నల్ల బియ్యం పోషకాలు ఘనం

ABN , First Publish Date - 2021-03-01T04:09:32+05:30 IST

పచ్చని పైరు బంగారు వర్ణంలో వరి గొలుసులు... పంట పొలాల్లో అగుపిస్తాయి. కానీ నాగసముద్రం గ్రామంలో నల్లని పైరు, నల్లని గొలుసులతో వరి సాగు దర్శనమిస్తోంది. ప్రస్తుతం సాగులో ఎన్నో సాంకేతిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

నల్ల బియ్యం పోషకాలు ఘనం
నాగసముద్రంలో సాగు చేస్తున్న కాలబాట నల్లవరి సాగు


నాగసముద్రంలో రెండున్నర ఎకరాల్లో నల్లవరి సాగు
దేశీయ వంగడాల సాగుపై యువ రైతుల ప్రత్యేక దృష్టి
సేంద్రియ విధానంలోనే పంటల ఉత్పత్తి

దండేపల్లి, ఫిబ్రవరి 28 : పచ్చని పైరు బంగారు వర్ణంలో వరి గొలుసులు... పంట పొలాల్లో అగుపిస్తాయి. కానీ నాగసముద్రం గ్రామంలో నల్లని పైరు, నల్లని గొలుసులతో వరి సాగు దర్శనమిస్తోంది. ప్రస్తుతం సాగులో ఎన్నో సాంకేతిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విటమిన్లు, ఆమినో ఆమ్లాలు లభించే దేశీయ వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టారు నారాయణ దంపతులు. నల్ల, ఎర్ర బియ్యం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సుగుణ- నారాయణ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మురళి ఆమెరికాలో ఉండగా పవన్‌కళ్యాణ్‌, ప్రశాంత్‌ చదువుకుంటున్నారు. మూడేళ్ల క్రితం మురళీ నల్ల, ఎర్ర బియ్యం సాగుపై కుటుంబ సభ్యులతో చర్చించారు. సేంద్రియ విధానంలో నూతన ఒరవడి వైపు ప్రోత్సహించాడు. వారికి ఉన్న మూడు ఆవుల పేడ, మూత్రం సేకరిస్తూ ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసి రెండున్నర ఎకరాలలో కాలబాట్‌, కాలబట్టి అనే నల్ల ధాన్యంతోపాటు రెడ్‌ జాస్మిన్‌, నవార, సన్నజాజులు, రత్నచోడి, నారాయణ కామిని, దడ్డిగా, పసిడి, సిరిసన్నాలు, మాలసుందరి అనే 11 రకాలను సాగు చేసున్నారు. ముఖ్యంగా కాలబట్టి, కాల్‌బాట్‌ అనే నల్లరంగు ధాన్యం ప్రాధాన్యం కల్గినవి. ఖనిజ పదార్ధాలు  ఎక్కువగా ఉండి ఆరోగ్య పరిరక్షణలో క్రియశీలక పాత్ర పోషిస్తాయి. ఈ బియ్యానికి మార్కెటులో కిలోకు రూ 250 నుంచి 300 వరకు ధర పలుకుతుండగా స్థానికులకు రూ.150కే కిలో చొప్పున విక్రయిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు పట్టించుకోని రైతులు ఇప్పుడు విత్తనాలు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు.    
       ఫఫ తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి
మొదటి దిగుబడి చాలా తక్కువ వచ్చింది. మరుసటి ఏడాది ఒక ఎకరంలో సాగు చేయగా 23 బస్తాలు, వానాకాలం సీజన్‌లో ఎకరన్నరలో సాగు చేయగా 45 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.10వేల నుంచి 15వేల దిగుబడి వస్తోంది. వీరు సాగు చేసిన పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌కుమార్‌, ఏవో అంజిత్‌కుమార్‌ సందర్శించి సేంద్రియ ద్వారా దేశీయ వంగడాల సాగును పరిశీలించి అభినందించారు.
      

