లఖింపూర్‌ ఘటనను హిందూ వర్సెస్ సిక్కుగా మార్చే యత్నాలు : వరుణ్ గాంధీ

ABN , First Publish Date - 2021-10-10T19:53:13+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సంఘటన

లఖింపూర్‌ ఘటనను హిందూ వర్సెస్ సిక్కుగా మార్చే యత్నాలు : వరుణ్ గాంధీ

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సంఘటన నేపథ్యంలో హిందువులు, సిక్కుల మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఓ ట్వీట్‌ ద్వారా హెచ్చరించారు. ఇది అనైతికం, తప్పుడు ప్రచారం మాత్రమే కాకుండా, ఇటువంటి విభజన రేఖలను సృష్టించడం ప్రమాదకరమని చెప్పారు. గాయాలు నయమవడానికి ఓ తరం పట్టిందని, ఆ గాయాలను తిరిగి రేపినట్లవుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాల కన్నా చిల్లర రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయకూడదన్నారు. 


లఖింపూర్ ఘటనపై వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, నిరసనకారులపైకి కారు దూసుకెళ్లిన వీడియో చాలా స్పష్టంగా ఉందన్నారు. నిరసనకారుల గళాన్ని హత్య ద్వారా నొక్కకూడదన్నారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీతనం ఉండాలన్నారు. ప్రతి రైతు మనసులోకి అహంకారం, క్రూరత్వంతో కూడిన సందేశం ప్రవేశించడానికి ముందే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 


లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాత్మక సంఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు సిక్కులు ఉన్నారు. బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర సింగ్ సిక్కులకు గుర్ముఖి లిపిలో ఓ లేఖ రాశారు. ఈ సంఘటన అనంతరం సంయమనం పాటించినందుకు సిక్కులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘటనను ప్రభుత్వం, ప్రజలు సహా అందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని సామాన్య ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు సంయమనం పాటించాలని కోరారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో సహకరిస్తూ సంయమనం పాటిస్తున్న సిక్కు సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-10-10T19:53:13+05:30 IST