ఈవెంట్స్‌ రూపంలో, సంబరంగా జరుపుకునే ధోరణి పెరిగిపోతోంది. వేదమంత్రాలు చదువుతున్నప్పుడు, వాటిని ఆస్వాదించగలిగితే ఆత్మికోన్నతి, ఉత్ధానం జరుగుతుంది. కానీ చాలా కొద్ది మందిలోనే వేదమంత్రాల పట్ల అంకితభావం, శ్రద్ధ ఉంటోంది. వైదిక ధర్మం అందరి దగ్గరకూ తీసుకువెళ్లాలి. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమాధానపరుచుకుంటూ ముందుకెళ్లాలి. ఇదీ నా నైజం. పైగా ఆలోచింపజేసే విధంగా చెప్పగలిగితే, ఎదుటివ్యక్తి కన్విన్స్‌ అవుతారే తప్ప ఎదురు తిరిగే ప్రసక్తి ఉండదు. 

- గోగుమళ్ల కవిత


Updated Date - 2021-04-29T05:35:52+05:30 IST