వరిపై ఎందుకింత పంతం?

Published: Wed, 17 Nov 2021 00:42:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వరిపై ఎందుకింత పంతం?

‘రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం’, ‘కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు’, ‘రైతు పక్షపాత ప్రభుత్వం మాది’... ఇవీ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు. హుజూరాబాద్ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డినా ప్రజలు ఘోరంగా ఓడించారనో, రాష్ట్రంలో బీజేపి పక్కలో బల్లెంలా తయారైందనో తెలియదు కానీ ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో తరచు కోప్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇక ముందు వరి పండించకూడదు, వరి వేస్తే ఉరే లాంటి మాటలు మాట్లాడుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వరి పండిస్తే ఇకముందు ప్రభుత్వం కొనబోదని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల ద్వారా రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. కోర్టు ఇలా రైతులపైన, విత్తన వ్యాపారులపైన ఒత్తిడి తెచ్చే వీలులేదని స్పష్టం చేయడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. వరి పండించకూడదంటే  మరి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కాళేశ్వరం లాంటి పెద్దపెద్ద ప్రాజెక్టులు ఎవరికి లబ్ధి కోసం కట్టినట్లు? ఆరుతడి పంటలే పండించడానికైతే భారీ సాగునీటి ప్రాజెక్టులెందుకు? వరికి అనుకూలమైన భూముల్లో ఉన్నపళంగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలంటే  ఎలా? అంతేగాక కోతుల బెడద ఉన్న జిల్లాల్లో వరి తప్ప మిగిలిన ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే రైతులు వాటిని ఎలా కాపాడుకుంటారు? భూసార పరీక్షలు చేయించకుండా, ఏ భూమిలో ఏ పంట పండుతుందో, ఆ పంటను ఎలా పండించాలో రైతన్నలకు సరైన శిక్షణనివ్వకుండా ఇలా నిర్బంధంగా పంట మార్పిడి చేయాలనడం ఏమిటి? ఇప్పటి దాకా వరి పండించిన భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయటం వల్ల పంట నష్టం వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందా? అని రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 


కేంద్రప్రభుత్వం దేశమంతా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మన రాష్ట్రంలో అమలు చేసినా బాగుండేదని, ఒకవేళ పంట నష్టపోతే పరిహారమైనా అందేదని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న రైతులు సైతం ఖండిస్తున్నారు. వారు ఇప్పటికే కొన్నిచోట్ల వరి నాట్లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాగే సన్నవడ్లు మాత్రమే పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్బంధ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తే రైతులు ప్రభుత్వాన్ని నమ్మి వాటినే పండించారు. కానీ చివరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అంతేకాకుండా నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో బెల్లం తయారు చేయవద్దని, మక్కలు కూడా పండించవద్దని రైతులను ఆదేశించిన విషయాన్ని రైతన్నలు గుర్తుచేస్తున్నారు. ఇలా ప్రతిసారి ఫలానా పంట పండించకండి, ఫలానా పంటనే పండించండి అంటూ రాష్ట్రప్రభుత్వం పూటకో మాట చెబితే ఎలా అని వాపోతున్నారు. యాసంగిలో వరి పండిస్తే నూక ఎక్కువగా ఉంటుందని, దీంతో పారా బాయిల్డ్ రైస్ తప్పనిసరి అవుతుందని ముఖ్యమంత్రి అనడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో పండించే గంగా కావేరీతో పాటు తెలంగాణ సోనా (షుగర్‌లెస్ రైస్) లాంటి రకాలు యాసంగిలో కూడా రా రైస్‌కు ఉపయోగకరంగా ఉండే అవకాశముందని, నూక తక్కువగా వచ్చే అవకాశముంటుందని, ఇలాంటి పంట రకాలకు ముందస్తుగా సన్నద్ధం చేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు.  


