రొయ్యలు అధరహో

ABN , First Publish Date - 2022-08-19T05:18:58+05:30 IST

వనామి రొయ్యలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. రొయ్యల ధర భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్‌ పెరిగి గతంలో ఏనాడూ లేని ఆశాజనకమైన ధరలు ఆక్వా రైతులకు లభిస్తున్నాయి.

రొయ్యలు అధరహో
కలిదిండిలో పట్టుబడి చేసిన వనామీ రొయ్యలు

 పెరిగిన ఎగుమతులు

సాగు విస్తీర్ణం తగ్గడంతో రొయ్యకు డిమాండ్‌

ధరల పెరుగుదలతో రైతుల్లో సంతోషం

ముదినేపల్లి/కలిదిండి, ఆగస్టు 18 : వనామి రొయ్యలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. రొయ్యల ధర భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం  తగ్గడంతో డిమాండ్‌ పెరిగి గతంలో ఏనాడూ లేని ఆశాజనకమైన ధరలు  ఆక్వా రైతులకు లభిస్తున్నాయి. విదేశాలకు ఎగుమతులు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రొయ్యల ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా పరిస్థితుల్లో రెండేళ్లపాటు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో         రొయ్యల ధరలు తగ్గి ఆక్వా రైతులను కుంగదీశాయి. ముదినేపల్లి ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం చైనాలో 60 నుంచి  100 కౌంట్‌ మధ్య రొయ్యలకు డిమాండ్‌ ఉంది. 


వనామీకి పెరిగిన డిమాండ్‌

వనామి రొయ్యలకు ధర పెరగడంతో విదేశాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న కౌంటు వనామి రొయ్యలకు అధిక ధర పలుకుతోంది. కిలోకు 100 కౌంటు ఉన్న రొయ్య రొయ్యల ధర ప్రస్తుతం 290కు చేరింది. 60 కౌంటు నుంచి 100 కౌంటు ఉన్న రొయ్యల ధరలు పెరుగుతుండగా, 30 కౌంటు ఉన్న రొయ్యల ధర మాత్రం తగ్గింది. మే నెలలో 100 కౌంటు రొయ్యలు రూ.220 ఉండగా, ప్రస్తుతం రూ.70 పెరిగి రూ.290కు చేరింది. వేసవిలో వనామి సాగుకు అనుకూలమైన వాతావరణం కావడంతో రొయ్యల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే వాతావరణంలో మార్పులతో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడ్డాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెరువులు కూడా ఖాళీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో మాత్రమే రొయ్యల సాగు ఉండడంతో అధిక ధరలకు రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రొయ్యల సాగు విస్తీర్ణం తగ్గింది. రొయ్యలు ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌ పెరిగింది. 


రొయ్యల ధరలు ఇలా..

వంద కౌంట్‌ రొయ్యల ధర ప్రస్తుతం కిలో ఒక్కింటికి రూ.290కి చేరింది. అయితే 30 కౌంట్‌ ధర స్వల్పంగా తగ్గింది. 60 నుంచి 100 కౌంట్‌ మధ్య ధరలు పెరుగుతున్నాయి. గత మే నెలలో వంద కౌంట్‌ ధర కిలో రూ.220 ఉండగా, ఇప్పు డు రూ.290, 90 కౌంట్‌ రూ.230 నుంచి రూ. 300, 80 కౌంట్‌ ధర రూ.250 నుంచి 320, 70 కౌంట్‌ ధర రూ.270 నుంచి 340, 60 కౌంట్‌ ధర రూ.290 నుంచి రూ.350, 50 కౌంట్‌ ధర రూ.320 నుంచి 365, 40 కౌంట్‌ ధర రూ.390 నుంచి 410కు పెర గ్గా, 30 కౌంట్‌ రొయ్యల ధర మాత్రం కిలోకు రూ.510 నుంచి రూ.480కి తగ్గింది.

సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు 

వనామి రొయ్యల ధర పెరగడంతో రొయ్యల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. చెరువుల్లో ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలు             వరకు సీడ్‌ వేస్తున్నారు. చిన్న సైజు రొయ్యలకు అధిక ధర ఉండడంతో  కనీసం పెట్టుబడులు వస్తాయని లేదా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో రొయ్యల సాగును విస్తరిస్తున్నారు. 50 నుంచి 60 రోజుల్లో  వంద కౌంటు 70 నుంచి వంద కౌంటుకు వస్తాయి. ఈ కౌంటుకు వచ్చే  వరకు అధిక శాతం రొయ్యలకు వ్యాధులు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో వర్షాకాలంలో కూడా వనామి రొయ్యల సాగుపై రైతులు      ఆసక్తి  చూపుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాల్లో వనామి సాగు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-19T05:18:58+05:30 IST