రంగా విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత

Published: Tue, 05 Jul 2022 01:43:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రంగా విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తతవంగవీటి నరేంద్రకు ఘనస్వాగతం పలుకుతున్న రంగా అభిమానులు

  • కాకినాడ రూరల్‌ అచ్చంపేటలో ఏర్పాటుకు ప్రయత్నం
  • అనుమతి లేదన్న పంచాయతీ అధికారులు
  • కార్యక్రమం నిలిపివేసిన నిర్వాహకులు
  • పేదల గుండె చప్పుడు వంగవీటి మోహనరంగా
  • రంగా-రాధా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర 
  • పోలీసులకు వ్యతిరేకంగా రంగా అభిమానుల నినాదాలు

సర్పవరం జంక్షన్‌, జూలై 4: పేదల గుండె చప్పుడు దివంగత వంగవీటి మోహన రంగా అని, బడుగు, బలహీన, నిరుపేదల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసి ప్రాణత్యాగం చేసిన రంగా ఆశయ సాధన కోసం కుటుంబమంతా వెన్నంటి ఉంటుందని రంగా-రాధా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర తెలిపారు. రంగా వజ్రోత్సవ జయంతి వేడుకల్లో భాగంగా సోమవారం తిమ్మాపురం అచ్చంపేట సెంటర్‌లో రంగా-రాధా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నాయకులు సలాది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రంగా ఏ ఒక్కరికో నాయకుడు కాదని, ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో ఏపీ, తెలంగాణల్లో రంగాకు ఉన్న ఆదరణ మరవలేమన్నారు. రంగా విగ్రహ ప్రతిష్టపై అధికారులు, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు. రంగా విగ్రహానికి కులమతాలకు అతీతంగా పెద్దఎత్తున ఊరేగింపు జరిపారని, ఇంతమంది రంగా అభిమానులు ఉన్నప్పుడు విగ్రహం పెట్టలేకపోయినా బాధలేదన్నారు. రంగా విగ్రహానికి దండం పెట్టి పదవులు మీరు తీసుకుంటున్నారని, అభ్యంతరాలు సృష్టించడం సరికాదని అన్నారు. ప్రజల్లో లభిస్తున్న ఆదరణ ముందు మీరు సృష్టిస్తున్న ఇబ్బందులు ఏమాత్రం తమ లక్ష్యాన్ని అడ్డుకోలేవన్నారు. ప్రజల కోరికపై ప్రశాంతంగా విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చామని, ఏఒక్కరినో ఇబ్బంది పెట్టడం, గొడవలు సృష్టించే మనస్తత్వం తమది కాదన్నారు. ఏడాది కాలంగా ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నిర్వాహకులు తమ దృష్టికి తీసుకురావడంతో మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చామన్నార. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారని, వారికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత

అచ్చంపేట సెంటర్‌లో ఆటోస్టాంట్‌ సమీపంలో రంగా విగ్రహ ప్రతిష్ట చేయించేందుకు రంగా-రాధా మిత్రమండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు విగ్రహ ప్రతిష్టకోసం ఏర్పాట్లు చేసి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ ఆటోస్టాండ్‌ ఉందని, విగ్రహ ప్రతిష్టతో ఇబ్బందులు వస్తాయని, ఇక్కడ అనుమతిలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారా వు నిర్వాహకులకు స్పష్టం చేశారు. మరొకచోట రోడ్డు పక్కన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉందని, దీనికి అనుమతులు ఉందా అని ప్రశ్నించడంతో కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని చర్చించారు. రంగా అభిమానులు పెద్దఎత్తున వస్తున్నారన్న సమాచారంతో సీఐ ముందుస్తు భద్రతా కారణాలతో ఏఎన్‌ ఎస్‌ పార్టీ పోలీసులు, ఇంద్రపాలెం, తిమ్మాపురం, సర్పవరం పోలీస్‌స్టేషన్ల నుంచి బలగాలను రప్పించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదని, సున్నిత విషయంపై శాంతి భద్రతల దృష్ట్యా సహకరించాల ని, అనుమతి ఉంటే కార్యక్రమం చేసుకోవాలని సీఐ స్పష్టం చేశారు. దీంతో కార్యక్రమం నిలుపుదల చేశారు. ఈలోగా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అక్కడకు రావడంతో రంగా అభిమానులు పెద్దఎత్తున అధి కారులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రి క్త పరిస్థితులు తలెత్తకుండా నరేంద్ర అభిమానులకు సర్ది చెప్పి అక్కడినుంచి వెనుదిగడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాళ్ల ధనరాజు, జనసేన నాయకురాలు మాకినేని శేషుకుమారి, అభిమానులు పెద్దఎత్తున పాలొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.