వనపర్తి ఆర్టీసీ డిపో ఆక్యుపెన్సీ తగ్గుతోంది

ABN , First Publish Date - 2022-06-27T05:00:43+05:30 IST

డిపోల నిండా బస్సులు, కష్టించి పని చేయగల సిబ్బంది ఉన్నా ఆర్టీసీ(రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది.

వనపర్తి ఆర్టీసీ డిపో ఆక్యుపెన్సీ తగ్గుతోంది
వనపర్తి డిపో

ఆర్టీసీ బస్‌ చార్జీల పెంపు తర్వాత తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

కల్వకుర్తి డిపో మినహా మిగతా ఏడు డిపోల్లోనూ మార్పు

టికెట్‌ రేట్ల పెరుగుదలతో ఆదాయం 20 శాతం హెచ్చు

విద్యార్థుల బస్‌పాస్‌లు జారీ పూర్తయితే మరింత పెరుగుదల


 డిపోల నిండా బస్సులు, కష్టించి పని చేయగల సిబ్బంది ఉన్నా ఆర్టీసీ(రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోక ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కొత్త ఎండీ సజ్జనార్‌ వచ్చాక మూడు సార్లు చార్జీలను పెంచారు. దాంతో ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నా, ప్రయాణికుల ఆక్యుపెన్సీ తగ్గుతోంది. దాంతో టికెట్‌పై 30 శాతం ధరలు పెరగడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వెహికిల్స్‌ను ఆశ్రయించడంతో పాటు సొంత కార్లు, టూ వీలర్స్‌పై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


ఆర్టీసీ బస్సు చార్జీల వరుస పెంపు తర్వాత ప్రయాణికుల ఆక్యుపెన్సీ త గ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిపోలు ఉన్నాయి. ఒక్క కల్వకుర్తి డిపో మినహా మిగతా అన్ని డిపో ల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ అన్ని బస్సుల్లోనూ ఈ తగ్గుదల కనిపిస్తోంది. సాధారణంగా ఆక్యుపెన్సీ తగ్గకుండా ఉండేం దుకు, ఉన్న దాన్ని పెంచేం దుకు కండక్టర్లు, డ్రైవర్లు చాలా వరకు ప్రయ త్నిస్తారు. ప్రస్తుత తగ్గుదలకు చార్జీల పెంపే కారణ మనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. తక్కువ ధరకు సురక్షిత ప్రయాణం చేయొచ్చనే ఆలోచనతో ప్రజలు ఆర్టీసీని ఎంచుకుంటారు. ప్రస్తుత చార్జీలు ఇంచుమిం చుగా ప్రైవేటుతో పోటీపడి నట్లు ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రైవేటునే ఆశ్రయి స్తున్నట్లు తెలుస్తోంది. 


ఆక్యుపెన్సీ తగ్గుదల ఇలా..

నారాయణపేట డిపోలో చార్జీల పెంపునకు ముందు 75 శాతం ఆక్యుపెన్సీ ఉంటే, ప్రస్తుతం 68 శాతానికి పడి పోయింది. అలాగే అచ్చంపేట డిపోలో 75 నుంచి 73, కొల్లాపూర్‌లో 82 నుంచి 80కి, వనపర్తిలో 78 నుంచి 70కి, గద్వాల డిపోలో 74 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 71 శాతానికి పడిపోయింది. రూట్లు లాభసాటిగా ఉండి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న డిపోల్లో ఆక్యుపెన్సీ రెండు నుంచి మూడు శాతంలోపు తగ్గగా, రూట్లు సరిగా లేని, ఎక్కువగా గ్రామీణ రూట్లు, స్టేజ్‌లు ఉన్న డిపోల పరిధిలో మాత్రం ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గుతోంది. రేట్లు పెంచడం ద్వారా ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల నుంచి గట్టేక్కాలని భావించగా ఆక్యుపెన్సీ తగ్గుదల ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. 


ఆదాయంలో పెరుగుదల

ఓ వైపు ఆక్యుపెన్సీ తగ్గుతున్నప్పటికీ.. గతంతో పోల్చితే 15 నుంచి 20 శాతం వరకు ఆదాయం పెరిగినట్లు తాజా గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. విద్యార్థులకు బస్‌ పాసుల జారీ తర్వాత ఆ దాయం మరింత పెరుగనుంది. చార్జీల పెంపు తర్వాత 25 నుంచి 30 శాతం వరకు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేసినా ఆక్యుపెన్సీ తగ్గుదల వల్ల ఆ మేరకు రావడం లేదు. కొన్ని డిపోల్లో 10 నుంచి 12 శాతం వరకే ఆదాయం పెరిగింది. అయితే పెరిగిన ఆదాయం నష్టాలను భర్తీ చేస్తుందా? లేక పెరుగుతున్న నిర్వహణ భారానికి ఉపశమనంలా మారుతుందా అన్నది వేచి చూడాలి. 

నారాయణపేట డిపోలో మొత్తం 90 బస్సులు నడుస్తున్నాయి. చార్జీల పెంపునకు ముందు రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు రోజూవారీ ఆదాయం ఉండేది. ఇప్పుడు రూ. 14 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తోంది. 

అచ్చంపేట డిపోలో గతంలో రూ.12 లక్షల వరకు ఆదాయం రాగా, ఇప్పుడది రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెరిగింది. 

కొల్లాపూర్‌ డిపోకు గతంలో రూ.7.50 లక్షలు ఆదాయం ఉండగా, ప్రస్తుతం రూ.10 లక్షల వరకు వస్తోంది. 

కల్వకుర్తిలో గతంలో రూ.14 లక్షలుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఆదాయం వస్తోంది.

గద్వాల డిపోలో గతంలో రూ.13 లక్షల ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.16 లక్షల వరకు పెరిగింది. 

వనపర్తి డిపోలో రూ.16 లక్షలు ఉన్న ఆదాయం రూ.18 లక్షల నుంచి రూ.19 లక్షలకు పెరిగింది. 

మహబబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ డిపోల్లో కూడా ఇదే తరహాలో 15 నుంచి 20 శాతం వరకు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే నిర్వహణ ఖర్చుల్లో ప్రధానమైన డీజిల్‌ ధరలు ఇటీవల రూ. 10 వరకు తగ్గడం కూడా ఆర్టీసీ ఆదాయానికి కలిసొచ్చే అంశంగా ఉంది.

ఆర్టీసీ కార్గో, రెగ్యులర్‌ పార్శిల్‌ సర్వీసులు లాభాలు సాధిస్తున్నాయి. అయితే ఆక్యుపెన్సీ పెంచితేనే పెరిగిన చార్జీల వల్ల వచ్చే ఆదాయాన్ని గత నష్టాల భర్తీకి వాడుకునే అవకాశం ఉంది. అలాగే సంస్థకు ఉన్న విలువైన స్థలాల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించడంతో పాటు వాణిజ్య మార్గాలపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-06-27T05:00:43+05:30 IST