గగ్గోలు పెడుతున్నVanama Raghava బాధితులు..ఒక్కొక్కటిగా వెలుగులోకి అరాచకాలు..

ABN , First Publish Date - 2022-01-11T17:07:29+05:30 IST

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి...

గగ్గోలు పెడుతున్నVanama Raghava బాధితులు..ఒక్కొక్కటిగా వెలుగులోకి అరాచకాలు..

ఆయనో ఎమ్మెల్యే కుమారుడు. తన తండ్రి అధికారం మాటున షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసు కేసులు కూడా నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే కుమారుడు. ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏవి? వాటిలో వాస్తవమెంత? అనే విషయాన్ని ఏబీఎన్-ఇన్‌సైడ్ స్టోరీలో తెలుసుకుందాం...


ఒక్కొక్కటిగా వెలుగులోకి వనమా రాఘవ అరాచకాలు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో రాఘవ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత రాఘవ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రాఘవ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ.. సెటిల్‌మెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తన మాట వినని వారిపై దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాఘవ బాధితులు చెబుతున్నారు. 


ప్రధాన నిందితుడుగా రాఘవ..

మూడు నెలల క్రితం పాల్వంచకు చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. తాను వనమా రాఘవ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నాడు. వెంకటేశ్వరరావు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో ప్రధాన నిందితుడుగా వనమా రాఘవను చేర్చారు. ఇక రామకృష్ణ అనే వ్యక్తి కూడా.. తాను, తన కుటుంబం రాఘవ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నారు. ఈ కేసులోనూ రాఘవ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. పాల్వంచ పోలీసులు 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఇలా వరుస ఘటనలు, కేసులు రాఘవ వేధింపులు, అరాచకాలకు అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 


పోలీసులు సైతం రాఘవ అడుగులకు మడుగులొత్తుతూ... ఆయన చెప్పిందల్లా చేస్తూ.. వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-01-11T17:07:29+05:30 IST