
ఈ చిత్రంలో వాహనదారులు ఆగి ఉన్న ప్రదేశం నేరెడ్‌మెట్‌లోని వాజ్పేయినగర్. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం 11 ఏళ్ల క్రితం రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం చేపట్టేందుకు రైల్వేశాఖ ప్రతిపాదించింది. అయితే స్థల సేకరణ చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు హామీలు ఇస్తూ.. తర్వాత మరిచిపోతున్నారని మండిపడుతున్నారు. జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
ఆర్యూబీ, ఆర్ఓబీలపై నిర్లక్ష్యం
జంటనగరాల పరిధిలో నిర్మాణాలకు నోచుకోని వైనం
లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద వాహనదారుల ఇబ్బందులు
108 సర్వీసుల్లో అత్యవసర రోగుల అవస్థ
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌లోని రైల్వే పనులపై శీతకన్ను వేస్తోంది. ప్రధానంగా నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) నిర్మాణాలపై చొరవ తీసుకోకపోవడంతో రైల్వేశాఖ సైతం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి, తిరిగి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే సమస్యతో బాధపడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు డివిజన్లలో 38 ప్రాంతాల ఎంపిక
సౌత్ సెంట్రల్ రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధుల్లో 38 ప్రాంతాల్లో ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలను చేపట్టాలని రైల్వేశాఖ గతంలో భావించింది. ఈ మేరకు రైల్వే అధికారులు లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆర్ఓబీ, ఆర్యూబీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. 50-50 వాటా పద్ధతిలో నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అయితే రైల్వే శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లి ఏళ్లు గడుస్తున్నా.. అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో పనులకు అంకురార్పణ జరగడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గూడ్స్, పాసింజర్ రైళ్ల రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సకాలంలో నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ట్రాఫిక్ రహితమైన రవాణాను అందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాన్సెంట్ లెటర్ ఇవ్వని పరిస్థితి
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలోని ఆయా పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు తమ పరిధిలో ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణాల విషయంపై కొన్నింటికి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమ్మతి పత్రాలు (కాన్సెంట్ లెటర్లు) ఇవ్వకపోవడంపై పనులు ప్రారంభం కావడంలేదని తెలిసింది.
బుద్వేల్-ఉందానగర్, ఫలక్‌నుమా-బుద్వేల్, తిమ్మాపూర్-షాద్‌నగర్, మాసాయిపేట్-మనోహరాబాద్, కామారెడ్డి-తల్మడ్లా, డిచ్పల్లి-ఇందల్వాయి, జానకంపేట్- నిజామాబాద్,హైదరాబాద్-హుస్సేన్‌సాగర్ జంక్షన్, సనత్‌నగర్-అమ్ముగూడ, అమ్ము గూడ- మౌలాలితోపాటు బాసర యార్డు, కౌకుండ్ల, మన్యంకొండ, పూడూర్డు, వనపర్తి రోడ్డు, ఉప్పల్వాయి, సీమపల్లి, బీబీనగర్, పగిడిపల్లి, నవంగి, సదాశివపేట్, గుండ్లకండ్ల, మరిపల్లి, మంతట్టి, గంగాధర, ఉప్పల్, జగిత్యాల్, మల్యాల్, కారేపల్లి యార్డు బ్లాక్ సెక్షన్లో ఆర్ఓబీ, ఆర్‌యూబీలు చేపట్టాలని భావించగా.. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిసింది.
108 సర్వీసులకూ ఇబ్బంది
లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద గూడ్స్ రైళ్లు గంటల పాటు నిలిచి ఉంటుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 108 సర్వీసుల్లో ఆస్పత్రులకు వెళ్తున్న రోగులు ప్రాణప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైలు ముందుకు కదలకపోవడం.. గేట్లు ఎత్తకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ సభ్యులు ఇప్పటికైనా తమ పరిధిలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబీల నిర్మాణాలకు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.