వాల్మీకుల కన్నెర్ర

ABN , First Publish Date - 2021-09-06T06:13:37+05:30 IST

ప్రభుత్వ పథకాలకు..

వాల్మీకుల కన్నెర్ర
సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొండా తౌడన్న

నిన్న చైల్డ్‌ ఇన్ఫో.. నేడు నవశకం

వెబ్‌సైట్‌లలో తెగ పేరు కనిపించకపోవడంపై ఆందోళన

తక్షణం ప్రభుత్వం జరిగిన తప్పును సరిదిద్దాలని డిమాండ్‌


చింతపల్లి(విశాఖపట్నం): ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌లలో సామాజిక వర్గం కాలమ్‌లో ‘వాల్మీకి’ అనే ఆప్షన్‌ కనిపించకపోవడంతో ఆ వర్గానికి చెందినవారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...


విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు 70,513 మంది ఉన్నారు. గిరిజన జాతుల్లో వాల్మీకి ఒక ప్రధాన తెగ. ఈ తెగకు చెందినవారు పలువురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుత అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారే. అయితే వారం కిందట పాఠశాల ప్రవేశాలకు చైల్డ్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌లోని ఎస్టీ జాబితాలో వాల్మీకి తెగ కనిపించకుండాపోయింది. ఈ విషయాన్ని గిరిజన ప్రాంత నాయకులు... మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐదు రోజుల కిందట చైల్డ్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌లో వాల్మీకి తెగను పొందుపరిచారు. తాజాగా చేయూత, వాహనమిత్ర లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నవశకం వెబ్‌సైట్‌లో చూస్తే ఎస్టీ జాబితా ఆప్షన్‌లో వాల్మీకి తెగ కనిపించడం లేదు. దీంతో ఆ రెండు పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వాల్మీకి కులస్థులు కోల్పోతున్నారు.


ఈ నేపథ్యంలో ఏజెన్సీవ్యాప్తంగా వాల్మీకి కులస్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం నవశకం వెబ్‌సైట్‌లో వాల్మీకి తెగను పునరుద్ధరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని చింతపల్లి వాల్మీకి సంఘం నాయకుడు రీమల మౌళి తెలిపారు. ఈ విషయమై చింతపల్లి ఎంపీడీవో లాలం సీతయ్య వివరణ కోరగా సాంకేతిక సమస్య కారణంగా వాల్మీకి తెగ కనిపించడం లేదని, పాడేరు ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతామన్నారు. 

Updated Date - 2021-09-06T06:13:37+05:30 IST