వనితకు వందనం

Published: Thu, 27 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వనితకు వందనం

సరిగమలతో సమ్మిళితమైన జీవితం ఒకరిది... పాకశాస్త్రంలో అద్భుత ప్రావీణ్యం మరొకరిది... వయసు వంద దాటినా సామాజిక సేవకే  అంకితమైన ప్రయాణం ఇంకొకరిది. రంగం ఏదైనా అపురూప విజయాలు అందుకొంటూ... చైతన్యం రగిలిస్తూ... స్ఫూర్తి నింపుతున్న వనితలు ఎందరో! ‘పద్మ’ పురస్కారం వరించిన అలాంటి కొందరు మహిళల ప్రస్థానం ఇది... 


 మధురం.. 

 నటనైనా, వంటైనా

రెండున్నర ఏళ్ళ కిందట ‘ఇన్‌స్టెంట్లీ ఇండియన్‌ కుక్‌బుక్‌’ అనే పుస్తకం విడుదలైంది. ఇన్‌స్టెంట్‌ పాట్‌ (ఎలక్ట్రిక్‌ ప్రెజర్‌ కుక్కర్‌)లో సంప్రదాయ, సమకాలీన భారతీయ వంటకాల తయారీ గురించి అందులో వివరించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి ముంచుకొచ్చాక, ఇళ్ళలోనే వండుకోవాల్సిన పరిస్థితి ప్రపంచమంతటికీ ఎదురవడంతో... భారతీయ వంటకాలు ఇష్టపడేవారి నుంచి, ప్రధానంగా ప్రవాస భారతీయుల నుంచి ఆ పుస్తకానికి విశేషమైన ఆదరణ దక్కింది. దాని రచయిత్రి మధుర్‌ జాఫ్రీ. ఎనభై ఎనిమిదేళ్ళ వయసులోనూ కాలంతో పాటు ఆమె పోటీ పడతారనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం. నిజానికి నలభై ఆరేళ్ళ కిందట... ‘ఏన్‌ ఇన్విటేషన్‌ టు ఇండియన్‌ కుకింగ్‌’ పుస్తకంతో... ప్రపంచానికి భారతీయ వంటకాల తయారీ పద్ధతుల్ని పరిచయం చేసిన తొలి రచయిత్రిగా కూడా ఆమె ఖ్యాతి పొందారు. ఇప్పటివరకూ ముప్ఫైకి పైగా వంటల పుస్తకాలు రాశారు. ఈ ఏడాది పాకశాస్త్ర విభాగంలో ఆమెకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మధుర్‌ ప్రతిభ కేవలం వంటలకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నటి కూడా.


