వల్లకాటి అధ్వాన్న శకం

ABN , First Publish Date - 2020-07-30T06:38:25+05:30 IST

ఈకాలం కోసం కాదు కదా, కాచుకుని ఉన్నది! రోజుల్ని కొంచెం కొంచెం జరుపుతూ, వేగంగా దొర్లిస్తూ, ఉధృతంగా పరిగెత్తిస్తూ, జీవితాన్ని గడుపుతున్నది ఈ ముగింపు కోసం కాదు కదా!! నిన్నటి...

వల్లకాటి అధ్వాన్న శకం

మనిషి ఉనికికి ఒక ఆరంభం ఉన్నట్టే, ఒక ముగింపూ కావాలి. అసమాపకంగా ఎట్లా కాలిపోతారు, పూడిపోతారు? ఒక ఉసా కోసం ఎన్ని నినాదాలు, ఒక అచ్యుతరావుకు ఎన్ని కృతజ్ఞతలు, ఒక గోవిందుకు ఎన్ని స్నేహాలు బాకీ, ఎందరెందరు ఈ నాలుగునెలల మృత్యు బిలంలో కూరుకుపోయారు, ఎన్నెన్ని తెలిసిన తెలియని జీవకేతనాలు అవనతమయ్యాయి, ఎన్ని సామూహిక స్మరణలు అణగారిపోయాయి? ఎన్ని కన్నీళ్లు విడి చెక్కిళ్ల మీదనే ఇంకిపోయాయి? మరో సందర్భంలో నెరూడా అన్నట్టు ‘‘కళేబరాల కోసం మృత్యువు చీపురులా ముస్తాబై నేలంతా’’ చుట్టేస్తోంది. ‘‘దారం కోసం వెదుకుతున్న సూదికన్ను మృత్యువు’’. జాషువా అన్నట్టు, ఇదొక ముదురు తమస్సు, ఈ ప్రపంచం ఇప్పుడు ‘‘పిశాచులతో నిటాలేక్షణుడు గజ్జె గదిలించి’’ ఆడే రంగస్థలంగా మారిపోయింది. పిశాచులెవరో మనం తేల్చుకోవాలి, చీపురుకు దొరకకుండా ప్రాణం నిలుపుకోవాలి.


వర్తమానంలో వైభవమేముందో కనిపించడం లేదు కానీ, ప్రస్తుతం మాత్రం వల్లకాటి అధ్వాన్న శకం. ప్రతి శకమూ అంతరిస్తుంది. మనిషిని- మరణం కాదు- జీవితం నానావిధభాషలతో పిలిచే రోజు వస్తుంది.


ఈకాలం కోసం కాదు కదా, కాచుకుని ఉన్నది! రోజుల్ని కొంచెం కొంచెం జరుపుతూ, వేగంగా దొర్లిస్తూ, ఉధృతంగా పరిగెత్తిస్తూ, జీవితాన్ని గడుపుతున్నది ఈ ముగింపు కోసం కాదు కదా!! నిన్నటి నుంచి కొనసాగాలి, రేపటిలోకి ప్రవహించాలి. ఈ లోకానికి కొంచెం చేర్పు ఇవ్వాలి. కొంత మార్పునివ్వాలి. కొంత ఆశనివ్వాలి. జీవించినంత మేరా మృత్యువు పారిపోవాలి, రోజులు వెలిగిపోవాలి, బతుకు వేడుక కావాలి. కనీసం ఆయుష్షున్నంతవరకు బతికి నిలవాలి. కానీ, ఇదేమిటి? గడప మీదా, దారిలోనూ, నలుగురు కూడిన చోటా ఇట్లా కాపు కాసింది! వేలికొసల మీదా, శ్వాసలోనూ, గుండెలలోనూ గురిపెట్టి నిలిచింది? 


మరణం!!

ఎప్పుడో ఒకప్పుడు వచ్చితీరేదే అయినా, అప్పులవాడిలాగా ఇప్పుడే వచ్చింది. మనుషులు మూగినచోటల్లా ఆకాశం మీద రాబందులా చక్కర్లు కొడుతున్నది. మంద వెనుక చిరుతలా ఆగి ఆగి నడుస్తున్నది. వీధి చివరా, నడిరోడ్డునా, పక్క ఇంట్లోనూ, ఎవరినో ఒకరిని ఊడ్చేస్తున్నది. అతి శీతల మృత్యుపవనం, ఒక విషాదపరిమళం గుప్పున విసురుతున్నది. దుఃఖాన్ని భయం కమ్మేస్తున్నది. చేతులెత్తి మోరలెత్తి రోదించవలసిన చోట, మేను స్థాణువవుతున్నది. ఇంకా బతికి ఉండగానే, గుండెల్లోకి దూరి చావు వెక్కిరిస్తున్నది. 


