వణికిస్తున్న నివర్‌

ABN , First Publish Date - 2020-11-28T05:53:23+05:30 IST

నల్లగొండ,నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/యాదాద్రి, సూర్యాపేటటౌన్‌: నివర్‌ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండో రోజు శుక్రవారం ముసురు కురిసింది.

వణికిస్తున్న నివర్‌
నల్లగొండ ఆర్జాలబావి ఐకేపీలో తడిచిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతు

లక్షల క్వింటాళ్ల వరి, పత్తి చేలల్లోనే

ఐకేపీ కేంద్రాల్లో తడిచిన ధాన్యం

రెండో రోజూ ముసురు

స్తంభించిన జనజీవనం

నల్లగొండ,నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/యాదాద్రి, సూర్యాపేటటౌన్‌: నివర్‌ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండో రోజు శుక్రవారం ముసురు కురిసింది. ఈనెల 26 నుంచి 27న ఉదయం 6గంటల వరకు నల్లగొండ జిల్లా లో 10.2మి.మీ సగటు వర్షపాతం, సాయంత్రం 5గంటల వరకు 5.2మి.మీ నమోదైంది. ఏపీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 26న అడవిదేవులపల్లి, తిరుమలగిరి మండలాల్లో అత్యధికంగా 25.5మి.మీ, 27న మునుగోడు మండలంలో 12, చిట్యాలలో 11.3మి.మీ వర్షం కురిసింది. ఇదిలా ఉండ గా, జిల్లాలో ఇంకా లక్ష ఎకరాల్లో వరి కోతలు చేపట్టాల్సి ఉంది. తుపాను ప్రభావం, అధికారుల ముందస్తు హెచ్చరికల కారణంగా రైతులు వరి కోతలు నిలిపేశారు. ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం రెండు రోజుల ముసురుతో రంగుమారే పరిస్థితి ఏర్పడింది. 5లక్షల క్వింటాళ్ల పత్తి రైతుల వద్ద ఉండగా, ఇళ్ల ముందు, పొలాల్లో ఆరబెట్టిన తెల్లబంగారం తడిసి ముద్దయింది. ఏరడానికి సిద్ధమైన పత్తి చేలు తడవగా, పగిలినకాయలోని పత్తి తడిసి పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేవరకొండ డివిజన్‌లో డిండి ఆయకట్టు కింద 6వేల హెక్టార్లు, ఏఎమ్మార్పీ పరిధిలో 15వేల ఎకరాలకుపైగా వరి కోతకు సిద్ధంగా ఉంది. వర్షం కారణంగా గింజ తడిచి బరువెక్కి పంట నేలవాలుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లాలో 1.74లక్షల ఎకరా ల్లో పత్తి సాగుకాగా, ఇటీవల కురిసిన వరుస వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే పత్తి రైతులు కోలుకుంటుండగా, నివర్‌ తుపాను మళ్లీ దెబ్బతీసింది. చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 85 మంది రైతులు తూకాల కోసం ధాన్యం రాశులు పోయగా, కిందకు నీరు చేరి తడిచింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 10.1మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేళ్లచెరువులో 22.8మి.మీ, అత్యల్పంగా అనంతగిరిలో 0.3మి.మీ వర్షం కురిసింది. సూర్యాపేట పట్టణంలో 9.6మి.మీ వర్షం నమోదైంది. తుపాను కారణంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోగా, ఐకేపీ కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వర్షం రక్షించుకునేందుకు పలుచోట్ల సరిపడా టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం రాశుల కింద నీరు చేరి తడిసింది. తుపానుతో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోగా, చలిగాలులతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి గాలులు, ముసురు కారణంగా జనజీవనం స్తంభించింది.

Updated Date - 2020-11-28T05:53:23+05:30 IST