ఢిల్లీలో సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టిన మధుర్‌ తన ఉపాధ్యాయుల ప్రేరణతో... హైస్కూల్లో నాటకాలు వేశారు. ఆ తరువాత వివిధ ఔత్సాహిక, ప్రసిద్ధ రంగస్థల సంస్థలతో కలిసి పని చేశారు. ఆలిండియా రేడియోలో కొన్నాళ్ళు పని చేశారు. కానీ నటననే వృత్తిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్కాలర్‌ షిప్‌ పొంది, లండన్‌లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్స్‌లో విద్యార్థినిగా చేరారు. ఆ సమయంలోనే బిబిసి రేడియో, టీవీల్లో చిన్న పాత్రలు వేసే అవకాశం వచ్చింది. అనంతరం... ఆనర్స్‌ డిగ్రీతో భారతదేశం వచ్చి, నాటకాలు వేస్తూ ఉండేవారు. మర్చంట్‌ ఐవరీ సంస్థ అధినేత జేమ్స్‌ ఐవరీతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1965లో ‘షేక్స్‌పియర్‌వాలా’ మొదలు ఆ సంస్థ తీసిన అనేక సినిమాల్లో నటించారు. షేక్స్‌పియర్‌వాలా’ చిత్రంలో చూపిన అభినయానికి బెర్లిన్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయురాలిగా నిలిచారు. ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. రంగస్థలం, సినిమా, టీవీ రంగాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ పాత్రలను మధుర్‌ పోషిస్తూనే ఉన్నారు. సినీ, టీవీ, పాకశాస్త్ర రంగాల్లో భారత్‌, ఇంగ్లండ్‌, అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంచడంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా బ్రిటన్‌ ప్రభుత్వం 2014లో ‘కమాండర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ (సిబిఇ) పురస్కారంతో మధుర్‌ను గౌరవించింది. నటిగా ఎంత బిజీగా ఉన్నా రచనా వ్యాసంగాన్ని వదిలేది లేదంటారు మధుర్‌. ఆమె పిల్లల కోసం మూడు పుస్తకాలు రాశారు. బ్రిటిష్‌ ఇండియాలోని తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘క్లైంబింగ్‌ ది మ్యాంగో ట్రీస్‌’ పేరిట అక్షరబద్ధం చేశారు. అయితే అన్నిటికన్నా ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం వంటల పుస్తకాలతోనే. ‘‘నేను రుచి వండని లేదా రుచి చూడని వంట తయారీ గురించి ఎప్పుడూ రాయలేదు. ఇప్పటికీ నా సరుకులు నేనే ఎంచి తెచ్చుకుంటాను, వండుకుంటాను, పాత్రల్ని స్వయంగా శుభ్రం చేసుకుంటాను’’ అంటారామె. 


నటిగా ఎంత బిజీగా ఉన్నా రచనా వ్యాసంగాన్ని వదిలేది లేదంటారు మధుర్‌. బ్రిటిష్‌ ఇండియాలోని తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘క్లైంబింగ్‌ ది మ్యాంగో ట్రీస్‌’ పేరిట అక్షరబద్ధం చేశారు. వనితకు వందనం

సడలని సంకల్పం

శకుంతలా చౌదరి... గాంధేయవాదిగా, సామాజిక కార్యకర్తగా, జనం మెచ్చిన ‘దీదీ’గా అసోమ్‌లోని కామ్‌రూప్‌ జిల్లాలో ఇంటింటికీ పరిచయమున్న పేరు. తాజాగా పద్మశ్రీ పురస్కారం పొందిన ఆమె 102 సంవత్సరాల వయసులో కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. నేడే కాదు... స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ విద్యార్థినిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు దీదీ. 1947లో ‘కస్తూర్బా గాధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌’ (కేజీఎన్‌ఎంటీ)లో చేరి అసోమ్‌ విభాగాన్ని నడిపించారు. అందులో భాగంగా గువహతిలో ‘కస్తూర్బా గ్రామ్‌ సేవక్‌ విద్యాలయ’ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. దీని ద్వారా ఎంతోమంది ‘గ్రామ్‌ సేవిక’లకు శిక్షణనిచ్చారు. ఇప్పుడు మొత్తం 22 గ్రామ సేవా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తున్నాయి. శకుంతల పర్యవేక్షణలో విద్య, నూలు వడకడం, నేయడం తదితర అంశాల్లో ఈ కేంద్రాలు శిక్షణనిస్తాయి. ఆచార్య వినోబాభావే అసోమ్‌లో పర్యటించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు శకుంతల. అసోమ్‌-అరుణాచల్‌ సరిహద్దుల్లో ఆయన నెలకొల్పిన ‘మైత్రీ ఆశ్రమ్‌’ బాధ్యతలను శకుంతలకు అప్పగించారు. ఆశ్రమమం ఆధ్వర్యంలో ఆమె శాంతి సభలు ఎన్నో నిర్వహించారు. 1962 చైనా యుద్ధ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో ‘శాంతి సేన’ కార్యకలాపాలు నిర్వహించారు. నలభైకి పైగా ‘పీస్‌ సెంటర్స్‌’ ఏర్పాటు చేశారు. శకుంతల ప్రధానంగా మహిళా సమస్యలు, సాధికారతపై దృష్టి పెట్టారు. అందుకోసం 1973లో అసోమ్‌లో ‘మహిళా పాదయాత్ర’ చేపట్టారు. పశ్చిమబెంగాల్‌(1978)లో ‘గోహత్య నివారణ్‌ మూవ్‌మెంట్‌’లో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘కస్బూర్బా గాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌’, ‘సర్వోదయా ట్రస్ట్‌’లకు ట్రస్టీగా, ‘స్త్రీ శక్తి జాగరణ్‌ సమితి’, ‘యువక్‌ మైత్రి సమాజ్‌’లకు కన్వీనర్‌గా, ‘పీపుల్‌ ఫోరమ్‌’కు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా 2008లో అసోమ్‌లోని ఉదల్గుడి జిల్లాలో మత కలహాలు రేగినప్పుడు తిరిగి శాంతియుత వాతావరణం తేవడానికి శకుంతల ఎంతో కృషి చేశారు. ఆ కలహాల్లో 30 మంది మరణించగా, వేలమంది వలసపోయారు. ఆ విపత్కర పరిస్థితుల్లో ఆమె గ్రామాల్లోని ఇల్లిల్లూ తిరిగారు. అక్కడ శాంతి నెలకొల్పడంలో సఫలమయ్యారు. ఇన్నేళ్ల జీవితంలో సింహభాగం ప్రజా శ్రేయస్సుకు, సేవకు, ముఖ్యంగా మహిళ, శిశు సంక్షేమం కోసం ధారపోసిన శకుంతల... ప్రచారానికి, ఆడంబరాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. 


