అకాల కష్టం

ABN , First Publish Date - 2022-05-26T06:19:53+05:30 IST

అకాలకష్టం రైతును నిలువునా ముంచేసింది.. కోలుకోనీయకుండా చేసేసింది.

అకాల కష్టం
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో నేలనంటిన అరటి పంట

ఈదురుగాలులతో నేలకొరిగిన ఉద్యాన పంటలు

571 హెక్టార్లలో   పంటకు నష్టం

561 హెక్టార్లలో నేలనంటిన అరటి

మామిడి రైతు కుదేలు

ఆందోళనలో  రైతాంగం

ట్రాన్స్‌కోకు రూ. 50 లక్షల నష్టం



 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 అకాలకష్టం రైతును నిలువునా ముంచేసింది.. కోలుకోనీయకుండా చేసేసింది.. ఏదో పంట చేతికి వస్తుం దనుకునేలోపే ప్రకృతి ప్రకోపిస్తోంది..రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. నిన్న మొన్నటి వరకూ అసని తుఫాన్‌ అన్నదాతను భయపెట్టింది.. కనీసం మాసూళ్లు చేసుకోవడానికి భయపడేంతగా చుట్టుముట్టేసింది. ఏదో ఆగిందిలే అనుకున్నారు. రైతులు ఎవరి పనిలో వాళ్లు పడ్డారు. వరి రైతు గట్టెక్కాడులే అనుకుంటే.. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మిగిలిన పంటలు నేలవాలాయి. అరటి, మామిడి, జీడిమామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆకస్మికంగా వచ్చిన గాలి వాన కారణంగా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం, నిడదవోలు ప్రాంతాల్లో ఎక్కువ పంట నష్టపోయింది. ఉద్యాన పంటలకు ఉండ్రాజవరం 475 హెక్టార్లలో, పెరవలి 49 హెక్టార్లు, గోపాలపురం 4 హెక్టార్లు, నిడదవోలు 33 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.. మొత్తం ఉద్యాన పంటలకు  571 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు సమాచారం. 838 మంది రైతులు దెబ్బతిన్నారు.ఈ మొత్తంలో అరటికి ఏకంగా  561 హెక్టార్లలో దెబ్బతింది. అరటి రైతుకు హెక్టారు రూ.25 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తారని జిల్లా ఉద్యానవన శాఖాధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. గాలివాన కారణంగా పాత తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్‌ శాఖకు సుమారు రూ.50 లక్షల నష్టం వచ్చిందని ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌మూర్తి తెలిపారు. అనేక చోట్ల చెట్లు పడిపోవడంతో 160 విద్యుత్‌ స్థంభాలు, 40 ట్రాన్ఫ్‌పార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. బుధవారం సాయంకాలానికి  అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా ఇచ్చినట్టు తెలిపారు. 


జిల్లాలో 497 మి.మీ వర్షపాతం నమోదు


జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకూ 497 మి.మీ వర్షపాతం నమోదైంది.జిల్లా సగటు వర్షపాతం 26.2 మి.మీగా నమోదైంది.  అత్యధికంగా నల్లజర్ల మండలంలో 73.4 మి.మీ అత్యల్పంగా కోరుకొండలో 1.4 మి.మి వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా రాజమహేంద్రవరం అర్బన్‌ 17.2 మి.మీ, రాజమహేంద్రవరం రూరల్‌ 18.8, రాజానగరం 9.4, కడియం 4.8, కోరుకొండ  1.4, గోకవరం 18.6, సీతానగరం 5, బిక్కవోలు 26.2, అనపర్తి 34, రంగంపేట 6.8 , కొవ్వూరు 16.4, చాగల్లు 27.8, నిడదవోలు 24.6, ఉండ్రాజవరం 63.2, పెరవలి 44, నల్ల జర్ల 73.4, తాళ్లపూడి 9.2, గోపాలపురం 43.4, దేవరపల్లి 52.8 మి.మీ.వర్షపాతం నమోదైంది.




Updated Date - 2022-05-26T06:19:53+05:30 IST