నూటికి ఒక్కరే కదా, ఇద్దరే కదా, నలుగురే కదా? అని నచ్చచెప్పబోతారు. ముగిసిపోయేది కొందరే కానీ, చావు భయం అందరినీ ఆవరిస్తుంది, కొందరి మెడ మీద కత్తిలా వేలాడుతుంది, వెరసి నూటికి నూరుగురూ వరుసలో నిలబడ్డవారే. ఆరుగజాల దూరం పలకరింపు నవ్వు కింద బెదురు అణగిపోతుంది కానీ, ఎవరి గుండెలో వారికి ఒక స్పీడ్‌ రైలు పరిగెత్తుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా సన్నటి కంపనం వంట్లో ప్రవహిస్తూ ఉంటుంది. 


మొదటి లాక్‌డౌన్‌ వేళకు, వైరస్‌ ఇంకా పొలిమేరల్లోనే ఉంది. చావుల బాజా ఇంకా మొదలుకాలేదు. వలసకూలీల ప్రవాహం రహదారులను ముంచెత్తినప్పుడు, అదే ఉపద్రవంగా కనిపించింది. అనుబంధ విపత్తే అయినా అదీ పెద్ద ఆపదే. వారి చీలిన, పగలిన, నెత్తురోడిన అరికాళ్లు, రైలు పట్టాల మీద ఖండఖండాలుగా పడిఉన్న కళేబరాలు, తల్లి చనిపోయిందని తెలియక నిద్రలేపుతున్న పసిపాప.. ఇటువంటి దృశ్యాలే నాటి మానవీయ సంక్షోభానికి ప్రతీకలుగా నిలిచాయి. బులుగు రంగు ప్లాస్టిక్‌ కవచాల వెనుక మనుషులు గ్రహాంతరవాసులు లాగా కదులుతూ, మృతదేహాలను ఉయ్యాలలూపుతూ కందకంలోకి జార్చే సన్నివేశాలు అప్పటికి ఇంకా రూపొందలేదు. కడచూపులు లేక, కాటి చూపులూ లేక, దగ్గరివారు అల్లాడిపోయే రోజులు ఇంకా రాలేదు. ఊపిర్లు బిగబట్టుకొని ప్రాణభిక్ష కోసం పదుల ఆస్పత్రి గడపలు తొక్కవలసిన గతి అప్పటికింకా రాలేదు.


కొంతకాలం పూర్తిగా స్తంభించిన జనజీవనం, జబ్బు ముదిరిన కొద్దీ సడలడం మొదలుపెట్టింది. అనేకమందికి అవసరం. కొందరికి అజ్ఞానం. కొందరికి అలక్ష్యం. కొందరికి అవకాశం.- ఏదైతేనేమి, ముసుగులు మాత్రం మిగిలి దూరాలు చెరిగిపోయాయి, కరోనా కారుచిచ్చులా వ్యాపిస్తోంది. బహుశా, రోజూ వార్తలు చదివి, లెక్కలు చూసీ ప్రజలకు పరిస్థితి అలవాటు అయి ఉండవచ్చు, అలవాటు అయినా భయం మాత్రం పోలేదు. పోయే అవకాశం దొరకడం లేదు. ఎవరో ఒకరు మిత్రుడో, బంధువో, దగ్గరవారో, దూరం వారో, ప్రసిద్ధుడో- ఎవరో ఒకరిని రాబందు తన్నుకు పోతూనే ఉన్నది. పులిగుహలోకి వెళ్లి తిరిగి వస్తున్న వీరులు చెబుతున్న కథనాలు సహితం గగుర్పాటును కలిగించేట్టే ఉంటున్నాయి. తెలుసా, ప్రాణవాయువు అందక జీవుడెంత నరకం అనుభవిస్తాడో!


కవుల రొమాంటిక్‌ ఊహల్లాగే, దుఃఖాలు కూడా అందమైన కల్పనలే అనుకుంటాం. కానీ కొన్ని సార్లు కవితాన్యాయం అత్యంత అవాంఛనీయ, విదారక సందర్భాలలో కూడా సిద్ధిస్తుంది. ఇప్పుడు మనుషులకు మొదటిది జీవితేచ్ఛ. రెండవది, కనీసపుది చితి-చింత. ఈ అకాలంలో కన్నుమూయకపోతే, ఒక అనామకపు మరణం రాకపోతే, నలుగురు వెంటలేని అంత్యక్రియలను తప్పించుకోవచ్చును కదా- అన్నది బెంగ. కేవలం కుటుంబంతోనే బతికే జీవులకు ఒక బాధ. సమాజమే కుటుంబమైన పరోపకారుల విషయంలో ప్రజలకు మరో బాధ. మనిషి ఉనికికి ఒక ఆరంభం ఉన్నట్టే, ఒక ముగింపూ కావాలి. అసమాపకంగా ఎట్లా కాలిపోతారు, పూడిపోతారు? ఒక ఉసా కోసం ఎన్ని నినాదాలు, ఒక అచ్యుతరావుకు ఎన్ని కృతజ్ఞతలు, ఒక గోవిందుకు ఎన్ని స్నేహాలు బాకీ, ఎందరెందరు ఈ నాలుగునెలల మృత్యుబిలంలో కూరుకుపోయారు, ఎన్నెన్ని తెలిసిన తెలియని జీవకేతనాలు అవనతమయ్యాయి, ఎన్ని సామూహిక స్మరణలు అణగారిపోయాయి? ఎన్ని కన్నీళ్లు విడి చెక్కిళ్ల మీదనే ఇంకిపోయాయి? మరో సందర్భంలో నెరూడా అన్నట్టు ‘‘కళేబరాల కోసం మృత్యువు చీపురులా ముస్తాబై నేలంతా’’ చుట్టేస్తోంది. ‘‘దారం కోసం వెదుకుతున్న సూదికన్ను మృత్యువు’’. జాషువా అన్నట్టు, ఇదొక ముదురు తమస్సు, ఈ ప్రపంచం ఇప్పుడు ‘‘పిశాచులతో నిటాలేక్షణుడు గజ్జె గదిలించి’’ ఆడే రంగస్థలంగా మారిపోయింది. పిశాచులెవరో మనం తేల్చుకోవాలి, చీపురుకు దొరకకుండా ప్రాణం నిలుపుకోవాలి. 


