కృష్ణమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2021-07-24T04:53:13+05:30 IST

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరం, పశ్చిమ కనుమల్లో కుండ పోత వర్షాలు కురిశాయి.

కృష్ణమ్మ పరవళ్లు
ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం

కృష్ణా నదికి భారీగా వరద నీరు 

ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణమ్మ

నిండుకుండలా పులిచింతల జలాశయం

ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద ప్రవాహం

సాగర్‌ ఆయకట్టులో సాగుపై చిగురిస్తోన్న ఆశలు 



కృష్ణమ్మ.. పరవళ్లు తొక్కుతోంది. సాగరం దిశగా పరుగులు తీస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీగా వర్షాలు పడుతుండటంతో వరద నీరు పోటెత్తుతోంది. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు నీటిని దిగువకు భారీగా వదులుతున్నారు. దీనికితోడు సమీప ప్రాంతాల నుంచి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 31,783 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పులిచింతల జలాశయం నిండుకుండలా మారింది. ఇక ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరింది. దీంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. లంకల్లో ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. వరుణుడి కరుణ లేక.. వట్టిపోతోన్న జలశయాలతో ఇంతకాలం సాగు సందిగ్ధంలో పడింది. అయితే ప్రస్తుత పరిణామాలు అన్నదాతల్లో ఆశలు చిగురింపచేస్తున్నాయి. 




నరసరావుపేట, అమరావతి, అచ్చంపేట, జూలై 23: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరం, పశ్చిమ కనుమల్లో కుండ పోత వర్షాలు కురిశాయి. ఈ నీరు అంతా ఆల్మట్టికి వస్తున్నదని అధికారులు లెక్కలు కడుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టికి 81,202 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో దిగువకు 1.17 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణ్‌పూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తున్నది. శ్రీశైలం జలాశయానికి ఈ నెలాఖరు వరకు వరద నీరు వస్తుందని నీటి పారుదల శాఖ అంచనా. ఇప్పటికే 75.80 టీఎంసీల  నీటి నిల్వలు శ్రీశైలం జలాశయంలో ఉన్నాయి.    శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 848 అడుగులకు చేరుకుంది. జలశయాలు జలకళతో నిండిపోతున్నాయి. దీంతో సాగర్‌ ఆయకట్టులో వరి సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.


ఆగస్టు 15న నీటి విడుదల? 

సాగర్‌ జలాశయంలో ఆశాజనకంగా నీటి నిల్వలు ఉన్నాయి. సాగర్‌ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా శుక్రవారం 535.8 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు 179.69 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  సరిపడా నీరు ఉంటే అగస్టు 15న నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం నీటిని వృఽథా చేసింది. లేకుంటే మరో 24 టీఎంసీల నీరు అదనంగా ఉండేది. ఇంకా 150 టీఎంసీలకు పైగా నీరు శ్రీశైలం, సాగర్‌కు వస్తే కుడి కాలువలకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. కుడి కాలువకు కనీసం 80 టీఎంసీల నీరు సరఫరా చేస్తే ఒక పంట వరి పండే అవకాశం ఉంది.  ప్రభుత్వం సాగర్‌ ఆయకట్టుకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నదాతలు చెపుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు ఇలానే కొనసాగాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


నిండుకుండలా పులిచింతల

పులిచింతల జలాశయానికి ఎగువన ఉన్న డ్యాంలు నిండితేనే పులిచింతల నిండేది. ఈ సారి విచిత్ర పరిస్థితి నెలకొంది. అన్ని జలాశయాల కంటే మొదట పులిచింతల నిండింది. తెలంగాణ నీటి నిర్వాకం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. పులిచింతల నుంచి ఇప్పటికే దాదాపు 18 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరి నిండుకుండలా మారింది. దీనికితోడు భారీ వర్షాలతో పులిచింతలకు వరదనీరు పొటెత్తుతున్నది. ప్రాజెక్టు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒక గేటు ఒక మీటరు ఎత్తి 23,998 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టులో 43.59 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఆ గేటును మూసి  12,540 క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేశారు. మరో ఆరు వందల క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా దిగువకు 13,140 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్టు ప్రాజెక్టు డీఈఈ రఘునాథ్‌ తెలిపారు. ఎగువ నుంచి 13,140 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతున్నట్టు తెలిపారు. కృష్ణా నది నీటి మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతంలో నివసిస్తున్న వారిని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అప్రమత్తం చేశారు. లోతట్టులో ఉన్న రైతులు వారి వ్యవసాయ మోటర్లను నది నుంచి ఒడ్డుకు చేర్చుకుంటున్నారు.