 ప్రస్తుతం శకుంతల ‘కస్బూర్బా గాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌’, ‘సర్వోదయా ట్రస్ట్‌’లకు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 


వనితకు వందనం

సంగీత ప్రభ

దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా సంగీతమే ప్రపంచమైన ప్రభా ఆత్రే పేరు తెలియని హిందుస్తానీ సంగీత ప్రియులు ఉండరు. గాయనిగానే కాదు, గురువుగా, ఎన్నో ప్రయోగాలు చేసిన సంగీతకర్తగా, అధ్యాపకురాలిగా... ఇలా పాటతో ఆమె జీవితం పెనవేసుకుపోయింది. సంప్రదాయ సంగీత ఛాయలు ఏమాత్రం లేని కుటుంబం ఆమెది. అందుకే, చిన్న వయసులోనే సంగీతం పట్ల అభిమానాన్ని పెంచుకున్నా... లోతుగా నేర్చుకోవాలని కానీ, ఈ రంగంలో స్థిరపడాలని కానీ ఆలోచన అప్పట్లో తనకు లేదంటారామె. ప్రభకు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు... ఆమె తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళనగా ఉండేవారు. కాస్త ఊరట కోసం ఒక స్నేహితురాలి సలహా మేరకు... సంగీత పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అది ఎక్కువకాలం కొనసాగకపోయినా... ప్రభ, ఆమె సోదరి ఉషలకు సంగీతం నేర్చుకోవాలనే ప్రేరణ కలిగింది. హీరాబాయ్‌ బడొదేకర్‌, సురేష్‌ బాబు మానే తదితరుల దగ్గర ప్రభ శిక్షణ పొందారు. స్వస్థలమైన పుణేలో బిఎస్సీ, బిఎల్‌ చదివిన ఆమె అనంతరం సంగీతంలో మాస్టర్‌ డిగ్రీ, డాక్టరేట్‌ చేశారు. ఆ తరువాత పాశ్చాత్య సంగీతాన్ని సైతం లండన్‌ ట్రినిటీ కాలేజీలో అభ్యసించారు.


