కేసుల వల్లే సినిమాల్లోకి రీఎంట్రీ

Published: Sat, 08 Feb 2020 03:22:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేసుల వల్లే సినిమాల్లోకి రీఎంట్రీ

దాదాపు పదహారేళ్లపాటు తెలుగు చిత్రసీమను ఏలిన కథానాయిక.. వాణిశ్రీ. అత్త పాత్రల్లో స్వాతిశయానికి పెట్టింది పేరుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారీ కళాభినేత్రి. తనను చూసి కృష్ణంరాజు మెచ్చుకుంటే.. నాగేశ్వరరావు మాత్రం ప్రశంసించలేదని, ఎన్టీఆర్‌ ఎక్స్‌రే చూపులు చూసేవారు కాదని చెబుతున్నారు. పైట కప్పుకోవడం ఓ హిందీ సినిమాలో చూసి నేర్చుకున్నానని చెబుతున్న ఆమె... తన పేరు వెనక రహస్యాన్ని చెప్పేశారు. ఆమెతో 15-7-13న జరిగిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన జ్ఞాపకాలూ అనుభవాలను ఇలా పంచుకున్నారు...


కళాభినేత్రిగా రెండు మూడు దశాబ్దాలు తెలుగువారి హృదయాలను ఏలారు. ఇప్పుడదంతా తల్చుకుంటే ఏమనిపిస్తుంది?

గత జన్మలో నేను సినిమా ఆర్టిస్టును. చాలామంది మహానటులతో, గొప్ప రచయితలు, రచయిత్రులతో పనిచేశాను. ఇప్పుడిది మరో జన్మ. తల్లి, ఇల్లాలు.. ఈ పాత్రల్ని పోషిస్తున్నాను అనిపిస్తుంది.


మొదటి జన్మలో పాత్ర బాగా పోషించారా? రెండో జన్మలోనా?

నేను బాగా చేస్తానని, చేశానని అప్పట్లో ఎవరూ నాకు చెప్పలేదు. ఒకసారి ఎన్టీఆర్‌.. ‘కథానాయిక మొల్ల’ సినిమా బాగా చేశానని, చివర్లో నేను కూర్చునే భంగిమ బాగుందని అన్నారు. నేను చీరకట్టి, పైటవేసే విధానం ఏదో రాచకుటుంబం నుంచి వచ్చినట్టనిపిస్తుందని కృష్ణంరాజు మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు ఎప్పుడూ ప్రశంసించలేదు. కృష్ణ, నేను అసలు మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఏ హీరో అయినా మా కళ్లలోకి చూసి మాట్లాడేవారుగానీ, ఎన్టీఆర్‌ మాత్రం ఎక్స్‌రే చూపులు చూసేవారు కాదు. కారణజన్ముడంటే ఆయనే అని చెప్పుకోవాలి. ఏఎన్నార్‌కి మూడ్‌స్వింగ్‌ ఎక్కువ. కోపంగా ఉంటే ఒకలా ఉండేవారు. మామూలు గా ఉంటే చిన్నచిన్న జోకులు వేసేవారు.


అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు?

చిన్నప్పుడు నేను మద్రాసు ఆంధ్ర మహిళా సభలో భరత నాట్యం నేర్చుకున్నా. ఒకసారి సభ యానివర్సరీకి కన్నడ డైరెక్టర్‌ హుణుసూరు కృష్ణమూర్తి వచ్చారు. ఆ వేడుకల్లో నా నాట్యం చూసి ‘ఈ అమ్మాయి సావిత్రిలా ఉందే? సినిమాల్లో నటిస్తుందా?’ అని అడిగారట. అమ్మ ఒప్పుకోలేదుగానీ, ఒప్పిం చి తొలిసారి కన్నడ సినిమాలో నటించాను.


మీకు వాణిశ్రీ అని పేరు పెట్టిందెవరు?

‘నాదీ ఆడజన్మే’ సినిమా తీసిన కంపెనీ పేరు.. శ్రీవాణి ఫిలిమ్స్‌. వాళ్లే నాకు వాణిశ్రీ అని పెట్టారు.


వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ నగలు, వాణిశ్రీ చీర.. ఎలా పాపులర్‌ అయ్యాయి?

అస్పీ.. అని లండన్‌ నుంచి ఒక హెయిర్‌ డ్రెస్సర్‌ ఇక్కడికి వచ్చారు. ఆయనే నాకోసం కొత్త స్టైల్స్‌ చేస్తాననేవారు. పదేళ్లపాటు మద్రాసులో ఆయన నాకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా హెయిర్‌ స్టైల్‌ చేశారు.చీరలు, నగలు నేనే డిజైన్‌ చేసుకునేదాన్ని. పైట కప్పుకోవడం.. ఒక హిందీ సినిమాలో చూసి నేర్చుకున్నాను. ఇండస్ట్రీ చెక్కిన శిల్పాన్ని నేను.

అంత ఉచ్ఛదశలో ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు?

