వరదొస్తే..అంతే!

ABN , First Publish Date - 2021-11-28T05:42:47+05:30 IST

‘వరద వస్తే నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను సకాలంలో అప్రమత్తం చేస్తున్నారా? వరదను గుర్తించే పరికరాలు ఉన్నాయా? ఉంటే పని చేస్తున్నాయా? జలాశయం నుంచి నీరు వదిలేటప్పుడు తీర ప్రాంత ప్రజలకు తెలుస్తోందా?’ ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానం వినిపిస్తోంది.

వరదొస్తే..అంతే!
తాటిపూడి గేటు పైకి లేచిపోవడంతో గోస్తనీలోకి ఉధృతంగా చేరుతున్న నీరు(ఫైల్‌)

హెచ్చరించే వ్యవస్థే లేదు 

హఠాత్తుగా ప్రవాహాలు పెరిగితే కష్టం

కొరవడిన అప్రమత్తత

 సమాచారం లేకుండా జలాశయాల నుంచి నీరు విడుదల

నదుల చెంత పని చేయని సాంకేతిక పరికరాలు


‘వరద వస్తే నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను సకాలంలో అప్రమత్తం చేస్తున్నారా? వరదను గుర్తించే పరికరాలు ఉన్నాయా? ఉంటే పని చేస్తున్నాయా? జలాశయం నుంచి నీరు వదిలేటప్పుడు తీర ప్రాంత ప్రజలకు తెలుస్తోందా?’ ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానం వినిపిస్తోంది. కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు వరద ఉధృతికి ఛిద్రమైన గ్రామాల దుస్థితి నేడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడి అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోవడంతో కోలుకోలేని నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఉత్పన్నంకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోనో... ఎగువ ప్రాంతాల్లోనో భారీ వర్షాలు కురిసినప్పుడు నదుల ప్రవాహాలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో జలాశయాల ద్వారా దిగువకు నీరు విడిచి పెట్టాల్సి వస్తుంది. దీంతో దిగువ భాగంలోని నదిలో కూడా ఒకేసారి భారీగా వరద పోటెత్తే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీరు తక్కువగా వస్తోందని భావించి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెను ప్రమాదం తప్పదు. నిమిషాల వ్యవధిలో ప్రవాహం పెరుగుతుంటుంది. అప్పటికప్పుడే ఉధృతంగా మారుతుంటుంది. నదిలో ప్రజలుంటే అపాయమే. ఇటువంటి ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్న ఉదంతాలు అనేకం. అయినా హెచ్చరించే వ్యవస్థ మనదగ్గర లేదు.  అప్పటికప్పుడు ప్రజలు గుర్తించడమో... ప్రాణాల మీద ఆశ వదులుకోవడమో చేయాల్సిందే. రెండేళ్ల కిందట తాటిపూడి జలాశయం గేటు ఉన్నఫళంగా పైకి లేచిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా గోస్తనీలోకి వరద పోటెత్తింది. ఈ విషయం తెలియక జామి వద్ద నదిలో దుస్తులు ఉతుకుతున్న మహిళ కొట్టుకుపోయింది. నెల రోజుల కిందట సువర్ణముఖీ నదిలో ఓ గొర్రెల కాపరి, గొర్రెలు చిక్కుకున్నాయి. నదీ ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయిన ఆయన ఓ కొండరాయిపై కొన్ని గంటల పాటు ఉండిపోయాడు. రాత్రి వేళ నేవీ హెలికాప్టర్‌ సాయంతో బతికి బయటపడ్డాడు. 

ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు అధికారులు నదీ పరీవాహక గ్రామాల ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. జలాశయాల ద్వారా నీటిని దిగుగువకు విడిచిపెట్టేటప్పుడు ఆ గ్రామాలను అప్రమత్తం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది కనిపించడం లేదు. గ్రామాల్లో చాటింపు వేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా ఇంకా దండోరానే వాడుతున్నారు. అది కూడా సక్రమంగా జరగడం లేదు. ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. దీంతో ప్రమాదాలకు జనం బలి కావాల్సి వస్తోంది. జిల్లాలో నదులకు కొదవలేదు. వట్టిగెడ్డ, గుమ్మిడిగెడ్డ, అడారుగెడ్డ, నాగావళి, జంఝావతి, సువర్ణముఖి వేగావతి, చంపావతి, గోస్తనీ నదులు, వాగులు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నదులుగా భావించే నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తనీ నదీ ప్రవాహాలు ఎప్పటికప్పుడు తగ్గుతుంటాయి.. పెరుగుతుంటాయి. క్యాచమెంట్‌ ఏరియాల్లో వర్షాలు పడినపుడు జలాశయాల్లోకి ఇనఫ్లో అధికంగా రావటంతో గరిష్ట స్థాయికి నీటి మట్టాలు చేరుకుంటున్నాయి. ఆ సమయంలో స్పిల్‌వే రెగ్యులేటర్‌ గేట్ల ద్వారా నీరు విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు తెలియజేయడం లేదు. కొందరికే సమాచారం అందుతోంది. దీంతో భయం భయంగా గడపాల్సి వస్తోంది.

పరికరాలు పని చేస్తున్నాయా?

నదీ ప్రవాహాలు పెరిగినపుడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావాలి.  ప్రవాహ సామర్థ్యాలను అంచనా వేసేందుకు నది ఒడ్డున కొన్నచోట్ల సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా పనిచేసే సంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇవి పని చేస్తున్నదీ లేనిదీ తెలియరావడం లేదు. విపత్తుల నివారణ శాఖ అధికారుల వద్ద ప్రస్తావిస్తే తమకు సంబంధించిన పరికరాలు కావని చెబుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా వాతావరణ శాఖ ఏర్పాటు చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇవి ఏ శాఖ ఏర్పాటు చేసినప్పటికీ పనిచేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. సువర్ణముఖి నది వద్ద ఏర్పాటు చేసిన పరికరాలను పూర్తిగా తొలగించారు. జంఝావతి నది ఒడ్డున కోటిపాం వద్ద ఏర్పాటు చేసిన పరికరాలు ఊడిపోతున్నాయి. సోలార్‌ ప్యానళ్లు పోయాయి. వేగావతి నది ఒడ్డున పారాది వద్ద ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదు. వీటిని ఏర్పాటు చేసిన తరువాత నిర్వహణను వదిలేశారు. సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా ఎలక్ర్టానిక్‌ పరికరాలు పనిచేయాలంటే బ్యాటరీ ఉండాలి. బ్యాటరీని ఎప్పటికపుడు తనిఖీ చేయాలి. ఇది జరగక పరికరాలు మూలకు చేరాయి. ఏదేమైనా జలాశయాల నుంచి నదుల్లోకి నీటిని విడిచిపెడుతున్న సమయాల్లో నదీ పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలి. అది కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా త్వరగా గ్రామాల్లోకి సమాచారం వెళ్లేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. 



Updated Date - 2021-11-28T05:42:47+05:30 IST