వలిసెల సాగు...లాభాలు బాగు

ABN , First Publish Date - 2022-05-22T06:46:37+05:30 IST

నూనె గింజల పంటల్లో వలిసెల సాగు లాభదాయకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జన్యు శాస్త్రవేత్త జి.వినయ్‌కుమార్‌ అన్నారు.

వలిసెల సాగు...లాభాలు బాగు
క్షేత్ర ప్రదర్శనలో రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు వినయ్‌కుమార్‌, అప్పారావు

రైతులు మేలుజాతి విత్తనాలు నాటుకోవాలి

సూచించిన శాస్త్రవేత్త వినయ్‌కుమార్‌

చింతపల్లి, మే 21: నూనె గింజల పంటల్లో వలిసెల సాగు లాభదాయకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జన్యు శాస్త్రవేత్త జి.వినయ్‌కుమార్‌ అన్నారు. శనివారం పరిశోధన స్థానం దత్తత గ్రామం ఏబులంలో వలిసెల సాగుపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గతంలో వలిసెల సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేదన్నారు. ఆకాశపందిరి కలుపు విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఈ పంట సాగుకు రైతులు దూరమయ్యారని తెలిపారు. ఈ కలుపు నివారణకు సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. గిరిజన ప్రాంతంలో సాగు చేపట్టి, మేలైన దిగుబడుల సాధనకు ప్రాంతీయ రకం కేజీఎన్‌-2, నూతన వంగడం జేఎన్‌ఎస్‌-28 రకాలు అనుకూలమన్నారు. వలిసెల విత్తనాల్లోనే ఆకాశపందిరి విత్తనాలు కూడా కలిసి ఉంటాయని, వీటిని జెల్లడ సహాయంతో వేరుచేసుకోవచ్చునన్నారు. నాట్లు వేసే ముందు విత్తనాలను ఉప్పు ద్రావణంలో నానబెట్టడం వల్ల వలిసెల విత్తనాలు పైకి తేలుతాయని, ఆకాశపందిరి విత్తనాలు అడుగు భాగానికి చేరుకుంటాయన్నారు.  ఇది కూడా కలుపు నివారణకు దోహదపడుతుందని ఆయన వివరించారు. వలసెల సాగుకు రైతులు తమ పంట పొలాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విత్తనాల కోసం పరిశోధన స్థానంలో సంప్రదించవచ్చునన్నారు. అనంతరం జీవన ఎరువులు, అకాశపందిరి వేరుచేసే జల్లెడలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్త అప్పారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:46:37+05:30 IST