సింహగిరిపై వరదపాయసోత్సవం

ABN , First Publish Date - 2022-07-07T06:21:37+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిని సింహగిరి ఈశాన్యదిక్కులోని కొండపై బుధవారం వైభవంగా వరద పాయసం ఉత్సవాన్ని నిర్వహించారు.

సింహగిరిపై వరదపాయసోత్సవం
బండపై పాయసం పోస్తున్న సిబ్బంది

ఆలస్యంగా ప్రారంభమైన కార్యక్రమం 

సమాచారం ఇవ్వని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై వేటు 

సింహాచలం, జూలై 6: వరాహలక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిని సింహగిరి ఈశాన్యదిక్కులోని కొండపై బుధవారం వైభవంగా వరద పాయసం ఉత్సవాన్ని నిర్వహించారు. వర్షరుతువు ఆగమన వేళ ఏటా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అదే క్రమంలో వైకుంఠ నారాయణుడి సన్నిధిలో ఆగమశాస్త్ర విధానంలో పురోహితులు కరి సీతారామాచార్యులు, ఇన్‌చార్జి ప్రధానార్చకులు కేకే ప్రసాదాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు షోడశోపచారాలు సమర్పించి, పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత ఆలయానికి సమీపంలో కైంకర్యపరులు (వంటవారు) ప్రత్యేకంగా అక్కడే తయారుచేసిన పాయసాన్ని నివేదన చేసి, సమీపంలో కొండపై  మంత్ర జలాలతో ప్రోక్షణ చేసిన బండపై పోశారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు వితరణ గావించారు.  ఈ ఉత్సవం నిర్వహించడం వల్ల  సకాలంలో వర్షాలు కురుస్తాయని భక్తుల విశ్వాసం. అయితే ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రధానార్చకులు, అర్చకులు రెండున్నర గంటలు ఆలస్యంగా పూజాదికాలు ప్రారంభించారు. పాయసం తయారుచేయాల్సిన కరోడా (హెడ్‌కుక్‌), ముడిసరుకులు ఇవ్వాల్సిన స్టోర్స్‌ సిబ్బందికి సమాచారం అందకపోవడం ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు.  అంతేకాకుండా ఉత్సవం నిర్వహించే ప్రదేశంలో తుప్పలను కూడా తొలగించలేదు. దీనిపై ఈఓను ప్రశ్నించగా సమాచారాన్ని ఇవ్వడంలో డిస్పాచ్‌ గుమస్తా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారించామని, అందుకు కారణమైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అప్పలరాజును విధుల నుంచి తొలగించామన్నారు. 




Updated Date - 2022-07-07T06:21:37+05:30 IST