
ఈదేశ మూలవాసులలో ఒక తెగ వాల్మీకి బోయలు. ఈ దేశానికి రాజైన రాముని చరిత్రను, విశిష్ట సంస్కృతిని తర్వాతి తరాలకు అందించిన చరిత్ర బోయలది. ఆకలి కోసమే మనుషులతోను, క్రూరమృగాలతోను పోరాటం చేసిన జాతి. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా బానిస సంకెళ్ల విముక్తి కోసం స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని ఎందరినో అమరులుగా అర్పించుకున్న జాతి. అప్పుడు వారు ఒక గిరిజన తెగగా ఉన్నారు. ఇప్పటికీ వారి ఆచార, సాంస్కృతిక, సాంప్రదాయాలు ఆదివాసుల సంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాలకులుగా బోయ కొట్టాలనే రాజ్యాలను పరిపాలించారు. స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వ పరిపాలన కాలంలో కూడా ఎస్టీలుగా ఉన్న వాల్మీకి బోయలను తర్వాత బీసీ ‘ఏ’లోకి మార్చారు. అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఒక రాజకీయ క్రీడ. దాని ఫలితంగా నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వారి అస్తిత్వానికి, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సమానత్వానికి పెను సవాలు ఎదురవుతున్నది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఒక్కోరకంగా రిజర్వేషన్లను పొందుతున్నరు వాల్మీకి బోయలు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో వాల్మీకి బోయలు ఎస్సీలలో అత్యధిక జనాభాగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎస్సీలుగా, ఎస్టీలుగా, ఆదివాసీలుగా, అత్యంత వెనుకబడిన జాతులుగా విభజించబడ్డారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు ఇతర రాష్ట్రాలలో ఎస్టీలుగా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులుగా కొనసాగుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వాల్మీకి బోయలు కొందరు మౌలిక వసతులు ఉండని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించలేక, విద్యకూ వైద్యానికీ ఉపాధికీ వ్యాపారానికీ రవాణాకూ సాంకేతికతకూ దూరంగా ఉండలేక మైదాన ప్రాంతాలకు మారారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు పెద్దపెద్ద ప్రాజెక్టుల, బడా కంపెనీల పేరుతో వేల ఎకరాల అడవులను ధ్వంసం చేసి పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కూడా దీనికి కారణమైంది. వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం, మంచి జీవన విధానం కోసం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. అదే కారణంతో వారిని బీసీ ‘ఏ’గా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ ద్వారా పొందే అన్ని అవకాశాలకూ వారిని దూరం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు రోజురోజుకు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో బోయలు అప్రమత్తమై చిరకాల కోరిక అయిన ఎస్టీ రిజర్వేషన్‌ను సాధించాలన్న పట్టుదలతో దశాబ్దాలుగా అడపాదడపా ఉద్యమాలు, వినతులు చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులకు మోకరిల్లితున్నారు. అయినా వారి విన్నపాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఎలాంటి కులవృత్తీ లేని వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపి తీరుతాం అని తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాతా టీఆర్ఎస్ ప్రభుత్వం గద్వాల గడ్డపై హామీ ఇవ్వటంతో బోయలు సంబరపడి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తాము అసెంబ్లీలో బిల్లు పెట్టి ముస్లిం రిజర్వేషన్లతో పాటు కలిపి ఒకే బిల్లుగా కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పింది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం మాకు పంపలేదని, మళ్లీ ఒకసారి విడిగా బిల్లు పాస్ చేసి పంపమని చెప్పింది. అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కూడా ఎస్టీ రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చింది. తర్వాత అది అలా మరుగునపడిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు వనపర్తి బహిరంగ సభలోను కేసీఆర్ వాల్మీకుల రిజర్వేషన్లపైన మాట్లాడారు. కానీ వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అని కచ్చితంగా చెప్పలేదు. ఆయన ప్రసంగమంతా దాటవేత ధోరణిలో ఉంది. అటు మెజార్టీ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. దీంతో వాల్మీకి బోయల రిజర్వేషన్లు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాల్మీకి బోయలు ఎస్టీ రిజర్వేషన్ లేకపోవటం వల్ల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అనేక అవకాశాలను కోల్పోయారు. ఈ రంగాల్లో మొత్తం కలిపితే వారు పొందిన అవకాశాలు మైనస్ శాతంలో ఉన్నాయి. ఈ కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్‌ను సాధించలేకపోవటానికి వాల్మీకి బోయల అనైక్యతే, బలహీనతే ప్రధాన కారణంగా కనిపిస్తుంది, దాన్ని వివిధ రాజకీయ పార్టీలు అవకాశంగా వాడుకుంటున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల వాల్మీకి బోయ జనాభా ఉంటుంది. దాదాపు ఎనిమిది నియోజకవర్గాలలో బోయల ప్రభావం గెలుపు ఓటములపై అత్యంత బలంగా ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో వీరు ఎటువైపు ఉంటే అటు గెలిచే అవకాశం ఉంది. అయినా సరే ఏ పార్టీ కూడా బోయలను ఎస్టీల్లో చేర్చడానికి జరుగుతున్న పోరాటాలకు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ బోయల ప్రభావం చాలా బలంగా దాదాపు 70 లక్షల జనాభాతో ఉంది. కానీ ఆ ప్రభుత్వమూ వారి అభివృద్ధిని కోరుకోవడం లేదు. ఎస్టీ రిజర్వేషన్‌కు మద్దతు ఇవ్వకుండా రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు బోయలను బలిపశువులు చేశారు. వివిధ పార్టీలు వారిని జెండాలు మోసే బానిసలుగా ఉపయోగించుకుంటున్నాయి.
ప్రస్తుతం బోయ కులానికి చెందిన మేధావులను, ప్రొఫెసర్లను, పరిశోధక విద్యావంతులను, అన్ని పార్టీల రాజకీయ నాయకులను, కుల సంఘాల పెద్దలను, యువతీ యువకులను... ఇలా అందరినీ కలుపుకొని ఒక సమగ్రమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎస్టీ రిజర్వేషన్స్ సాధన కోసం ఉద్యమం చేయడానికి ఇదే సరైన తరుణమని వాల్మీకి బోయలు భావిస్తున్నారు. ఆదివాసీలు ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్ కోరుతున్నాం గనుక అందుకు చిహ్నంగా ఆకుపచ్చ జెండాను చేపట్టాలని కోరుతున్నాను. ఆకుపచ్చ జెండానే ఎందుకు ఉండాలని సందేహం రావచ్చు. ఏజెన్సీ ప్రాంతాలలో, అడవులలో స్వచ్ఛమైన కొండలు గుట్టల ప్రాంతంలో నివసించే తెగలకు ఆకుపచ్చ జెండా సరైన చిహ్నం. ఆదివాసి తెగలలో వాల్మీకి బోయ జాతి కూడా ఒకటి కనుక ఆకుపచ్చ జెండాను పట్టి ఉద్యమ సమర శంఖం పూరించాలని కోరుతున్నాను.
రేమద్దుల మండ్ల రవి
ఉస్మానియా యూనివర్సిటీc