వాన అంతంతే!

ABN , First Publish Date - 2022-07-04T05:05:46+05:30 IST

వాన అంతంతే!

వాన అంతంతే!
కల్వలలో పసుపు పంటలో కలుపు తీస్తున్న రైతులు

గతనెల సాధారణ వర్షమే

జిల్లాలో కురియని భారీ వర్షాలు

బయ్యారం, గంగారంలో తక్కువ.. 12 మండలాల్లో కొంత మెరుగు

జూలై, ఆగస్టులో కురిసే వర్షాలపైనే రైతన్న ఆశలు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జూలై 3 : నైరుతి రుతుపవనాలు ప్రవే శించినా ఇప్ప టికీ భారీ వానలు పడలేదు. జూన్‌లో వానాకాలం ప్రారంభమైనా అంతంత మాత్రమే వర్షాలే కురిశాయి. జిల్లాలోని 12 మండలాల్లో గత నెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. బయ్యారం, గంగారం మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా పడింది.


జూన్‌ నెలలో మాములు వానలే పడ్డా యి. జిల్లాలో భారీ వర్షాలు కురియలేదు. అరకొర వర్షాలతో వ్యవసాయ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జూన్‌లో ఆశించిన రీతిలో వర్షాలు కురియకపోవడంతో ఈ జూలై, ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. 


93,142 ఎకరాల్లో మాత్రమే పంటల సాగు..

ప్రస్తుత వానాకాలంలో 3,27,080 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంట లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 93,142 ఎకరాల్లో మాత్రమే వేశా రు. పత్తి 95,881 ఎకరాల సాధారణ విస్తీర్ణం 78,797 ఎకరాల్లో, మొక్కజొన్న 31,375కి బదులగా 7,943 ఎకరాల్లో, పెసర్లు 15,792కు గాను 3,375 ఎకరాల్లో, మినుములు 140 గాను 10 ఎకరాలు, కందులు 4, 908కి గాను 1987 ఎకరాల్లో, జొన్నలు 330కి గాను 30 ఎకరాలు, పసు పు 8526కి గాను 1010 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. నువ్వులు, పొగాకు, చెరుకు, మిర్చి, వరి ఇంకా వేయలేదు. వర్షాలు అడపాదడప కురుస్తోండటంతో రైతులు విత్తనాలు వేయడానికి కొంతమేర వెనుకంజ వేస్తున్నారు. 


ముమ్మరంగా పనులు..

ప్రస్తుత వానల నేపథ్యంలో రైతులు తమ చెలకల్లో, తోటల్లో పను లు చేస్తూ బిజీబిజీగా మారిపోయారు. తొలకరి జల్లులతో వేసిన పం టలు మొలకెత్తాయి. వివిధ తోటల్లో కొంతమంది మొక్కలకు ఎరువులు చల్లుతుండగా మరి కొంతమంది రైతులు, కూలీలు చేలలో పెరిగిన కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. వరి వేయడానికి నారు పెంచుతుండగా (నర్సరీ) నారు మడులు మాత్ర ఇంకా సిద్ధం చేయలేదు. 


వర్షాల వల్ల ఆలస్యం.. 

ఈ వానాకాలం సీజన్‌లో వర్షాలు ఆలస్యమయ్యాయి. వరిలో మాత్రం నేరుగా విత్తనం వెదజల్లే పద్ధతిలో వేసుకోవడానికి రైతు లు సమాయత్తమవుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జూలై 15 వరకు వరినాట్లు వేసుకోవాల్సి ఉండగా, వాన లు ఆలస్యమవుతోండటంతో ఈనెల 20వ తేదీ నుంచి 25 వరకు వేసుకోనున్నారు. 130-140 పంటకాలంలో వచ్చే పంటలైన 1001 రకం, కేఎన్‌ఎం 118, కునారం సన్నాలు, ఎంటీయూ 1224, జగిత్యాల 24,423, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, జైశ్రీరాం, మహారాజ లాంటి సన్నరకాలను నాటనున్నారు. వర్షాలు ఆలస్యమైతే మా త్రం 120 రోజుల పంట అయినా స్వల్పకాలిక రకాలను సాగు చేయనున్నారు. ఈ సారి పత్తి విస్తీర్ణం పెరిగి మిర్చి విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. 


జూన్‌లో 12 రోజులే కురిసిన వర్షం..

వానాకాలం సీజన్‌ ప్రారంభమైన జూన్‌ నెలలో కొన్ని మండలాల్లో 8 రోజులు, మరికొన్ని మండలా ల్లో 9, 10, 12 రోజుల వరకు వర్షం కురిసింది. 1వ తేదీన పలు మండలాల్లో చిన్నపాటి జల్లులు కురిసి మొఖం చాటేసిన వర్షాలు 13 నుంచి కొత్తగూడ, డోర్నకల్‌, గూడూరు మండలాల్లో కురిసిన వర్షం 14నుంచి అన్ని మండలాలకు విస్తరించింది. 


బయ్యారంలో 140.6 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం కురియాల్సి ఉండగా, 107.3 మి.మీ వర్షం కురిసింది. మైనస్‌ వర్షపాతం 24.0 మి.మీ వర్షపాతం లోటుగా గుర్తించారు. గంగారంలో 161.9 మి.మీ సాధారణ వర్షపాతం కాగా, 125.3 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. మైనస్‌ 23.0 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. దంతాలపల్లిలో 125.3 మి.మీ సాధారణ వర్షపాతం కాగా, 145.9 మి.మీ వర్షం కురిసింది. కొత్తగూడలో 161.9 కాగా, 171.3 మిల్లిమీటర్ల వాన పడింది. 


వర్షపాతం ఇలా..

జూన్‌లో వర్షపాతం ఇలా ఉంది. గార్లలో 126.1 మిల్లిమీటర్లకు గాను 203.0 మి.మీ డోర్నకల్‌లో 119.8మి.మీగాను 162.0 మి.మీ, కురవి లో 121.1 మి.మీగాను 170.8 మి.మీ, మహబూబాబాద్‌లో 134.6 మి.మీకు  231.3 మి.మీ, గూడూరులో 164.2 మి.మీకు 275.8 మి.మీ, కేసముద్రంలో 135.8 మి.మీకు 252.2 మి.మీ, నెల్లికుదురులో 128.8 మి.మీకు 263.9మి.మీ, నర్సిహులపేటలో 120.1మి.మీకు 162.8, చిన్నగూడూరులో 120.8మి.మీకు 196.3 మి.మీ, మరిపెడలో 120.8మి.మీకు 225.9 మి.మీ, తొర్రూరులో 107.2మి.మీకు 198.7మి.మీ, పెద్దవంగరలో 102.4మి.మీకు గాను 202.8మి.మీ వర్షపాతం నమోదైంది. 


వర్షాలు పడుతాయి.. ఆందోళన వద్దు : చతృనాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి 

 కొంతమేర ఆలస్యమైనా ఈ నెలలో వర్షాలు అధికంగానే కురుస్తాయి. జూలై 31 వరకు వరినాట్లు వేసుకోవచ్చు. ఈ సారి నేరుగా విత్తనాలు వేదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ విధానంలో నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షాలు కురియక ఆలస్యం జరిగితే స్వల్పకాలిక పంటలు పండించవచ్చు. వానలు పడుతాయి, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు.



Updated Date - 2022-07-04T05:05:46+05:30 IST