Advertisement

‘వేణు’వై వచ్చావు భువనానికీ...

Nov 21 2020 @ 00:29AM

సీనియర్‌ జర్నలిస్టు, పుస్తకప్రియుడు వాసిరెడ్డి వేణుగోపాల్‌ ఎంతో విలక్షణమైన వ్యక్తి. ఈ నెల 7వ తేదీన ఈ లోకాన్ని వీడిన వేణుగోపాల్‌ తన అరవై ఏళ్ల జీవితంలో మనకి నాలుగు దశల్లో ఆవిష్కృతమవుతారు. బాల్యం, విద్యార్థి ఉద్యమాలతో పరిచయం అయ్యేదాకా ఒక దశ. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై, దానిని నరనరానికీ ఎక్కించుకున్న అధ్యయనశీలత్వం రెండో దశ. ఇది ఆయన జీవితంలో ఉచ్ఛదశ. ఈ దశే లేకపోతే ఆయన ఒక ‘అల్పజీవి’గా మిగిలిపోయిఉండేవారు. ఇలా తనపై, తన వర్క్‌పై ఒక నివాళి పుస్తకం ప్రచురించే స్థాయికి అర్హుడయ్యేవాడు కాదు. మూడవది, ఒక నిఖార్సయిన జర్నలిస్టుగా గొప్ప వ్యాసాల్ని, సంపాదకీయాల్ని రాయడానికి ఉపకరించిన దశ. ఈ దశలో ఆయన చిన్న పత్రికా, పెద్ద పత్రికా, సోషల్‌ మీడియానా అనే తేడా లేకుండా రాసుకుంటూపోయారు. ఇక నాలుగో దశలో ఫేస్‌బుక్‌ను అనువైన టూల్‌గా ఎంచుకున్నారు.


సొంత పబ్లిషింగ్‌ వ్యవస్థను ఏర్పరచుకున్నారు. కొన్ని విలువైన పుస్తకాల్ని తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. వీటిలో ఆయన రాసినవి మూడే. బంగారం, వాసిరెడ్డి హనుమంతరావు జీవితచరిత్ర, ఆంధ్రభూమిలో తాను రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు. కానీ, పలువురు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తూ వారు రాసిన పుస్తకాలను వేణు తన పబ్లికేషన్స్‌ నుంచి ప్రచురించారు. ఇదే సమయంలో ఇంకో భిన్నమైన పార్శ్వాన్ని కూడా ఆయన ప్రదర్శించారు. అదే ‘రోటిపచ్చళ్ల ఉద్యమం’. రోటిపచ్చళ్ల వల్ల ఆరోగ్యానికి కలిగే మంచిని జనం ముందుకు తీసుకువచ్చి, లక్షన్నరమందితో ఒక ఫేస్‌బుక్‌ గ్రూపును నడిపారు. వేణు జర్నలిజంలోకి అడుగుపెట్టిన తొలిరోజుల నుంచే పలు దినపత్రికల్లో విలువైన వ్యాసాలు రాశారు. ఎకానమీ మీద ఆయనది అసామాన్యమైన పట్టు. ఆర్థికశాస్త్ర మూలాల్ని అటు పశ్చిమ దేశాలతో పోల్చడం సరికాదంటూనే ఇంకోవైపు మార్క్సిస్టు తరహా పంథాలు భారతదేశానికి అవసరమని చెప్పిన మనిషి. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ఆయనతో కలిసి 40, 50 ఏళ్ల పాటు ప్రయాణించిన బంధుమిత్రులు రాసిన పుస్తకం వేణుని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 


(రేపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట టౌన్‌హాల్‌లో, సీనియర్ జర్నలిస్టు వాసిరెడ్డి వేణుగోపాల్‌ సంతాపసభ, పుస్తకావిష్కరణ)


సురేశ్‌ వెలుగూరి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.