
రాగుల్లో పోషకాలు పుష్కలం. అలా అని రోజూ రాగి ఇడ్లీ, రాగి దోశ తినలేం. అలాంటప్పుడు రాగి పిండితో చేసే బిస్కెట్లు, బర్ఫీ, కట్లెట్లు, జంతికలు లాంటివి చేసుకుంటే స్నాక్స్‌గా తినొచ్చు. వాటి తయారీ విశేషాలు ఇవి...
100గ్రాముల రాగులలో పోషకవిలువలు
క్యాలరీలు - 320
ప్రొటీన్లు - 7.16గ్రా
కార్బోహైడ్రేట్లు - 66.82గ్రా
డైటరీ ఫైబర్ - 11.18గ్రా
క్యాల్షియం 344మి.గ్రా
రాగి కేక్
కావలసినవి: రాగి పిండి- అరకప్పు, గోధుమపిండి- ఒక కప్పు, పంచదార- ముప్పావు కప్పు, కోకో పౌడర్- రెండు టేబుల్‌స్పూన్లు, బేకింగ్ సోడా- అర టీస్పూన్, బేకింగ్ పౌడర్- ఒక టీస్పూన్, ఉప్పు- చిటికెడు, చిక్కటి పెరుగు- ముప్పావు కప్పు, పాలు - పావు కప్పు, నూనె- పావు కప్పు, వెనీలా ఎసెన్స్- ఒక టీస్పూన్, తేనె- రెండు టీస్పూన్లు, అరటిపండు- ఒకటి, నూనె- ఒక టీస్పూన్, మైదా- ఒక టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ఒక బౌల్లోకి రాగిపిండి, గోధుమపిండి, మైదా, కోకో పౌడర్, బేకింగ్‌సోడా, బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.
మరొక బౌల్లో అరటిపండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో పాలు, చిక్కటి పెరుగు, నూనె, వెనీలా ఎసెన్స్, తేనె, పంచదార వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి.
తరువాత కేక్పాన్కు నూనె రాసుకోవాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పాన్‌లో పోయాలి.
180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ప్రీహీట్ చేసిన ఓవెన్లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి.
తరువాత కేక్‌పాన్ బయటకు తీసి చల్లారిన తరువాత కేక్‌ను ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.
ప్రయోజనాలివి...
- రాగుల్లో క్యాల్షియం మోతాదు ఎక్కువ. ఇది ఎదిగే పిల్లలకు మంచిది. ఆస్టియోపోరోసి్సతో బాధపడుతున్న వారు తినదగిన ఆహారం
- డయాబెటి్‌సను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్‌తో బాధపడుతున్న వారు బ్రేక్‌ఫా్‌స్టగా రాగులతో చేసిన ఇడ్లీ, దోశ, రోటీ లాంటివి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వాళ్లకి ఇది మంచి ఆహారం.
- రాగులను తీసుకునే వారిలో ఒత్తిడి, ఆందోళన కూడా తక్కువే ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, అమైన్యాసిడ్స్.
- బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. ఎక్కువ సమయం పొట్ట నిండి ఉన్న ఫీలింగ్‌ను అందిస్తుంది.

కట్లెట్స్
కావలసినవి : రాగిపిండి - ఒక కప్పు, బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్ - ఒకటి, క్యాబేజీ తురుము - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, బ్రెడ్‌క్రంబ్స్ - కొద్దిగా, నూనె - సరిపడా.
తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో రాగిపిండి, క్యారెట్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, క్యాబేజీ వేయాలి.
కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్లెట్స్ ఆకారంలో తయారుచేసుకోవాలి.
ఈ కట్లెట్స్ను బ్రెడ్‌క్రంబ్స్‌లో అద్దుకుంటూ నూనెలో వేసి వేయించాలి.
డీప్ ఫ్రై అయిన తరువాత స్నాక్స్‌గా సర్వ్ చేసుకోవాలి.

రాగి జంతికలు
కావలసినవి : రాగి పిండి - పావుకేజీ, శనగపిండి - 150గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ఒక బౌల్లో రాగిపిండి, శనగపిండి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, కొద్దిగా నూనె, తగినంత ఉప్పు వేసి, సరిపడా నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టం/చక్లీ పావులో పెట్టి ఒత్తుకోవాలి. చక్లీలు అన్నీ ఒత్తుకున్నాక ప్రీ హీటెడ్ ఓవెన్లో 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. జంతికలు ఏ ఆకారంలో ఉండాలన్నది మీ ఇష్టం. దాన్నిబట్టి జంతికల ప్లేట్ ఎంచుకోవాలి.
వీటిని ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలకు అందిస్తే ఇష్టంగా తింటారు.

బర్ఫీ
కావలసినవి : రాగిపిండి - ఒక కప్పు, నెయ్యి - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్, సిల్వర్ పేపర్ - ఒకటి, బెల్లం తురుము - ఒక కప్పు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - అరకప్పు.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి నెయ్యి వేసి చిన్న మంటపై కరిగించాలి. నెయ్యి కరిగిన తరువాత రాగి పిండి వేసి వేయించాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. రాగి పిండి రంగు మారిన తరువాత స్టవ్ పైనుంచి దింపుకొని పదినిమిషాలు చల్లారబెట్టుకోవాలి.
తరువాత స్టవ్‌పై మళ్లీ పెట్టి అందులోనే బెల్లం తురుము వేసి వేయించాలి. యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం కరుగుతున్న సమయంలో కలియబెడుతూ ఉండాలి. తరువాత కొన్ని గోరువెచ్చని పాలు పోసి మరోసారి కలుపుకొంటే రాగి మిశ్రమం రెడీ.
చివరగా ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసి అందులో రాగి మిశ్రమం పోయాలి. డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్
చేసుకోవాలి. చల్లారిన తరువాత కట్ చేసుకుంటే నోరూరించే రాగి బర్ఫీలు రెడీ.

బిస్కెట్లు
కావలసినవి : రాగి పిండి - ఒక కప్పు, బేకింగ్‌సోడా - అర టీస్పూన్, బెల్లం తురుము - పావుకప్పు, అవిసెలు - ఒక టేబుల్‌స్పూన్, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉప్పు - చిటికెడు.
తయారీ విధానం: ముందుగా అవిసెలను గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి.
ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. తరువాత నెయ్యి, బెల్లం, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నానబెట్టిన అవిసెలను వేసి మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. పలుచగా ఉన్నట్లయితే మరికొద్దిగా రాగి పిండి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో బిస్కెట్లు ఒత్తుకోవాలి.
ఈ బిస్కెట్లను బేకింగ్ ట్రేలో పెట్టి 160 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పదినిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
చల్లారిన తరువాత జాడీలో భద్రపరుచుకొని పిల్లలకు స్నాక్స్‌గా అందించవచ్చు.