ఈ ఏడాదికి ఇంతేనా?

ABN , First Publish Date - 2021-05-31T05:10:09+05:30 IST

‘వంశధార రిజర్వాయర్‌ను జూలై 31 నాటికి పూర్తిచేస్తాం. ఖరీఫ్‌నకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 45 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తాం’..అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. బడ్జెట్‌ ప్రసంగంలో కూడా ప్రస్తావించింది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇంకా పది శాతానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనవే. కానీ పనులు చూస్తే నత్తనడకన జరుగుతున్నాయి. కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం.

ఈ ఏడాదికి ఇంతేనా?
హిరమండలం వద్ద అంతంత మాత్రంగా సాగుతున్న వంశధార రిజర్వాయర్‌ పనులు

నత్తనడకన ‘వంశధార’ నిర్మాణ పనులు

కరోనాతో స్వగ్రామాలకు కూలీలు

జూలై 31 నాటికి పూర్తిచేయడం కష్టమే!

(హిరమండలం)

‘వంశధార రిజర్వాయర్‌ను జూలై 31 నాటికి పూర్తిచేస్తాం. ఖరీఫ్‌నకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 45 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తాం’..అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. బడ్జెట్‌ ప్రసంగంలో కూడా ప్రస్తావించింది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇంకా పది శాతానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనవే. కానీ పనులు చూస్తే నత్తనడకన జరుగుతున్నాయి. కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. కరోనా సెకెండ్‌ వేవ్‌లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న కూలీలు ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. రోజురోజుకూ ఉధృతి పెరుగుతుండడంతో భయంతో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. 80 శాతం మంది కూలీలు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూలీలు తక్కువ మందే పనిచేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్‌కు రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా ప్రాజెక్ట్‌ పనులు పూర్తికావడం అనుమానమే. 


నెల రోజుల కిందట వరకూ...

రిజర్వాయర్‌ నిర్మాణ గడువు ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. పనులు నత్తనడకన సాగడం, సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం. ఎట్టి పరిస్థితుల్లో జూలై 31 నాటికి పనులు పూర్తి చేసి రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయాలన్న తలంపుతో అధికారులు పనిచేస్తూ వచ్చారు. ప్రతి వారం ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శివరాంప్రసాద్‌ పనుల పురోగతిపై సమీక్షించేవారు. స్వయంగా సందర్శించి కాంట్రాక్టర్‌తో పాటు అధికారులకు సలహాలు, సూచనలు అందించేవారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌ చకచకా పనులు చేయించారు. నెల రోజుల కిందట వరకూ ప్రక్రియ చాలా వేగవంతంగా సాగేది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాలు, కూలీల సంఖ్యను సైతం పెంచారు. పశ్చిమబెంగాల్‌,  బిహార్‌ వంటి ఉత్తరాధి రాష్ట్రాల నుంచి నైపుణ్యం కలిగిన కూలీలను తెప్పించారు. వారు ఇప్పుడు ఇంటిముఖం పట్టారు. 


పనుల్లో మందగమనం

ప్రస్తుతం రిజర్వాయర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 8,000 క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ జరిగేది. కానీ ప్రస్తుతం 1500 క్యూబిక్‌ మీటర్లు మించి పనులు జరగడం లేదు. స్లూయీస్‌ లింక్‌ హెడ్‌, స్పిల్‌వే, కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి. ఉన్న కొద్దిమంది కూలీలతో రాతికట్టు పనులు మాత్రమే చేస్తున్నారు. మిగిలి ఉన్న పది శాతం పనులే కీలకమని...దీనికి నైపుణ్యం గల కూలీలు అవసరమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది పనులు పూర్తిచేయడం కష్టమని భావిస్తున్నారు. రిజర్వాయర్‌లో వరద నీరు చేరితే పనులకు సాధ్యం కాదు. ఎర్త్‌ వర్క్‌కు సంబంధించి ఇంకా 25,000 క్యూబిక్‌ మీటర్లు పనిచేయాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఖరీఫ్‌ నాటికి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యే అవకాశముంది.


గడువులోగా కష్టమే..

కరోనా కేసులు పెరుగుతుండడంతో కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. ఉన్న తక్కువ మంది కూలీలతో పనులు చేయిస్తున్నాం. ఎర్త్‌ వర్క్‌ పనులు చేపడుతున్నాం. కీలక నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. పది శాతం పనులే మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గడువులోగా  పూర్తి చేయడం కష్టమే.

డోల తిరుమలరావు, ఎస్‌ఈ, వంశధార ప్రాజెక్టు

Updated Date - 2021-05-31T05:10:09+05:30 IST