జూలై నెలాఖరుకు వంశ‘ధార’!

ABN , First Publish Date - 2021-02-26T05:24:13+05:30 IST

వంశధార రిజర్వాయర్‌ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శివరాంప్రసాద్‌ అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం హిరమండలంలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులతో పాటు వంశధార-నాగావళి అనుసంధాన పనులను పరిశీలించారు. అనంతరం భామిని మండలంలో 87,88 ప్యాకేజీ పనులపై ఆరాతీశారు. పనుల పురోగతిపై వంశధార అధికారులు, కాంట్రాక్టర్‌ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

జూలై నెలాఖరుకు వంశ‘ధార’!
హిరమండలం రిజర్వాయర్‌ వద్ద హైలెవల్‌ కెనాల్‌ పనులు పరిశీలిస్తున్న సిఈ శివరాంప్రసాద్‌

పనులు త్వరిగతిన పూర్తిచేయండి

జాప్యం చేస్తే చర్యలు తప్పవు

ఉత్తరాంధ్ర చీఫ్‌ ఇంజనీర్‌ శివరాంప్రసాద్‌

హిరమండలం/భామిని, ఫిబ్రవరి 25: వంశధార రిజర్వాయర్‌ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శివరాంప్రసాద్‌ అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం హిరమండలంలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులతో పాటు వంశధార-నాగావళి అనుసంధాన పనులను పరిశీలించారు. అనంతరం భామిని మండలంలో 87,88 ప్యాకేజీ పనులపై ఆరాతీశారు. పనుల పురోగతిపై వంశధార అధికారులు, కాంట్రాక్టర్‌ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 37,000 క్యూబిక్‌ మీటర్లు మట్టి పని జరుగుతోందని ఎస్‌ఈ డి.తిరుమలరావు వివరించారు. జూలై 21 వరకూ గడువు ఉన్న దృష్ట్యా రోజుకు సగటున 50 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాలని సీఈ సూచించారు. యంత్రాలతో పాటు కూలీల సంఖ్య పెంచాలని కాంట్రాక్టర్‌ ప్రతినిధులను ఆదేశించారు. దీనిపై సోమా కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆరు నెలల పనులకు సంబంధించి రూ.12 కోట్లు బిల్లుల బకాయి ఉందని సీఈ దృష్టికి తీసుకొచ్చారు. మంజూరు చేసే మెటీరియల్‌ కొనుగోలు చేసి పనులు వేగవంతం చేస్తామన్నారు. దీనిపై సీఈ స్పందిస్తూ బిల్లుల చెల్లింపుపై దృష్టిపెడతామని.. పనులు గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఖరీఫ్‌ నాటికి వంశధార-నాగావళి అనుసంధాన పనులు పూర్తిచేయాలన్నారు. 46,000 క్యూబిక్‌ మీటర్ల పనులు చేయాల్సి ఉండగా.. రోజుకు 150 క్యూబిక్‌ మీటర్లు జరుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 400 క్యూబిక్‌ మీటర్ల పనిచేస్తే కానీ గడువులోగా పూర్తిచేయలేమన్నారు. ఇక నుంచి ప్రతీ వారం పనులపై సమీక్షిస్తానని సీఈ చెప్పారు. పనులు పురోగతిని అనుసరించి బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. 


పురోగతి లేకపోతే.. కాంట్రాక్టర్‌ను మార్చండి 


భామిని మండలంలో కాట్రగడ ఓపెన్‌ హెడ్‌, సైడ్‌ వీయర్‌, హెడ్‌ రెగ్యులేటర్‌, కాలువలైనింగ్‌ పనులు, సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, ఎస్‌కేపింగ్‌ కాలువలో చేపడుతున్న పనులను సీఈ శివరాంప్రసాద్‌  పరిశీలించారు. పనుల్లో జాప్యంపై ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరలో పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసిందని, ఈ మేరకు అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయకపోతే.. మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఆయన వెంట వంశధార ఎస్‌ఈ  డోల తిరుమల రావు, ఈఈలు సుశీల్‌కుమార్‌, రామచంద్రరావు, డీఈలు బ్రహ్మానందం, మురళీకృష్ణ,  డీఈఈలు భవానీ శంకర్‌, సుశీలరాణి, ఎం.ము రళీధర్‌,  ఏఈలు ఉన్నారు. 


Updated Date - 2021-02-26T05:24:13+05:30 IST