తొలినాళ్ళలో రంగస్థలం మీద నటిస్తూ, పాటలు పాడిన ప్రభ సుప్రసిద్ధ మరాఠీ నాటకాల్లోనూ నటించారు. వాటిలో పౌరాణికాలు కూడా ఉన్నాయి. ఆ తరువాత పూర్తిగా శాస్త్రీయ సంగీతానికే అంకితమయ్యారు. ఆలిండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాలలో అధ్యాపకురాలుగా, రచయిత్రిగా, స్వరకర్తగా... ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యంతో సాగింది.  దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ప్రభ అంతర్జాతీయ స్థాయిలో భారత శాస్త్రీయ గాత్ర సంగీతానికి ప్రాచుర్యం కల్పించడానికి  చేసిన సేవలు ఎనలేనివి. టుమ్రీలు, ఘజల్స్‌ దగ్గర నుంచి భజన్ల వరకూ ఆమె నిష్ణాతురాలు కాని గాన శైలి లేదు. దర్బారౌ కనౌస్‌, శివ కాళి, రవి భైరవి, అపూర్వ కల్యాణ్‌... ఇలా పలు రాగాలను ఆమె సృష్టించారు. సంగీత రూపకాలకు సంగీత నిర్దేశకత్వం చేశారు. సంగీతం గురించి అనేక రచనలు చేశారు. అంతేకాదు, 2016లో... ఒకే వేదిక మీద సంగీతంపై పదకొండు పుస్తకాలను ఆంగ్ల, హిందీ భాషల్లో విడుదల చేసి రికార్డు సృష్టించారు. కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలుగా వ్యవహరించారు. పుణేలో సంగీత విద్యాలయం ఏర్పాటు చేసి, గురుకుల పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. డాక్టర్‌ ప్రభా ఆత్రే ఫౌండేషన్‌ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘మనం చేసే పని కోసం ఎంతో ఆలోచించాలి, ఎంతో మధనపడాలి. అప్పుడు ఖచ్చితంగా అత్యున్నత స్థాయి సంతృప్తి లభిస్తుంది. నా గానం, స్వరరచనల వెనుక నేను చేసిన మేథో శ్రమను శ్రోతలు గుర్తించినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. వారిని మెప్పించడం, అభిమానం పొందడం నా అదృష్టం’’ అంటారామె.


కిరానా ఘరానా రీతిలో నిష్ణాతులైన పండిట్‌ భీమ్‌సేన్‌ జోషీ లాంటి వారితో ఆమెకు అనుబంధం ఉంది. 2006లో భీమ్‌సేన్‌ అనారోగ్య కారణాల వల్ల సంగీతానికి దూరమైన తరువాత... పుణే సంప్రదాయ సంగీత ఉత్సవం ‘సవయ్‌ గంధర్వ భీమ్‌ సేన్‌ మహోత్సవ్‌’లో చివరి ప్రదర్శనను ఇచ్చే అరుదైన గౌరవం కూడా ప్రభకే దక్కింది. 1990లో ‘పద్మశ్రీ’, 2002లో ‘పద్మభూషణ్‌’తో సహా ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ఆమె పేరిట శిష్యులు, అభిమానులు పురస్కారాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తనకు పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించడంపై  ఎనభై తొమ్మిదేళ్ళ ప్రభ స్పందిస్తూ ‘‘ఈ గుర్తింపు నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. నాకు ఎల్లవేళలా మార్గదర్శకులుగా నిలిచిన నా తల్లితండ్రులకు, గురువులకు, శ్రోతలకు దీన్ని అంకితం చేస్తున్నాను. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల వల్లే ఇది సాధ్యపడింది’’ అన్నారు ‘‘హిందుస్తానీ సంగీతంలోకి అడుగుపెడుతున్న ఔత్సాహికులకు నేను ఇచ్చే సలహా ఒక్కటే.. మీరు చేసే పని మీరు సంతృప్తి ఇవ్వాలి. దాని కోసం మాత్రమే సంగీతాన్ని సాధన చెయ్యండి. అవార్డులను ఆశించవద్దు. అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి’’ అని చెబుతున్నారామె.


‘‘మనం చేసే పని కోసం ఎంతో ఆలోచించాలి, ఎంతో మధనపడాలి. అప్పుడు ఖచ్చితంగా అత్యున్నత స్థాయి సంతృప్తి లభిస్తుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.