ఉత్తర అమెరికా కథలకు ఉజ్వల భవితవ్యం

ABN , First Publish Date - 2022-04-10T14:07:19+05:30 IST

ఉత్తర అమెరికా కథలకు ఉజ్వల భవిత ఉందని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహించిన ‘నెలా నెలా వెన్నెల’ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌ రాజు

ఉత్తర అమెరికా కథలకు ఉజ్వల భవితవ్యం

                                        - డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌రాజు


వేళచ్చేరి(చెన్నై): ఉత్తర అమెరికా కథలకు ఉజ్వల భవిత ఉందని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహించిన ‘నెలా నెలా వెన్నెల’ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌ రాజు పేర్కొన్నారు. స్మారక సమితి ప్రతి నెలా నిర్వహించే సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమం ‘నెలా నెలా వెన్నెల’ నెట్‌ ఇంట్లో సమావేశం-24 శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ సాహితీవేత్త, సామాజిక సేవాభిలాషి డా.వంగూరి చిట్టెన్‌ రాజు ‘అమెరికాలో తెలుగు కథా సాహిత్యం పుట్టుక, పురోగతి, భవిష్యత్తు’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రముఖ కథా, నవల రచయిత్రి కల్పనా రెంటాల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వంగూరి చిట్టెన్‌ రాజు మాట్లాడుతూ.. 1964, ఏప్రిల్‌ 24న ఆంధ్రప్రతికలో ప్రచురింపడిన ‘వాహిని’ కథ ఉత్తర అమెరికా కథా ప్రారంభానికి నాంది అని, తెలుగు కథా సాహిత్యంలో అమెరికా కథ కొత్త పాయగా చేరి క్రమేణా తన ప్రత్యేక త సంతరించుకుంద న్నారు. 1960 నుంచి 1975 సంవత్సరం వరకు ఉత్తర అమెరికా తెలుగు కథకు ప్రారంభ దశ అని గౌతంశెట్టి వీరభద్రరావు రాసిన ‘గోడమీద గడియారం’, మాచిరాజు సావిత్రి రచించిన ‘మోసం’, సి.య్‌స.వి.మురళి రాసిన ‘మనిషి’ మొదలైన కథలు ‘భారతి’ పత్రికలో ప్రచురింపబడ్డాయని, ఈ దశలో కథల్లో వస్తువు, వాతావరణం ఆంధ్ర రాష్ట్రానికి చెందినవన్నారు.1975 నుంచి1990 వరకు రెండో దశగా గుర్తించవచ్చని, ఈ సమయంలో అమెరికా తెలుగు కథ నిలదొక్కుకున్నదని, అమెరికా తెలుగు వారి సామాజిక, సాంస్కృతిక అవసరాలను గుర్తించడం జరిగిందన్నారు. స్థానికంగా తెలుగు పత్రికలు ప్రారంభమయ్యాయని, తెలుగు కథలు చెప్పడంలో ఒక కొత్త కోణం బయటపడిందన్నారు. మూడో దశలో 1990 నుంచి 2005 వరకు అమెరికా తెలుగు కథ చాలా వేగంగా పరిపుష్టి చెంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఎన్నో స్థానిక సంస్థలు పురుడు పోసుకున్నాయని తెలిపారు. వేమూరి వెంకటేశ్వరరావు, సత్యం మందపాటి, నిడదవోలు మాలతి మొదలైన రచయితలు ఈ దశలో ఎన్నో కథలు రాశారని, ఉత్తర అమెరికా తెలుగు కథకు రాజయోగం కలిగిందని, ఇది పురోగతి దశ అని వక్త తెలిపారు. ఈ దశలోనే సాహిత్య విమర్శ కూడా దళం విప్పిందని అన్నారు. 4వ దశ 2005 నుంచి అప్పటిదాకా కొనసాగుతున్న వర్తమాన దశ అని, కొవిడ్‌ విజృంభించిన తరుణంలో రచయితలు కలుసుకోవడం తగ్గిందన్నారు. కల్పనా రెంటాల, మధు పెమ్మరాజు, దీప్తి పెండ్యాల కొత్త ఆవకాయ సుస్మిత మొదలైన వారు ఎందరో వర్తమాన దశలో మంచి కథలందిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి గుర్తిం పు కూడా అమెరికా తెలుగు కథకు లభించబోతోందని డాక్టర్‌ వంగూరి చిట్టెన్‌ రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-10T14:07:19+05:30 IST