భూగోళం అంతటా ఒక కల్లోలపరిస్థితిని విధించిన క్రిమి కంటె, మనుషుల మధ్య ఉన్న అంతరాలు, ఘర్షణలు, వివక్షలు, అంతస్థులు, స్వార్థాలు పరిస్థితిని ప్రళయంగా మారుస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కి, పెద్దల లాభాలకు మళ్లించిన ప్రభుత్వ బడ్జెట్ల దగ్గర నుంచి ఎన్ని చావులు వచ్చినా సరి, ఒక రోజు కూడా వ్యాపారాలు ఆగకూడదనుకునే అగ్రరాజ్య అహంకారం దాకా- అందరూ మరణవేదనను కొన్ని రెట్లు పెంచుతున్నారు. ఈ ఆపత్కాలం నుంచి కూడా లాభాలను పిండుకోవాలనుకునే స్వార్థం, ఇప్పుడు ఉన్న కొద్దిపాటి ధనాన్ని అయినా ప్రజల కోసం ఖర్చుపెట్టకూడదనుకునే దుర్మార్గం- శ్మశానంలో సృగాలాల్లా- ఈచావు గత్తరలో సంచరిస్తున్నాయి. పరీక్షల కిట్లుకు అయ్యే ఖర్చును కూడా లెక్కలు వేసుకోవడం, మృతుల్లో అధికులు వృద్ధులే కదా, ఏవో రోగాలున్నవారే కదా అని తేలిక చేయడం- ఎంతకీ మరమ్మత్తు జరగని ప్రభుత్వ వైఖరులను చెబుతున్నాయి. ఇళ్లకే పరిమితం కావడం రాజకీయంగా గృహనిర్బంధంగా మారింది. కొరవడిన సామూహికత ప్రభుత్వాలకు ధైర్యం పెంచింది. ఇదే అదను, కష్టమైన, కఠినమైన, వివాదాస్పదమైన పనులన్నిటికీ రాజదండం పదునుపెడుతున్నది.


ఈ చీకటి రోజుల కాలంలో వెలుతురు కలలు కనాలని శాస్త్రం చెబుతున్నది. అనివార్యమైన మృత్యువు గురించి వేదన పడడం తగదని భగవద్గీత చెబుతున్నది. ప్రతిదీ పరిణమిస్తూ ఉంటుంది. జీవితం దీపం అయితే, మరణం నిర్వాణం- అంటుంది బౌద్ధం. ఎన్ని వేదాంతాలు చదివినా, మనిషిని నిలబెట్టేది ప్రాథమికంగా మనుగడ కోసం పోరాటమే. ఈ చీకటిని జయించడం అనివార్యం, వినా గత్యంతరం లేదు. ఆ ధైర్యం మనలో ఇంకే వరకు, మన చుట్టూ గుప్పుగుప్పు మంటున్న దీపనిర్వాణ గంధాన్ని ప్రయత్నపూర్వకంగా ఆస్వాదించాలి, లోలోపలి దీపాన్ని వెలిగించుకోవాలి.


ఒకే సమయంలో వైభవాన్ని, బీభత్సాన్ని చూసిన కాలాన్ని వర్ణించిన డికెన్స్‌ ‘‘ఎ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌’’ను సృజనాత్మకంగా తెలుగించాడు తెన్నేటి సూరి. ఆ నవల ఆరంభ వాక్యాలు ‘‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’’. వర్తమానంలో వైభవమేముందో కనిపించడం లేదు కానీ, ప్రస్తుతం మాత్రం వల్లకాటి అధ్వాన్న శకం. ప్రతి శకమూ అంతరిస్తుంది. మనిషిని- మరణం కాదు- జీవితం నానావిధభాషలతో పిలిచే రోజు వస్తుంది.





కె. శ్రీనివాస్

Updated Date - 2020-07-30T06:38:25+05:30 IST