10 అడుగుల మేర ప్రవాహం

అమరావతి మండల పరిధిలోని పలు గ్రామాలను తాకుతూ ప్రవహిస్తున్న నదికి  జలకళ తెచ్చింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా నీరురావడం, కృష్ణాజిల్లాలోని మునేరు నుంచి వరద నీరు, వాగుల నుంచి వస్తున్న వర్షపు నీటితో నది నిండుకుండలా ప్రవహిస్తుంది. సుమారు 10 అడుగుల మేర నదిలో నీటి మట్టం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మండల పరిధిలోని ఇసుక రీచ్‌లలో వాహనాల రాకపోకల కోసం నదిలోకి వేసిన రహదారులు కొట్టుకు పోయాయి.  

  

తీరంలో.. అప్రమత్తం

పంటలను కాపాడాలని రైతుల అభ్యర్థన

తెనాలి(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని తీర గ్రామాలు, నది మధ్య ఉన్న లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులు, గొర్రెల వంటి వాటిని నది నుంచి సురక్షిత గ్రామాలకు తరలించాలని పల్లపు ప్రాంతాల్లో ఉండేవారు మెరక ప్రాంతాలకు వెళ్లాలని దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల తహసీల్దార్లు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం కూడా వరద ప్రవాహం పెరిగితే  తెనాలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. తీర గ్రామాల అధికారులను వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామాల్లోనే జనానికి అందుబాటులో ఉండాలని ఇప్పటికే జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా 1.10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నిలకడగా ఉండటంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలతో మునేరు, పాలేరు, మరికొన్ని పాయల నుంచి నదిలోకి నీరు భారీగానే వచ్చి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో బ్యారేజి దగ్గర సామర్థ్యానికి మించి నీటిని ఆపకుండా వదిలేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. లక్ష క్యూసెక్కులకంటే ఎక్కువే వరద నీరు నదిలోకి చేరుతుందని, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. దిగువకు భారీగా వరద నీరు వస్తుండటంతో లంకల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు.   అరటి, బొప్పాయి, తమలపాకు వంటి వాణిజ్య పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని వరద వస్తే సర్వం కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు గతంలోలాగా ఒకేసారి నీటిని వదిలేయకుండా, ప్రణాళిక ప్రకారం వదలాలని కోరుతున్నారు. అలా చేస్తే పంటలు, గ్రామాల్లోని ఇళ్లు మునగవని అభ్యర్థిస్తున్నారు.  


1.10 లక్షల క్యూసెక్కుల విడుదల

తాడేపల్లి టౌన్‌: శుక్రవారం ఉదయానికే ప్రకాశం బ్యారేజి నీటిమట్టం 12 అడుగులకు చేరింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 50 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వదిలారు. దానిని  క్రమంగా పెంచుతూ రాత్రికి 1.10 లక్షల క్యూసెక్కులకు చేర్చారు. బ్యారేజి వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. దీంతో 10 గేట్లను మూడు అడుగులు, 60 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 1 లక్షా 10 వేల 250 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి 1 లక్షా 11 వేల 800 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 1560 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.


కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు

భారీ వర్షాలతో ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే నెంబరు.0863 2234014కి ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. ఈ ఫోన్‌ నెంబర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఇందుకోసం మూడు షిఫ్టులలో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హ్యామ్‌ రేడియో సెల్‌ సెంటర్‌కు సిబ్బందిని కూడా నియమించామన్నారు. 

Updated Date - 2021-07-24T04:53:13+05:30 IST