Vajpayee, Advani ల బీజేపీని కాపాడేందుకు ఇదే చివరి అవకాశం: Yaswant Sinha

ABN , First Publish Date - 2022-07-18T01:18:40+05:30 IST

అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణి సారథ్యంలోని బీజేపీ అంపశయ్యపై ఉందని..

Vajpayee, Advani ల బీజేపీని కాపాడేందుకు ఇదే చివరి అవకాశం: Yaswant Sinha

న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal bihari Vajpayee), అడ్వాణి (Advani) సారథ్యంలోని బీజేపీ (Bjp) అంపశయ్యపై ఉందని, ఆ పార్టీని కాపాడుకునేందుకు ఇదే చివరి అవకాశమని (Last Chance) విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) అన్నారు. తమ అంతరాత్మ ప్రబోథం మేరకే ఓటు వేయాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయన కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలోని 4,009 ఎంపీలు, ఎమ్మెల్యేలకు రెండు పేజీల లేఖలో సిన్హా ఆదివారంనాడు ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఐడెంటిటీకి సంబంధించినది కాదని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధాంతాలు, ఆదర్శాలకు సంబంధించినదని అన్నారు.


''నా ఐడియాలజీ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఐడియాలజీ ఉన్న శక్తులకు ప్రతినిధి నా ప్రత్యర్థి (ద్రౌపది ముర్ము). ఒకప్పుడు ఏబీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీ సారథ్యంలోని ఇప్పుడు బీజేపీ జీవచ్ఛవంలా మారుతుండటం నాకు విచారం కలిగిస్తోంది. ప్రస్తుతం అన్నీ తానే అయిన నేతతో పార్టీ పూర్తి భిన్నంగా దిగజారుతూ వస్తోంది. ఆ తేడా ఏమిటో మీలో చాలా మందికి తెలుసునని నేను నిశ్చయంగా చెప్పగలను'' అని సిన్హా అన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు ఇదే చివరి అవకాశమని అన్నారు. తాను కూడా ఒకప్పుడు ఆ పార్టీ (బీజేపీ) నేతనేనని, తనను ఎన్నుకోవడం ద్వారా పార్టీని, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు  గొప్ప సేవ చేసిన వారవుతారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి విప్‌లు లేనందున ఓటర్లు తమ అంతరాత్మ ప్రబోధంగా మేరకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఒకే దేశం, అనేక పార్టీలు, సమష్టి నాయకత్వానికే తన మొగ్గు అని సిన్హా చెప్పారు. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే సుప్రీం లీడర్‌ అనే తరహాలో ప్రజాస్వామ్య భారతాన్ని కమ్యూనిస్ట్ చైనాగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న వారి ప్రతినిధిగా పోటీ చేస్తున్న అభ్యర్థి తన ప్రత్యర్థని చెప్పారు. ''ఈ తరహా లక్ష్యాన్ని ఆపాలా వద్దా? తప్పని సరిగా ఆపాలి. మీరు మాత్రమే ఆపగలరు'' అని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సిన్హా విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-18T01:18:40+05:30 IST