    ఫఫ దేశీయ వంగడాలలో కొన్ని రకాలు..
దేశీయ వంగడాలలో నల్ల, ఎర్ర బియ్యం ఉంటాయి. మన దేశంలో సుమారు 2లక్షల వరకు దేశీయ వంగడాలు ఉండగా ప్రస్తుతం 400వరకు ఉన్నాయి. నల్ల బియ్యంలో కాలబట్టి, కాలబటు, మణిపూర్‌, బర్మా, క్రిష్ణా అనే ఐదు రకాల దేశీయ వంగడాలు ఉన్నాయి. నవారా ఎర్ర బియ్యం, తెలుపుతో ఉన్న రత్నజోడి, నారాయణ కామిని, మాల్‌సుంధర్‌, రెడ్‌జాస్మిన్‌, సిరిసన్నాలు, దడ్డిగా, మలాసుందరి, సన్నజాజులు, తదితరాలు ఉన్నాయి. నల్ల బియ్యం 135 నుంచి 145 రోజుల వరకు పంట కోతకు రాగా విగితావి 110 నుంచి 120 రోజుల్లో వస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయని చెబుతున్నారు.
     

  ఫఫ  సేంద్రియ పద్ధతిలో  సాగు
రసాయనాలకు బదులుగా ఆవుల పేడ, మూత్రంతో ఘన ద్రవ జీవామృతాలను తయారు చేస్తున్నాం. 15 లీటర్ల ఆవుపేడ, 2కిలోల బెల్లం, శనిగపిండి, 5కిలోల మట్టిని మూడు రోజులు నానబెట్టి బాగా కలిపి పంటపై పిచికారి చేసుకోవాలని యువ రైతులు సూచిస్తున్నారు. ఇలా రెండు నుంచి మూడు సార్లు పంటలకు పిచికారి చేస్తే చీడపీడలు పంటపై ప్రభావం చూపాయని చెబుతున్నారు.
    

       ఫఫ దేశవాళీ వంగడాలతో ప్రయోజనాలు..
నల్ల బియ్యంలో విటమిన్‌ బి, ఈ తోపాటు నియాసిన్‌, ఐరన్‌, జింక్‌, మెగ్నీషీయంలు అధికంగా ఉండి ఊబకాయాన్ని తగ్గించడంతోపాటు క్యాన్సర్‌, గుండెజబ్బులను నిరోధిస్తాయి.
ఫ కాలబట్‌, కాలబట్టి అనే ఈ రెండు రకాల నల్ల బియ్యం యాంటి ఆక్సిడెంటుగా పని చేయడమే కాకుండా  వివిధ రకాల ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది.  
ఫ ఎర్ర బియ్యం చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. బియ్యం నుంచి కూడా మొలకలు రావడం ప్రత్యేకం.
ఫ రత్నచూడి, పూర్వం సైనికులకు ఆహారంగా ఇచ్చే మరో దేశీయ వరి వంగడం, బియ్యం తెల్లగా సన్నగా ఉంటాయి. కండ పుష్టికి శరీర సమతుల్యతకు , రోగ నిరోధక శక్తి పెంపునకు అనువైనది.
ఫ నారాయణ కామిని, సన్నజాజుల వంగడాలు తెల్లగా పొడవుగా ఉంటాయి. అధిక పోషకాలు, పీచు పదార్థాలు కేలరీలు తక్కువగా ఉంటాయి.     
       

    ఫఫ నల్ల బియ్యం ప్రత్యేకతలు..
ఈ వంగడం దోమ పోటు, ఆగ్గి తెగులును, భారీవర్షాలను తట్టుకుంటుంది. పంట నేలవాలదు. పిల్లల్లో అధిక పోషకాలతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూసారం దెబ్బ తినకుండా ఉంటుంది. నవారా రైస్‌  ద్వారా ఘుగర్‌ వ్యాధిగ్రస్ధులకు మంచి ఫలితం ఉంటుంది. ఈ విత్తనాన్ని కేరళ ఆయుర్వేదంలో వాడుతున్నారు. మోకాళ్ల నొప్పులు నరాల బలహీనత ఉన్న వారికి ఈ బియ్యన్ని మసాజ్‌ చేయడానికి వాడుతున్నారు.

Updated Date - 2021-03-01T04:09:32+05:30 IST