రాఘవ చుట్టూ బిగిసిన ఉచ్చు

ABN , First Publish Date - 2022-01-07T06:46:29+05:30 IST

రాఘవ చుట్టూ బిగిసిన ఉచ్చు

రాఘవ చుట్టూ బిగిసిన ఉచ్చు
సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న రామకృష్ణ

సంచలనం రేపిన నాగరామకృష్ణ సెల్ఫీవీడియో

ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే చావు నిర్ణయమంటూ వెల్లడి

పాల్వంచ రూరల్‌, జనవరి 6 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పాతపాల్వంచ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు (రాఘవ) చుట్టూ ఉచ్చు బిగిసింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య, ఇద్దరు కూతుళ్లపై పెట్రోలు పోసి నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకున్న మండిగ  నాగరామకృష్ణ.. తాను ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు చేసిన సెల్ఫీవీడియో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో రామకృష్ణ తనకు జరిగిన అన్యాయం, తాను రాఘవ వల్ల పడిన ఇబ్బందులు, తండ్రి అధికారాన్ని, ఆర్థిక బలాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న అకృత్యా లను వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పంచాయతీలు చేయమ ని తన వద్దకు వచ్చే వారి విషయంలో వనమా రాఘవేందర్‌రావు (రాఘవ) చేసే కీచకపర్వం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అంతులేని ఆవేదనతో రామకృష్ణ మాట్లాడిన తీరును చూసినవారంతా ఆయనకు సానుభూతిపరులుగా మారిపోయారు. 

వీడియో సారాంశమిదీ.. 

‘నాకు, నా తల్లి, అక్కతో ఉన్న ఆస్తి వివాదం పరిష్కారం విషయంలో నేను చెప్పింది చేయాలి. పిల్లలు లేకుండా నీ భార్యను తీసుకుని హైదరాబాద్‌ రా. నీ భార్యను నావద్దకు పంపితేనే సమస్యకు పరి ష్కారం దొరుకుందని, నీ భార్యను ఎప్పుడు హైదరాబాద్‌ తీసుకొస్తావో.. అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప.. ఎంతమందితో చెప్పు కొన్నా ఏం చేసుకున్నా సరే.. ఆస్తిలో నయా పైసా నీకు రాదు. రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏంచేయాలి? రాజకీయ, ఆర్థిక బలుపుతో ఎదుటి వ్యక్తుల బలహీనతలతో ఆడుకుంటున్నాడు. ఇప్ప టికే ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల బలైపో యాయి. ఇలాంటి దుర్మార్గుడికి ఏ రాజకీయపార్టీ లు సహకరించవద్దు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకో లేక కుటుంబసభ్యులే శత్రువులుగా మారిన క్రమంలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిగల రాఘవ వారికి అండగా నిలవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అని ప్రాధేయ పడ్డాడు. అయితే తాను ఒక్కడినే చనిపోతే తరువాత తన కుటుం బాన్ని రాఘవ వదిలిపెట్టడని, అందువల్లే తన కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నా నని, తనకు ఆస్తిలో వచ్చే వాటాను తాను ఇవ్వాల్సిన వారికి ముట్టచెప్పాలని వేడుకున్నాడు. 

కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు

పాతపాల్వంచ సంఘటనలో ప్రధాన నిందితుడిగా (ఏ2) వనమా రాఘవ ఉండటంతో పోలీసు అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదు నెలల క్రితం ఇదే తరహా కేసు అయిన ఫైనాన్సియర్‌ ఆత్మహత్య ఘటనలో ఏ1గా ఉన్న రాఘవ కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేకపోయినా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అరెస్టుకు అవకాశం లేక పోలీసులు మిన్నకుండి పోయారు. ఆ సమయంలో పోలీసుశాఖపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే పోలీసు అధికారులు రాఘవను రక్షించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ తాజాగా రామకృష్ణ కుటుంబం మృతి ఉదంతంతో పోలీసులు తమపై పడిన నిందను చెరిపేసుకునే దానిలో భాగంగా రామకృష్ణ సూసైడ్‌నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలన్నింటినీ ఇప్పటికే సేకరించారని సమాచారం. గత కేసు నుంచి తప్పించుకున్న తీరులో మళ్లీ తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసు ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. రామకృష్ణ కుటుంబం మృతిచెందిందని తెలిసిన వెంటనే పరారైన రాఘవ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టగా.. గురువారం హైదరాబాద్‌లో పాల్వంచ పోలీ సులు వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నారని, పూర్తి బందో బస్తు మధ్య అతడిని విచారణ నిమిత్తం పాల్వంచకు తీసుకొస్తున్నట్టు సమాచారం.  సంఘటన జరిగిన రోజే ఇంటినుంచి పరారవగా.. ఆయన పలు టీవీ చానళ్లతో మాట్లాడుతూ తాను నిర్దోషినని చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు తమ కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్న రాఘవను ఎట్టకేలకు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని తెలియగా.. స్థానిక పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. 

