వైభవంగా వరదరాజ పెరుమాళ్ రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-20T14:03:18+05:30 IST

వరదరాజ పెరుమాళ్‌ ఆలయ రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది కాంచీపురంలో ప్రసిద్ధిచెందిన వరదరాజ పెరుమాళ్‌ ఆలయ వైశాఖి మాస

వైభవంగా వరదరాజ పెరుమాళ్ రథోత్సవం

                    - పులకించిన కాంచీపురం 


పెరంబూర్‌(చెన్నై): వరదరాజ పెరుమాళ్‌ ఆలయ రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది కాంచీపురంలో ప్రసిద్ధిచెందిన వరదరాజ పెరుమాళ్‌ ఆలయ వైశాఖి మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో వరదరాజ పెరుమాళ్‌ బంగారు సప్పరం, శేష, గరుడ, గజ తదితర వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధానాంశంగా ఏడో రోజైన గురువారం రథోత్సవం నిర్వహించారు. తొలుత స్వామివారిని భూదేవి, శ్రీదేవి అమ్మవార్లతో కలిపి పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం 73 అడుగుల రథంపై ఉత్సవమూర్తులను ఉంచారు. భక్తులు ‘గోవింద నామస్మరణ చేస్తూ రథం లాగారు. తేరడి నుంచి బయల్దేరిన రథం ముంగిల్‌ మండపం, నాలుగు రాజ వీధుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. రథోత్సవంలో జిల్లా కలెక్టర్‌ ఆర్తీ, కాంచీపురం డీఐజీ సత్యప్రియ, ఎమ్మెల్యే ఎళిలరసన్‌,  మేయర్‌ మహాలక్ష్మి, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి వి.సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. ఉత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో కాంచీపురం కిటకిటలాడింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం, మజ్జిగ, శీతల పానీయాలు అందజేశాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 750 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-05-20T14:03:18+05:30 IST