వామ్మో..‘రెవెన్యూ’

ABN , First Publish Date - 2022-05-16T06:42:42+05:30 IST

తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపనికి ధరలు నిర్ణయించి సిబ్బంది, అధికారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

వామ్మో..‘రెవెన్యూ’
ముండ్లమూరులోని తహసీల్దార్‌ కార్యాలయం

తహసీల్దార్‌ కార్యాలయాల్లో పెరిగిన అవినీతి

ప్రతిపనికీ డబ్బులు వసూలు 

పాసుపుస్తకాల కోసం  ఎదురుచూపు

ఏసీబీని ఆశ్రయిస్తున్న రైతులు

దర్శి, మే 15 :  తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపనికి ధరలు నిర్ణయించి సిబ్బంది, అధికారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. వీఆర్వో నుంచి తహసీల్దార్‌ వరకు ఎవరి స్థాయిలో వారు వసూళ్ల పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రైతులు పాసుపుస్తకాల కోసం ఆన్‌లైన్‌ చేయించుకునేందుకు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇక కొత్తగా జారీచేసే పట్టాదారు పాసుపుస్తకాలు నేరుగా పోస్టల్‌ శాఖ రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్నా.., అవి తహసీల్దార్‌ కార్యాలయాలకే వెళుతున్నాయి. దీంతో ముడుపులు చెల్లించి ఆ పాసుపుస్తకాలను రైతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.  నిబంధనలు ఇక్కడ పనిచేయవు. ఏ పని కూడా ప్రభుత్వం పెట్టిన గడువులోపు పూర్తికాదు. అలా కావాలంటే కార్యాలయ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. 

అడపాదడపా వెలుగుచూస్తున్నా..

ముండ్లమూరు మండలంలో గతంలో ఇద్దరు తహసీల్దార్‌లు, ముగ్గురు వీఆర్వోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో వారు సస్పెండ్‌ కాగా, ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఆ మండలంలో మళ్లీ ఇటీవల కాలంలో మళ్లీ అవినీతి అక్రమాలు పెరిగాయి. దీంతో శుక్రవారం కూడా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

- ముండ్లమూరు రెవెన్యూలోని ఒక సర్వేనంబరులో  126 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి రికార్డులు క్రమబద్దీకరించేందుకు సుమారు రూ.40 లక్షలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిదంగా మరో సర్వేనంబరులో 120 ఎకరాలు భూమి ఉండగా హక్కుదారులను రికార్డుల్లో ఎక్కించేందుకు రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల శ్మశాన భూములను కూడా ఆక్రమించుకున్నవారికి ఆండగా ఉండి లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి.

- కురిచేడు మండలంలోని పొట్లపాడు రెవెన్యూలో ప్రభుత్వ భూమిని ఏకంగా అక్రమార్కులకు ఆన్‌లైన్‌ చేశారు. గతంలో అక్కడ పనిచేసిన ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వరకుమార్‌ సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. పొట్లపాడు రెవెన్యూలోని 526/3, 626/2, 623/2, 85/2 తదితర సర్వేనంబర్లల్లోని 42.70 ఎకరాల ప్రభుత్వ భూమిని నీలకంఠం ప్రభాకర్‌ అనే వ్యక్తి పేరుతో 19-7-2021లో ఆన్‌లైన్‌ చేశారు. అదేవిదంగా పొట్లపాడు రెవెన్యూలోని 635/1, 627/1, 81/4 తదితర సర్వేనంబర్లల్లోని 38.69 ఎకరాల ప్రభుత్వ భూమిని చింతా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 20-7-2021 ఆన్‌లైన్‌ చేశారు. ప్రభుత్వ భూమి 80 ఎకరాలను ఏకంగా ఇద్దరు వ్యక్తులకు కట్టబెట్టడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. అనంతరం లోకాయుక్తలో కేసు  నమోదు కావడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే మండలంలో ఏడాది క్రితం వీఆర్‌వో నాగరాజు, అంతకుముందు వీఆర్‌వో చెన్నక్రిష్ణయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే.

- దర్శి తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టాభూములను ఉద్దేశపూర్వకంగా 22ఏలో కలిపి బాధిత రైతుల వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హక్కులు కల్గిన రైతులు ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ఏళ్ల తరబడి  తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

రాజంపల్లిలో ఒక సర్వేనంబరులోని పట్టాభూమిని చెరువు భూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. ఆ భూమికి సంబంధించి సెటిల్‌మెంట్‌ కోర్టు ద్వారా రైతులు పట్టా పొంది పూర్తి హక్కులు కలిగి ఉన్నారు. రికార్డుల్లో క్రమబద్ధీకరించి ఏళ్లక్రితం వారికి పాసుపుస్తకాలు ఇచ్చారు. రికార్డులు క్రమబద్ధీకరణ సమయంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా రికార్డుల్లో 22ఏగా నమోదు చేశారు. రైతులు ఆ భూమిని తమ పేరుతో రికార్డుల్లో మార్చుకు నేందుకు రూ.8లక్షలు ముడుపులు చెల్లించినట్లు తెలిసింది. అయినప్పటికీ పనులు జరగలేదు. అప్పుడు ఉన్న అధికారులు ఎవ్వరూ ప్రస్తుతం ఇక్కడ లేరు. రైతులు ఇచ్చిన లక్షలాది రూపాయల డబ్బు వృథాకాగా, నేటికీ వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

- అక్కమాంబపురం రెవెన్యూలో కూడా అనేక పట్టాభూములను అధికారులు ఉద్దేశపూర్వకంగా 22ఏలో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. పూర్వికుల నుంచి అనుభవిస్తున్న భూములను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో చేర్చడంతో కడుపుమండిన రిటైర్డ్‌ ఉద్యోగి ఒకరు రెవెన్యూ అధికా రులపై కోర్టులో దావా వేశారు. ఇక వివాదాల్లో ఉన్న భూములను అక్రమార్కులకు కట్టబెట్టి అధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 

దర్శి మండలంలో కొన్ని నెలల క్రితం వివాదంలో ఉన్న ఆరు ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేసి రెవెన్యూ అధికారులు రూ.3లక్షలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం అదేవిధంగా మరో 4 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేసి రెండు లక్షలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం.

 దొనకొండ, తాళ్లూరు మండలాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరుగుతున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు దర్జాగా  ముడుపులు తీసుకొని అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఏసీబీ దాడులతో వెలుగులోకి...

రెవెన్యూ అధికారుల అక్రమాలపై ప్రజలు కడుపుమండి ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలు పెచ్చుమీరడంతో అనేకమంది రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. అక్కడ తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులకు ఇవ్వాల్సిన పాసుపుస్తకాలు దొరికాయి. ఇద్దరు సిబ్బంది వద్ద వేలాది రూపాయల నగదు పట్టుబడింది. ఇప్పటికైనా అధికారులు రెవెన్యూ అక్రమాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేసి ప్రజలకు సత్వర సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-16T06:42:42+05:30 IST