చిన్నపిల్లలకు వేసవి సెలవలు ఇస్తారు. కానీ, నా వ్యవహారాలు చూసేవాళ్లు నాకు ఆ వెసులుబాటు కూడా ఇవ్వలేదు. మద్రాసులో షూటింగ్‌ చేయకూడని రోజుల్లో వేరే భాషల సినిమాలకు డేట్లు ఇచ్చేవారు. వాళ్లు అలా చేయకుండా నాకు కొంత విశ్రాంతి ఇచ్చి ఉంటే నేను పెళ్లి అనే మాట ఎత్తేదాన్నే కాదు. దీనికితోడు.. ‘ఎదురులేని మనిషి’ సినిమాలో ఒక పాట షూటింగ్‌లో అసభ్యమైన మూమెంట్లు చేయమన్నారు. నాకు ఒళ్లు మండింది. ఆ దశలో.. పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. మా ఆయన.. మా ఫ్యామిలీ డాక్టరే.


మరి మీ ‘లెక్కలు’ కరెక్ట్‌గానే ఉన్నాయా?

మనీ ఈజ్‌ టేస్టర్‌ దాన్‌ ఎనీథింగ్‌. డబ్బు రుచి తెలిసినతర్వాత.. ఇక అమ్మా లేదు.. నాన్నాలేదు.. ఎవరూ లేరు. నాకు కొండమీద కోతి కావాలన్నా మావాళ్లు దాన్ని తెచ్చి అక్కడ పెట్టేవాళ్లు. దీంతో డబ్బు విషయా లు ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే, నేను ఆర్థికంగా బాగా స్థిరపడ్డాక నాకు తోచిన మంచిపనులు చేశాను.


ఇప్పుడు సినిమా ఇండసీ్ట్ర పోకడలపై ఏమనిపిస్తోంది?

సినిమా మాత్రమే కాదు.. ప్రపంచమే మారుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చెడిపోలేదు. చాలా మంది మంచి సినిమాలు తీస్తున్నారు. ఇక అశ్లీలమంటే.. కొందరు డైరెక్టర్లకు మనసులో ఎక్కడో ఉంటుంది ‘అలా’ లైవ్‌లో చూడాలని. అందుకే అలా చూపిస్తున్నారు. ఈ తరంలో అల్లు అర్జున్‌ డాన్స్‌ చూస్తే ‘ఈ పిల్లాడి కాళ్లు రబ్బర్‌తో చేశా రా’ అనిపిస్తుంది. రవితేజ, సిద్ధార్థ, మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం.


అన్నాళ్లు అంత నాజూగ్గా ఉండి.. లావుగా ఎలా అయిపోయారు?

థైరాయిడ్‌ సమస్య వల్ల. దాన్నీ అధిగమించాను. 130 కిలోలు ఉండేదాన్ని 15 నెలల్లో 75 కిలోలకు తగ్గాను. ఆపై మళ్లీ అత్తగారిగా తెరమీదకు వచ్చాను.


రీఎంట్రీ ఎలా? ఎందుకు?

హీరోయిన్‌గా నేను సంపాదించినదాని గురించి అడిగితే మావాళ్లు కోర్టుకెళ్లారు. పన్నెండేళ్లు కేసు నడిచింది. మా లాయరు ‘వాళ్లు నీకు అప్పట్లో అంత పారితోషికం లేదంటున్నారు.మూడు సినిమాల్లో నటించి ఆ రెమ్యూనరేషన్‌ అగ్రిమెంట్లు పట్రా. వాళ్లని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా’ అన్నారు. అలా ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చేశాను. ఈలోగా మావాళ్లు రాజీకి వచ్చారు.


మీ పిల్లలేం చేస్తున్నారు?

అమ్మాయి అనుపమ, అబ్బాయి అభినయ వెంకటేశ కార్తికేయ. ఇద్దరూ డాక్టర్లే. మా కోడలు కూడా డాక్టరే. మా అమ్మాయికి పెళ్లి చేయాలి.


మీరు మనసులో దాచుకున్న విషయాలేవైనా ఉన్నాయా?

నాకు పెళ్లంటే కొంతమంది ఏడ్చారు. అంటే.. మనసులో నన్ను ప్రేమించారన్నమాట. ఇన్నిరోజులూ చెప్పలేదేమంటే.. ‘నాకు పిల్లలున్నారనా, కావాలంటే రీకేనలైజేషన్‌ చేయించుకుంటా’ అన్నారు. అప్పుడా వ్యక్తికి.. ఇట్స్‌ టూ లేట్‌, మనం స్నేహితులం అని చెప్పాను. ఇక, ‘దెబ్బకు ఠా దొంగల ముఠా’, ‘వింత కథ’, ‘బొంబాయి ప్రియుడు’ సినిమాలు అస్సలు ఇష్టం లేకుండానే చేశాను.


జీవితంలో ఇంకా ఏం చేయాల్సి ఉంది?

ఇప్పటికే నేను తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నా. ఆధ్యాత్మికం వైపు ప్రయాణిస్తున్నాను. అలా అని కుంకుమ పూజలు చేస్తున్నానని, కొబ్బరికాయలు కొడుతున్నానని కాదు. దేవుడి ఉనికిని కనుగొనే దిశగా ప్రయత్నించి కనిపెట్టాను. దేవుడు ఎక్కడో ఉండడు. మనం దేవుడుగా మారడమే. ఒకరి నోటి దగ్గర అన్నం తీయకుండా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రికాల పూజ చేసుకుంటా. ప్రసాదాలేమీ ఉండవు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.