కార్న్ సీజన్!
ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST
వానాకాలం... చిరుజల్లులు పడుతుంటే కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం మామూలే. అయితే ఈ కాలంలో విరివిగా దొరికే మొక్కజొన్నతో కాస్త వెరైటీగా పకోడి, గారెలు, దోశ, సబ్జీ, కబాబ్‌లు కూడా చేసుకోవచ్చు...
వానాకాలం... చిరుజల్లులు పడుతుంటే కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం మామూలే. అయితే ఈ కాలంలో విరివిగా దొరికే మొక్కజొన్నతో కాస్త వెరైటీగా పకోడి, గారెలు, దోశ, సబ్జీ, కబాబ్‌లు కూడా చేసుకోవచ్చు. ముసురు పడుతున్న వేళ ఈ కార్న్ రుచులు మీరూ ట్రై చేయండి.
పకోడి
కావలసినవి
స్వీట్ కార్న్ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్, నూనె - సరిపడా.
తయారీ
- కార్న్‌ను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి.
- తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సెనగపిండి తగినంత ఉప్పు, గరంమసాలా, బియ్యప్పిండి, కారం వేసి బాగా కలపాలి.
- మిశ్రమం మరీ మెత్తగా ఉండకూడదు. ఒకవేళ మెత్తగా అయితే కొద్దిగా బియ్యప్పిండి కలపాలి.
- స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్నమంటపై వేగించాలి.
- ఈ వేడి వేడి కార్న్ పకోడి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
కార్న్ కబాబ్
కావలసినవి
మొక్కజొన్నలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, జున్ను - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - కొద్దిగా, నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్, గరంమసాలా - అర టీస్పూన్, తెల్ల మిరియాల పొడి - అరటీస్పూన్, జాపత్రి - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారీ
- ముందుగా బంగాళదుంపలు ఉడికించి, గుజ్జుగా చేయాలి.
- ఒక పాత్రలో మొక్కజొన్నలు, బంగాళదుంపల గుజ్జు, జున్ను, తరిగిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, నల్లమిరియాల పొడి, గరంమసాలా, తెల్లమిరియాల పొడి, జాపత్రి, తగినంత ఉప్పు వేసి కలపాలి.
- ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లు చేయాలి.
- స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి అయ్యాక కబాబ్‌లు వేసి చిన్న మంటపై గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
- పుదీనా చట్నీతో వేడి వేడి కార్న్ కబాబ్స్‌ను చేసుకోవాలి.
కార్న్ సబ్జీ
కావలసినవి
స్వీట్ కార్న్ - ఒక కప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - ఒక టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, టొమాటోలు - మూడు, నూనె - సరిపడా, కారం - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - ఐదారు పలుకులు, క్రీమ్ - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్, మెంతి పొడి - ఒక టీస్పూన్, కొత్తిమీర - ఒకకట్ట.
తయారీ
- పావుకప్పు గోరువెచ్చటి పాలలో జీడిపప్పును నానబెట్టాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి పేస్టుగా చేసి పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో నీళ్లు పోసి స్వీట్ కార్న్‌ను ఉడికించాలి.
- స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించాలి.
- తరువాత ఉల్లిపాయలు వేయాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి.
- ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్న మంటపై ఉడికిస్తూ ఉండాలి.
- జీడిపప్పు పేస్టు వేసి కలపాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న స్వీట్‌కార్న్ వేయాలి.
- ఒక కప్పు నీళ్లు పోసి మరో పది నిమిషాల పాటు ఉడికించాలి.
- క్రీమ్ వేసి, గరంమసాలా, మెంతిపొడి, ధనియాల పొడి వేసి కలపాలి.
- చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపాలి.
- రోటీ లేదా చపాతీలోకి ఈ సబ్జీ ఎంతో రుచిగా ఉంటుంది.
గారెలు
కావలసినవి
కార్న్ - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - పది, ధనియాల పొడి - ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.
తయారీ
- గారెలకు స్వీట్‌కార్న్ కాకుండా మామూలువి తీసుకోవాలి. మొక్కజొన్నలు మరీ లేతగా ఉండకూడదు. అలాగనీ మరీ ముదిరిపోయినవి తీసుకోవద్దు.
- మొక్కజొన్నలు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పట్టుకోవాలి. నీళ్లు పోయకుండా పట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలియబెట్టాలి.
- స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ గారెలు నూనెలో వేసి వేగించాలి. గారెలు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
- ఈ గారెలు వేడి వేడిగా వడ్డించాలి.
స్పైసీ కేక్
కావలసినవి
స్వీట్‌కార్న్ - ఒక కప్పు, కార్న్ దాలియా - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్, ఉప్పు - తగినంత, ఫ్రూట్సాల్ట్ - ఒక టీస్పూన్, అల్లం - కొద్దిగా, నిమ్మరసం - అర టీస్పూన్, పంచదార - అరటీస్పూన్, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - తగినంత, ఆవాలు - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, కారం - అర టీస్పూన్.
తయారీ
- ముందుగా మిక్సీలో స్వీట్‌కార్న్ వేసి, తరువాత అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కార్న్ దాలియా, పెరుగు వేసి కలపాలి. తరువాత ఇంగువ, పసుపు, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి కలియబెట్టాలి.
- అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- ఇడ్లీ ప్లేట్ల లాంటి పాత్ర తీసుకోవాలి. చతురస్రాకారంలో మౌల్డ్ ఉన్న పాత్ర అయితే మరీ మంచిది. దానిపై కొద్దిగా నూనె రాయాలి.
- తరువాత పక్కన పెట్టుకున్న మిశ్రమానికి ఫ్రూట్ సాల్ట్ కలిపి మౌల్డ్ ప్లేట్స్‌పై పోయాలి.
- పావుగంట పాటు ఆవిరిపై ఉడికించాలి.
- స్టవ్‌పై ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. కరివేపాకు, ఇంగువ, కారం వేసి కలపాలి.
- ఈ పోపు మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో కార్న్ కేక్‌పై చల్లాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
కార్న్ దోశ
కావలసినవి
కార్న్ - మూడు కప్పులు, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, మినప్పప్పు - పావుకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారీ
- కార్న్, మినప్పప్పును అరగంటపాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తరువాత అందులో మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
- స్టవ్‌పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేసి కాల్చాలి. దోశలపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చాలి. తరువాత చట్నీతో సర్వ్ చేసుకోవాలి.