Advertisement

శాంతి మార్గదర్శకుడు!

Apr 23 2021 @ 00:00AM

  • 25న మహవీర జయంతి


‘‘కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి’’ అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. ‘సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక’ అనే త్రిరత్నాలను పాటించడమే మోక్షాన్ని పొందే మార్గమని ఆయన బోధించాడు.


జైన మతం అనగానే గుర్తుకు వచ్చే పేరు వర్ధమాన మహావీరుడు. ఆ మతాన్ని స్థాపకుడు కూడా ఆయనే అనే అభిప్రాయం ఉండేది. అది వాస్తవం కాదని పండితులు, చరిత్రకారులు నిరూపించారు. మహావీరుడు ఆ మతంలో ఇరవై నాలుగో తీర్థంకరుడు. ఆయనే ఆఖరివాడని జైనుల విశ్వాసం. నిజానికి, ఆయనను జైన ధర్మ సంస్కర్తగా పేర్కొనవచ్చు. తనకు పూర్వం ఉన్న పద్ధతుల్లో ఎన్నో మార్పులకు ఆయన శ్రీకారం చుట్టాడు.


జైన, బౌద్ధ ధర్మాలు బోధించే విషయాల్లో ఎన్నో సారూప్యాలున్నట్టే... మహావీరుడికీ, గౌతమ బుద్ధుడికీ కూడా ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ రాజకుమారులే. వివాహమై, పిల్లలు కలిగిన తరువాత... ఇల్లు వదిలి సత్యాన్వేషణకు బయలుదేరారు. బౌద్ధ, జైన మతాలు రెండూ ప్రారంభంలో ఎక్కువ ప్రభావం చూపించింది... మగధ రాజ్య (ప్రస్తుత బీహార్‌) ప్రాంతంలోనే. బుద్ధుడి పేరు వినగానే అహింస గుర్తుకు వస్తుంది. ‘అహింసో పరమోధర్మః’ అని హిందూ ధర్మం చెప్పినా, అహింస నిత్య జీవనంలో తప్పనిసరి భాగంగా ఉండాలని బుద్ధుడి కన్నా ముందు చెప్పినవాడు వర్ధమాన మహావీరుడు. 


క్రీస్తుపూర్వం 599లో, బీహార్‌లోని వైశాలికి సమీపంలో ఉన్న కుందగ్రామంలో వర్ధమానుడు జన్మించాడు. ముప్ఫయ్యవ యేట ఇల్లు వదలి... జ్ఞానాన్వేషణ కోసం అడవుల్లో, కొండల్లో తిరిగాడు. ధ్యానం చేశాడు. దిగంబర మునిగా మారాడు. జంతుబలులు ప్రధానంగా ఉండే యజ్ఞయాగాదులను, కుల వర్గీకరణనూ వ్యతిరేకిస్తూ ఆయన చేసిన బోధ రాజుల నుంచి సామాన్యుల వరకూ... ఎందరినో ఆకర్షించింది. ఒక మనిషి అతను చేసిన పనుల వల్ల గొప్పవాడవుతాడు కానీ కులం వల్లనో, జాతి వల్లనో, ధనం వల్లనో కాదని, మనుషులంతా ఒక్కటేననీ వర్ధమానుడు స్పష్టం చేశాడు. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక... త్రిరత్నాలనే ఈ మూడు సూత్రాలూ మహావీరుడి బోధలకు ఆధారాలు. 

అలాగే జైన ధర్మాన్ని అనుసరించేవారు పాటించాల్సిన నియమాలను కూడా మహావీరుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. వీటిలో నాలుగు నియమాలు అంతకుముందు తీర్థంకరులు నిర్దేశించినవే. ఈ భావనలను మహావీరుడు మరింత స్పష్టంగా నిర్వచించాడు. ‘బ్రహ్మచర్యం’ అనే అయిదో నియమాన్ని వాటికి జోడించాడు. వీటిని పాటిస్తామని జైన ధర్మాన్ని అనుసరించేవారు ప్రమాణం చెయ్యాలి.

ఈ నియమాల్లో మొదటిది అహింస. జీవం ఉన్న దేనికీ హాని తలపెట్టకూడదు. మరణాలకు కారణం కాకూడదు. అన్ని రకాల హింసకూ దూరంగా ఉండాలి. మాటలతో ఇతరులను హింసించకూడదు. అందరూ తప్పనిసరిగా శాకాహారమే తీసుకోవాలి. 

రెండోది సత్యం. సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. అసత్యం ఆడకూడదు. ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకూడదు.

మూడోది అస్తేయం. అంటే... దొంగతనం చెయ్యకూడదు. ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు. 

నాలుగోది అపరిగ్రహం. మనిషి తన అవసరాలకు మంచి వస్తువులను కానీ, ఆస్తులను కానీ దాచుకోకూడదు. అధికంగా ఉన్న డబ్బునూ, వస్తువులనూ దానం చెయ్యాలి. వ్యక్తుల మీదా, వస్తువుల మీదా, ప్రదేశాల మీదా మమకారం పెంచుకోకూడదు.

అయిదోది బ్రహ్మచర్యం. శారీరకమైన కోర్కెలను దగ్గరకు రానీయకుండా, దృష్టినంతటినీ నిర్వాణం మీదనే కేంద్రీకరించాలి. 

ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరే అర్హత, శక్తి మహిళలకు కూడా ఉందని మహావీరుడు ప్రకటించాడు. తనను అనుసరించేవారిని సాధు (సన్న్యాసులు), సాధ్వి (సన్న్యాసినులు), శ్రావక్‌ (సామాన్యులైన పురుషులు), శ్రావిక (సామాన్యులైన మహిళలు) అనే నాలుగు స్థాయిలుగా వర్గీకరించాడు. 

జైన సిద్ధాంతం ప్రకారం తీర్థంకరులందరూ మానవులే. కానీ ధ్యానం, ఆత్మజ్ఞానం పొందడం ద్వారా అత్యున్నత స్థితికి చేరినవారు. జైన ధర్మంలో వారే దైవాలు. ‘సృష్టి, స్థితి, లయకారకుడైన దైవం’ అనే భావన జైన ధర్మంలో లేదు. రాక్షసులను సంహరించడానికి  దేవుడు అవతారాలు ఎత్తుతాడనే భావనను జైన ధర్మం అంగీకరించలేదు. అయితే మోక్షం పొందడం  మానవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అంతిమ లక్ష్యం - నిర్వాణాన్ని అంటే మోక్షాన్ని సాధించడమేననీ, ‘నిర్వాణం’ అంటే జననం, జీవనం, మరణం అనే చక్రం నుంచి విముక్తి పొందడమేననీ మహావీరుడు చెప్పాడు. 

మానవ జీవితాన్ని అవసర కాంక్షలూ, హింసాత్మక ధోరణులతో సంక్లిష్టం చేసుకోకుండా, నిరాడంబరంగా, అహింసతో జీవిస్తూ మోక్షాన్ని సాధించాలన్న మహావీరుడి బోధలు సర్వకాలాలకూ వర్తిస్తాయి. ప్రపంచశాంతికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.