రాష్ట్రప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించకుండా రాత్రిపూట వచ్చిన ఆలోచనలను తెల్లారి నుంచే అమలు చేయాలనుకోవడం ఏమిటని రైతులు విస్తుపోతున్నారు. టీఆర్‌ఎస్ కంటే ముందు నుంచి పండిస్తున్న పంటలను ఇప్పుడు ఆపేయమనడం, కేంద్రప్రభుత్వం కొనడంలేదు కాబట్టి తామూ కొనబోమనడం రాష్ట్రప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది.  దశాబ్దాలుగా రాని వరి సమస్య ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకొచ్చినట్టు? ఎఫ్‌సిఐ పారాబాయిల్డ్ రైస్ కొనబోమనడం ఇప్పుడు చెబుతున్న విషయం కాదు. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని ఎఫ్‌సిఐకి స్పష్టం చేసిన రాష్ట్రప్రభుత్వం, వాస్తవాలు చెప్పకుండా రైతులను పక్కదారి పట్టిస్తోంది. రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్రప్రభుత్వం గానీ, ఎఫ్‌సిఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైసు మిల్లర్లను సిద్ధం చేయాల్సిందిపోయి ఒక దశా దిశా లేకుండా రాష్ట్రప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రప్రభుత్వం ప్రతి క్వింటాలుకు మద్దతు ధర రూ.1960, మిల్లు ఛార్జి రూ.250, రవాణా ఛార్జీ రూ.250, హమాలి, సుతిలీ రూ.60, ఇతర ఖర్చులకు రూ.40 చొప్పున మొత్తం దాదాపుగా రూ.2560 ఇస్తోందని వారు వివరించారు.


రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విధానాలను అనాలోచితంగా తప్పు పడుతున్నారు, అనవసరంగా ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంత ఘర్షణకు కారణమైన బియ్యం కథ ఏంటో చాలామందికి తెలియదు. బియ్యంలో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి రా రైస్ (ముడి బియ్యం), రెండు పారా బాయిల్డ్ లేదా స్టీమ్ రైస్. మొదటి రకమైన రా రైస్‌లో మన శరీరానికి అవసరమైన పోషకాలుంటాయి. ఈ బియ్యంలో చేతులు పెడితే తెల్లటి పౌడర్ లాంటి పదార్థం అంటుతుంది. రైతులు నేరుగా మిల్లులో పట్టించే బియ్యం, రేషన్ షాప్‌లో ఇచ్చే బియ్యం ఈ రకానికి చెందినవని చెప్పవచ్చు. వీటిని కడిగితే తెల్లటి కలి (ద్రవం) వస్తుంది. కానీ వీటికి త్వరగా లక్కపురుగు, తెల్లపురుగు పడుతాయి. ఇవి త్వరగా అమ్ముడుపోకపోతే నష్టపోతామని రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు వీటిని అమ్మడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. ఇక రెండో రకానికి చెందినవే పారా బాయిల్డ్ రైస్. ఇవి ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల నుంచి వీటి అమ్మకం విరివిగా పెరిగింది. అయితే తాము కొనే బియ్యం నిస్సారమైన పారాబాయిల్డ్ రైస్ అనే విషయం చాలామందికి తెలియదు. వీటిని కడిగినప్పుడు కలి (ద్రవం) లేత పసుపు రంగులో వస్తుంది. వీటిలో పోషకాలుండవు. అసంపూర్తిగా జీర్ణం కావడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యతోపాటు పోషకలోపాలు సంభవిస్తాయి. కాబట్టి దేశంలో వీటి వాడకం క్రమంగా తగ్గిపోతోంది. అందుకే ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న పారాబాయిల్డ్ లేదా స్టీమ్ రైస్‌ను కొనబోమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ స్పష్టం చేసింది. అప్పుడు దానికి రాష్ట్ర సర్కారు కూడా సమ్మతించింది. మరి ఇప్పుడిలా అడ్డం తిరగడమేంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైతులు వరిని మాత్రమే పండిస్తారు. తప్ప రా రైస్, పారా బాయిల్డ్ రైస్ అంటూ ప్రత్యేకంగా  పండించరు. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. అదేమిటంటే– రా రైస్ మిల్లులో క్వింటాలుకు  60 నుంచి 65 కిలోలు వస్తే పారాబాయిల్డ్ రైస్ 70 కిలోలకు పైగా వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నది. ఇది మిల్లర్లకు కూడా చాలా కలిసి వచ్చే అంశం కాబట్టి టీఆర్‌ఎస్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ప్రజల ఆరోగ్యం తెబ్బతింటుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ బియ్యాన్ని తొలగించడం లేదు, మిల్లర్లను నివారించడం లేదు. ఈ బియ్యం విషయంలో కేసీఆర్ సర్కార్ ఎందుకు ఇంత పట్టుదలకు పోతోందో ప్రజలకు అర్థం కావడం లేదు. హుజూరాబాద్‌లో ఓటమి నైరాశ్యంతో, అనవసరంగా కేంద్రాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే కేసీఆర్ ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారని రైతులు భావిస్తున్నారు. రాజకీయాల కోసం రైతులను బలి పెట్టడం అన్యాయం.

శ్యామ్ సుందర్ వరయోగి

బీజేపీ రాష్ట్ర నాయకులు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.