రాఘవ అరెస్టుకు సహకరిస్తా.. 

మూడు పేజీల బహిరంగ లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే వనమా

తన కుమారుడు రాఘవ అరెస్టు కు తాను పూర్తిస్ధాయిలో సహకరి స్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం పాతపాల్వంచలో జరిగిన  రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన లో ఆయన కుమారుడు రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే వనమా గురువారం మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. కేసు పరిష్కారమయ్యే వరకు రాఘవను రాజకీయాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంచు తానని, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయ న కోరారు. ఒక్క రామకృష్ణ కేసులోనే కాక రాఘవ ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఇతర కేసుల్లోనూ తాను ఏనాడు చట్టాలను, అధి కారులను ప్రభావితం చేయలేదన్నారు. ఈ కేసులో ఘటన తనను కలచివేసిందని, విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీసు, న్యాయ వ్యవస్థలకు తన కుటుంబం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు.

ఎనిమిది బృందాలతో గాలింపు

త్వరలోనే రాఘవను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం: ఎస్పీ ప్రకటన

కొత్తగూడెం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈనెల 3న పాతపాల్వంచలో మీ సేవ కేంద్రం నిర్వాహకుడు నాగరామకృష్ణ కుటుం బం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతు డు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌, ఆయన తీసుకున్న సెల్ఫీ వీడయో ఆధారంగా పాల్వంచ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదుచేశామని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిం చారు. ప్రస్తుతం రాఘవ పరారీలో ఉన్నాడని, అతడి కోసం 8బృందాలతో వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నామ న్నారు. మృతుడు రామకృష్ణ వనమా రాఘవపై పలు ఆరోపణలు చేశారని, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాల మేరకు రాఘవపై ఐపీసీ సెక్షన్లు 302, 306, 307 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న వనమా రాఘవేంద్రరావును త్వరలోనే పట్టుకుని కోర్టులో హజరుపరుస్తామన్నారు.అయితే  ఎమ్మెల్యే వనమా పీఏ రుషిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారని సమాచారం. 




ఘటనపై విపక్షాల కన్నెర్ర

నేడు నియోజకవర్గ బంద్‌కు పిలుపు

నిరసనలు, అధికారులకు వినతులతో విరుచుకుపడ్డ నేతలు

వనమా రాఘవపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ 

పాల్వంచ రూరల్‌, జనవరి 6: పాతపాల్వంచ ఘటనపై విపక్షాలు కన్నెర్ర చేశాయి. నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయా లని డిమాండ్‌ చేస్తూ  నాయకులు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన రామకృష్ణ సెల్ఫీవీడియో సంచలనం రేపింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, బీఎస్పీ నాయకులు ప్రెస్‌ మీట్లు పెట్టి.. అధికారులకు వినతిపత్రాలిచ్చి, పలు రూపాల్లో నిరసనలతో విరు చుకుపడ్డారు. బీజేపీ, టీడీపీ నాయకులు వనమా వెంకటేశ్వరరావు నివాసం వద్ద రెండు గంటలపాటు నిరసన తెలిపారు. బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ కేసుపై పూర్తిస్థాయు విచారణ జరిపి రాఘవను శిక్షించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి సెల్ఫీ వీడియోను విడుదల చేశా రు. టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి అరాచకాలకు పాల్పడు తుంటే కేసీఆర్‌కు కనబడటంలేదా అని, అలాంటి వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని ఆ వీడియోలో ప్రశ్నించారు. నల్లగొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈ కేసు విషయమై తెలంగాణ డీజీపీకి బహిరంగ లేఖ రాశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

వనమా ఇంటి వద్ద బీజేపీ, టీడీపీ ఆందోళన.. 

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో అరెస్టు..

నాగ రామకృష్ణ కుటుంబం మృతికి ముఖ్య కారకుడైన వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేసి రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించా లని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ఎదుట బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాతపాల్వంచ సంఘటనకు నైతికబాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, రాఘవను జిల్లానుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  పాల్వంచ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని గేటు వద్ద బైఠాయించిన బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఈ నిరసనలో బీజేపీ నేతలు కోనేరు  సత్యనారాయణ (చిన్ని), బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జంపన సీతారామరాజు, ఎడ్లపల్లి శ్రీనివాస్‌కుమార్‌, సీతారాంనాయక్‌, వెంకటేశ్వర్లు, రవి, రమేష్‌, టీడీపీ నాయకుడు కె.అనంతరాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-07T06:46:29+05:30 IST