వంగవీటి రాధా హత్యకు రెక్కీ.. కీలకంగా మారిన ఆ వైసీపీ నేత?

ABN , First Publish Date - 2022-01-03T21:02:54+05:30 IST

వంగవీటి రాధా హత్యకు రెక్కీపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని, ఇది రెండు నెలల క్రితం జరిగిన...

వంగవీటి రాధా హత్యకు రెక్కీ.. కీలకంగా మారిన ఆ వైసీపీ నేత?

విజయవాడ: వంగవీటి రాధా హత్యకు రెక్కీపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని, ఇది రెండు నెలల క్రితం జరిగిన ఘటన అంటూ పోలీసులు కొట్టిపారేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు మంత్రి వెల్లంపల్లి  చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అయితే రాధాను చంపడానికి రెక్కీ చేసింది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.  సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయనకు బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు. కానీ దీన్ని అరవ సత్యం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. సత్యంను పోలీసులు తీసుకువెళ్లలేదన్నారు. ఆయన అనారోగ్యకారణంగా ఆస్పత్రిలో చేరారని అతని కుమారుడు చరణ్ తెలిపాడు.


క్రైమ్ వార్షిక సమావేశంలో సీపీ క్రాంతి రాణా వంగవీటి రాధాపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాధా రెక్కిపై సరైన ఆధారాలు దొరకలేదని ఆయన భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామన్నారు. ఈ ఘటనపై తమకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. రాధా హత్యకు రెక్కీపై ఎవరైనా సమాచారం ఇస్తే విచారణ చేస్తామని అన్నారు. రెక్కీ చేశారన్న రాధా వ్యాఖ్యలపై విచారణ జరిపామన్నారు. ఇంతవరకు రెక్కీ జరిగినట్టు నిర్దిష్ట ఆధారం దొరకలేదని చెప్పారు. రాధాకు గన్‌మెన్లను కేటాయించామని, నగర పోలీసులు కూడా ఆయనకి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని, 2 నెలల ఫుటేజ్ ఉందని తెలిపారు. రాధా ఇంటి దగ్గర చక్కర్లు కొట్టాయన్న వాహనంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాధాని పోలీసులు కలిసి మాట్లాడి వివరాలు తీసుకున్నారని చెప్పారు. రాధా ఇంటి దగ్గర రెక్కీ జరిగినట్టు ఇంకా నిర్ధారణ కాలేదని, విచారణ కొనసాగుతోందని క్రాంతి రాణా స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-03T21:02:54+05:30 IST