ltrScrptTheme3

వరాల తెలుగులు రెండూ ఒకటే

Oct 21 2021 @ 00:39AM

‘రెండు తెలుగులు అవసరమా!’ అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం (23.౦9.2021) ఒక చిన్న విషయాన్ని పట్టుకొని వేలాడింది. అదేమిటంటే తెలంగాణ భాష ఒకటి ఉన్నదా అని. తెలంగాణ భాష అంటే మరొక భాష కాదు, అది తెలుగుకు మరో పేరు అని అర్థం చేసుకుంటే సరిపోతది. తెలంగాణ భాష అంటే తెలంగాణలో మాట్లాడే భాష అని పిల్లలు కూడ అర్థం చేసుకుంటరు. బ్రిటీష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్ అనేవి దేశాలకు సంబంధించిన తేడాలు అన్నట్టుగనే ఆంధ్ర భాష ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడేది, తెలంగాణ భాష తెలంగాణలో మాట్లాడేది. రెండూ తెలుగులే.


ఆంధ్ర మహా భారతము, ఆంధ్ర మహా భాగవతము, ఆంధ్ర పురాణం, ఆంధ్ర వాల్మీకి, ఆంధ్రా షెల్లీ, ఆంధ్రా టెన్నిసన్, ఆంధ్ర రత్న, ఆంధ్ర విశ్వ విద్యాలయము, ఆంధ్ర సారస్వత పరిషత్తు... అని ఎన్నెన్నో తెలుగు అని ఉండవలసిన వాటన్నిటినీ ఆంధ్రీకరిస్తే, వీటన్నిటిని తెలుగు అస్తిత్వంలో భాగమని మేం అనుకున్నం గద. ఆంధ్ర భాష అంటే తెలుగు భాష అని అర్థం చేసుకున్నట్టు తెలంగాణ భాష అంటే తెలుగు భాష అని ఎందుకు అర్థం చేసుకుంటలేదు? మాది తెలంగాణ భాష అనే అంటం. మా తల్లి తెలంగాణ అనే అంటం. వ్యవహారిక భాషల మాట్లాడుతున్నది రాస్తున్నది మేమే. మా భాష తెలుగు మాండలికం అంటే మేము ఒప్పుకోం. మాదే అచ్చ తెలుగు భాష. 


తెలంగాణ భాష లక్షణాలు, స్వరూపం, స్వభావం ఏమిటో ఇక్కడి ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడి భాష ముచ్చట్ల గురించి బిరుదురాజు రామరాజు, కాళోజీ నారాయణ రావు, యశోదా రెడ్డి, సి. నారాయణ రెడ్డి, రవ్వా శ్రీహరి, వేముల పెరుమాళ్ళు, నలిమెల భాస్కర్, కపిలవాయి లింగమూర్తి, మలయశ్రీ, నందిని సిధారెడ్డి, జయధీర్ తిరుమల్ రావు, ముదిగంటి సుజాతారెడ్డి, భూతం ముత్యాలు, కాలువ మల్లయ్య, బి.యస్ రాములు మొదలైన వాళ్ళు ఎందరో వ్యాసాలు రాసిండ్రు, రాస్తున్నరు. కవిత్వంల, కథల్ల, నవలల్ల, వ్యాసాలల్ల అన్నిట్ల పాల్కురికి సోమన కాలం నుంచే ఇక్కడి కవులు, రచయితలు దేశీ తెనుగు, జాను తెనుగు, అచ్చ తెనుగు కోసం ఉద్యమ స్థాయిల రచనలు చేసిండ్రు. తెలంగాణ భాష ఒకటుందని నిరూపించాల్సిన అవసరం లేదు. మరొకరు గుర్తించాల్సిన అవసరం లేదు.


పక్కనున్న తెలుగు భాష గురించి సంకుచిత దృష్టితో మాట్లాడే వాళ్ళు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు మాండలికాల గురించి మాట్లాడడమెందుకు. ఒక్క ‘అంగి’ ఉదాహరణ చూయించుతె కడమయన్ని కొట్టుడువోతయా. నల్లగొండ జిల్లా వ్యవహార కోశం, తెలంగాణ పదకోశం, పామర సంస్కృతం, తెలంగాణ మాండలీక వృత్తి పదకోశం, గుమ్మిల ఉన్న పదాలన్ని తెలంగాణ సొంతం కాదా. ఒక్క శబ్ద రత్నాకరం ఆధారంగా నలిమెల భాస్కర్ గారు తెలంగాణ భాష దేశ్య పదాలు, సంస్కృత పదాలు, తమిళ పదాలు, క్రియా పదాల వివరణలు రాసిండ్రు. ఒక్కసారి చూస్తే మా ప్రాంతీయ ఉబలాటానికి బలమేమిటో తెలిసి వస్తది. తెలంగాణ భాష అంటూ మాట్లడేటోళ్ళ చూపు కొన్ని పదాలకు పరిమితమైతే, నిఘంటువులు ఎట్లా తయారైనయి. భాష గుమ్మి నిండ పదాలు కుప్పవొయ్యడమే వాటి వల్ల ప్రయోజనం. వాటిని ఏరుకొని మన అవసరాలకు సరిపొయ్యే పదాలను తీసుకుంటె అంతకన్న ప్రయోజనం మరొకటి ఉండది.  భాషను శాస్త్రవేత్తలు తయారు చెయ్యరు. ప్రజలు చేస్తరు. భాష భవిష్యత్ తరాలకు పైలంగ ముట్టాలంటే పుస్తక భాషను కాదు ప్రజల వ్యవహారాన్ని పట్టిచ్చుకోవాలె. కొత్త పదాల సృష్టి తెలుగుల జరగాలె.


తెలుగును బానిసత్వంలోకి నెట్టి పరాధీనం కాకుండా చూడడానికి తెలంగాణత్వమే దిక్కు. ప్రాచీన హోదాతో వచ్చిన అవకాశాలను సమంగా పంచుకోవడం, ఎవరి భాషను వాళ్ళు పరిశోధించుకోవడం, కాపాడుకోవడం నేటి అవసరం. ఉత్తర సర్కారులలోని, నైజాం రాజ్యంలోని తెలుగు వారు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ భాషలో అచ్చులు ఎక్కువగా ఉండడం చేత దీనికి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న పేరు వచ్చింది అని గుర్తుంచుకోవాలె.

బూర్ల వేంకటేశ్వర్లు

కవి, తెలుగు సహాయాచార్యుడు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.