పత్తికి వరుణుడి గండం

ABN , First Publish Date - 2022-08-09T05:26:16+05:30 IST

పత్తికి వరుణుడి గండం

పత్తికి వరుణుడి గండం
దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల చెరువు మత్తడి నీటి ప్రవాహానికి మునిగిన వరి పొలాలు, మరిపెడ మండలం బుర్హాన్‌పురంలో ఎస్సారెస్పీ కాలువకు గండిపడి పత్తి చేలలో చేరిన నీరు

ఎడతెరిపి లేని వానలతో నీట మునుగుతున్న పంటలు

గాలికి అడ్డం తిరుగుతున్న పత్తి మొక్కలు   

ఒరిగిపోతున్న మిర్చి నారు 

ఊట బట్టిన చేలతో రైతుల ఉక్కిరి.. బిక్కిరి


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఆగస్టు 8 : జిల్లాలోని పత్తి, మిర్చికి వరణుడి గండం వచ్చింది. వరుసగా రోజు కురుస్తున్న ఎడతెగని వర్షాలతో పత్తి, మిర్చి, వరి రైతులు ఉక్కిరి.. బిక్కిరి అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వేసిన పత్తి పంటల్లో నీరు నిలిచి ఊటలు పడుతున్నాయి. మొక్కలు ఎర్రబడుతున్నాయి. నర్సింహులపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి బలమైన గాలులు వీచడంతో పత్తి మొక్కలు అడ్డంగా పడిపోయాయి. మరోవైపు కొన్ని మండలాల్లో రోజు కురుస్తున్న వర్షాలతో మిర్చి నారు కుళ్లిపోతోంది. వరదలకు వరి పొలాలు నీట మునిగిపోతున్నాయి. దీంతో రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు.


పత్తి చేలలో...

జిల్లాలో పత్తి 97,561 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, ఈ ఖరీఫ్‌లో 100994 ఎకరాలలో సాగు చేశారు. ఆలస్యంగా వర్షాలు మొదలయ్యాయి. పత్తి విత్తనాలు వేసిన తర్వాత భారీ వర్షాలు కురియడంతో పలు మండలాల్లో పత్తి గింజలు మొలకెత్తకుండానే పోయాయి. మొక్క లు జొన్నలు కూడా మొలకెత్తలేదు. దీంతో ముందుగానే కొంతమేర నష్టపోయిన రైతులు మళ్లీ పత్తిని సాగు చేశారు. జూలై నెలలో ఏనాడు లేని విధంగా తుఫాన్‌లు రావడంతో దాదాపు రోజు వర్షాలే కురుస్తున్నాయి. చిన్నపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో భూములు, చెలకలు, పంటపొలాలు ఊటలు పడుతున్నాయి. ఎండలు కొడితే కొద్దిమేర మొక్కలకు బలం చేకూరే అవకాశం ఉండగా రోజు వర్షం కురుస్తుండడంతో మొక్కలు బలహీన పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలలో నీరు నిలిచుండిపోయి జాలువారి పడి మొక్కలు ఎర్రబారు తున్నాయి. అయితే కొంచెం ఎత్తుభూముల్లో వేసిన పత్తి చేలు మంచిగా ఏపుగా పెరుగుతు న్నాయి. ఈ అధిక వర్షాలతో జిల్లాలో 20 నుంచి 30 శాతం వరకు పత్తి చేలకు నష్టం వాటిల్లినట్లు రైతులు    చెబుతున్నారు. 


కుళ్లిపోయిన మిర్చినారు...

జిల్లాలో మిర్చి ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 55 వేల ఎకరాల్లో సాగు చేస్తారని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ఎకరం కూడ మిర్చి వేసిన దాఖలాలు లేవు. నెలరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో మిర్చినారు వేసుకోవడంతో ఆ మడుల్లో నీరు నిలిచి నారు కుళ్లిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజు కురుస్తున్న వర్షాలతో మొక్కలు తడిచిపోయి కుళ్లిపోతున్నాయి. అదే బావి నీరుతో ఐదు నుంచి ఆరు రోజులకు ఒకసారి నారు నీరు పెడితే నారు కూడా బలంగా తయారయ్యేదని రైతులు చెబుతున్నారు. వచ్చే నెల 20 వరకు మిర్చి తోటలు వేసుకునే అవకాశం ఉన్నా 30 నుంచి 40 శాతం వరకు నారు కుళ్లిపోయిందని చెబుతున్నారు. మళ్లీ కొత్తగా నారు పోసు కోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల ఒక్కొక్క రైతుకు రూ.15వేల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 


నీట మునుగుతున్న వరి పొలాలు..

వర్షాల కారణంగా వరి పొలాల్లోకి వరదలు ప్రవహించడంతో వరి నారుమడులు కొంతమేర కొట్టుకుపోగా మరికొంత మేర మురిగిపోతోంది. తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, నెల్లికుదురుతో పాటు ఇతర మండలాల్లో ఇటీవల వరదలతో వరి పొలాల్లోకి నీరు చేరి దెబ్బతిన్నాయి. 


కలుపుతీసేదెప్పుడు...

రోజు భారీ వర్షాలు కురుస్తుండడంతో గెరుబు ఇవ్వకుండ వర్షాలు పడుతుండడంతో చేలలో నీరు నిలిచి బురదమయంగా మారుతున్నాయి. కలుపుతీయకుండ ఉంటున్నాయి. రెండు, మూడ్రోజులు వర్షాలు నిలిచి ఎండలు కొడితే తప్పా చేలలో కలుపు తీయడం కుదరదు. కలుపు గడ్డి పెరుగుతుండడంతో రైతులకు ఖర్చు కూడా పెరగనుంది. కలుపు తీసేందుకు ఒక్కొక్క కూలీకి రూ.350 చొప్పున చెల్లించి కలుపు తీయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షాలు, కలుపు కారణంగా పత్తి, ఇతర పంటలకు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.


జిల్లాలో 873.4 మి.మీ. వర్షపాతం..

జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు 8 తేదీ వరకు 457.0 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం పడాల్సి ఉండగా 873.4 మిల్లిమీటర్ల వర్షం పడింది. 91 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గూడూరులో 540.1 మిల్లిమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 1105.2 మిల్లిమీటర్ల వర్షం అత్యధికంగా పడింది. కొత్తగూడలో 566.1కు గాను 1018.8, నెల్లికుదురులో 490.6కు గాను 930.5, మరిపెడలో 357.3కు గాను 901.0 మిల్లిమీటర్ల వర్షపాతంతో జిల్లాలో అత్యధికంగా నిలిచాయి. మిగతా మండలాల్లో వెయ్యి మిల్లిమీటర్లలోపే పడింది. ఒక్క జూలై నెలలోనే 244.4 సాధారణ వర్షపాతం పడాల్సి ఉండగా, 539.9 మిల్లిమీటర్ల వర్షపాతం 121 శాతం వర్షం పెరిగింది. 


ఎకరం పత్తి నష్టపోయా... : బూర్గుల సోమయ్య, రైతు, బొజ్జన్నపేట (నర్సింహులపేట) 

 ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరం పత్తి సాగు చేశాను. పత్తి వేసిన దగ్గర్నుంచి ఒకటే వాన పడు తోంది. కాస్తంతా విరామం కూడా ఇవ్వడం లేదు. రోజు కురుస్తున్న వర్షాలతో పత్తి చేల్లో నీరు నిలిచి మొక్కలు జాలువారిపోతున్నాయి. ఇప్పటి వరకు పత్తి చేనుపై రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టా. నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. 

Updated Date - 2022-08-09T05:26:16+05:30 IST