
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బ్యాంకు రుణాలు తీసుకుని, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బలమైన ప్రభుత్వం’ ఇటువంటి అవినీతిపై ‘పటిష్ట చర్యలు’ తీసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. శుక్రవారం ఆయన ఇచ్చిన ట్వీట్లో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలతోపాటు రుషి అగర్వాల్ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించారు.
పరారైన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా రూ.9,000 కోట్లు, నీరవ్ మోదీ రూ.14,000 కోట్లు మోసం చేశారు. తాజాగా ABG షిప్‌యార్డు కంపెనీ మాజీ చైర్మన్ రుషి అగర్వాల్ భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.23,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, బలమైన ప్రభుత్వం ఇటువంటి అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రుణగ్రస్థ భారత దేశంలో రోజుకు 14 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని, అటువంటి సమయంలో ఈ అవినీతిపరులు సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవిస్తున్నారని వరుణ్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తన సొంత పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని గతంలో ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండలో నిందితుడైన ఆశిష్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే ఆశిష్ మిశ్రా అనే సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి