డిసెంబరులో వంశధార

ABN , First Publish Date - 2022-06-28T05:39:58+05:30 IST

వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ను డిసెంబరు నాటికి జాతికి అంకితం చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. సోమవారం జగన్‌ జిల్లా పర్యటనకు విచ్చేశారు. స్థానిక కేఆర్‌ స్టేడియంలో ‘అమ్మఒడి’ మూడో విడత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ సభలో మాట్లాడారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు.

డిసెంబరులో వంశధార
నమూనా చెక్కు అందజేస్తున్న సీఎం జగన్‌

చివరి దశకు పనులు
అమ్మఒడి ప్రారంభ సభలో సీఎం జగన్‌
జిల్లాలో కీలక ప్రాజెక్టులకు నిధుల విడుదల
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 27:
వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ను డిసెంబరు నాటికి జాతికి అంకితం చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. సోమవారం జగన్‌ జిల్లా పర్యటనకు విచ్చేశారు. స్థానిక కేఆర్‌ స్టేడియంలో ‘అమ్మఒడి’ మూడో విడత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ సభలో మాట్లాడారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ రూ.2,407 కోట్లతో పనులు చేసినట్టు తెలిపారు. నేరడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం జాప్యమయ్యే అవకాశమున్నందున గొట్టాబ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మించి రిజర్వాయర్‌లోకి నీరు చేరుస్తామని ప్రకటించారు. ఇందుకుగాను రూ.189కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సవరించిన అంచనాలతో రూ.885 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఉద్దానానికి శుద్ధ జలాలు అందించేందుకు సమగ్ర మంచి నీటి పథకాన్ని రూ.700 కోట్లతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. పాతపట్నం నియోజకవర్గంలో మరో మూడు మండలాలను పథకంలో చేర్పించామని.. అదనంగా రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కేఆర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.10 కోట్లు, శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును నాలుగు లేన్లగా విస్తరణకు రూ.18 కోట్లు, కలెక్టరేట్‌కు రూ.69 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

మంచి కార్యక్రమాలను గుర్తుంచుకోండి
ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను ప్రజలు గుర్తించుకోవాలని సీఎం జగన్‌ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 96 వేల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్ల నగదును జమచేస్తున్నామని చెప్పారు. ఈ మూడేళ్ల కాలంలో కేవలం విద్యారంగం కోసమే రూ.52 వేల 600 కోట్లు ఖర్చుచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని వివరించారు. పాఠశాలలపై బాధ్యత ఉండాలని.. నిర్వహణ ఖర్చులు కిందట రూ.2 వేలను మళ్లించినట్టు తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకునే పనిలేదన్నారు.

సీఎం పర్యటన సాగిందిలా..
సీఎం జగన్‌ ఉదయం 10.25 గంటలకు శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. మంత్రులు, అధికారులు, వైసీపీ కీలక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి 80 అడుగుల రోడ్డు, పాత బస్టాండ్‌, ఏడురోడ్ల జంక్షన్‌, డేఅండ్‌ నైట్‌ కూడలి మీదుగా కేఆర్‌ స్టేడియం సభాస్థలికి 11.14 గంటలకు చేరుకున్నారు.  మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ప్రసంగం అనంతరం 12.05  గంటలకు సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభించారు. 12.54 గంటలకు బటన్‌ నొక్కి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 12.57 గంటలకు సభ నుంచి తిరిగి బయలుదేరారు. మధ్యాహ్నం 1.10 గంటలకు హెలికాప్టర్‌పై విశాఖకు బయలుదేరారు.

Updated Date - 2022-06-28T05:39:58+05:30 IST