వ్యాట్‌.. ఈజ్‌ దిస్‌

ABN , First Publish Date - 2021-11-08T05:26:58+05:30 IST

వ్యాట్‌.. ఈజ్‌ దిస్‌

వ్యాట్‌.. ఈజ్‌ దిస్‌

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలంటున్న రవాణా రంగం

ఇతర రాష్ట్రాల్లో తగ్గింపు.. మన పరిస్థితి ఏంటని ప్రశ్న

జిల్లా రవాణా రంగం నుంచి తెరపైకి కొత్త ప్రతిపాదనలు 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చే యాలని లారీ ఓనర్ల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌, ఇతర పన్నులను తగ్గించాలని జిల్లా రవాణా రంగం డిమాండ్‌ చేస్తోంది. ఆకాశాన్నంటుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో రవాణా, రవాణాయేతర రంగాలు విలవిల్లాడుతున్న దశలో ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఊరటనివ్వకపోవటం వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం వ్యాట్‌నైనా తగ్గిస్తుందేమోనని అంతా ఆశగా చూస్తున్నారు. పొరుగు రాష్ర్టాల్లో  పన్నులు తగ్గిస్తున్నారని మనకూ అమలు చేయాలని కోరుతున్నారు. 

కరోనాతో మారిన పరిస్థితులు

కరోనా మొదటి దశ నుంచి రెండో దశ పూర్తి చేసుకున్న ఏడాదిన్నర కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు సగటున రూ.30పైనే పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగా, ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డీజిల్‌పై రూ.11, పెట్రోల్‌పై రూ.6 తగ్గాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని లారీ ఓనర్లు కోరుతున్నారు. ప్రస్తుతం రవాణా రంగానికి డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోంది. రవాణాయేతర రంగానికి పెట్రోల్‌పై 33 శాతం మేర వ్యాట్‌ ఉంటోంది. పొరుగు రాష్ర్టాల కంటే మన దగ్గరే అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో జాతీయ పర్మిట్‌ లారీలన్నీ జిల్లా సరిహద్దు దాటాకే డీజిల్‌ నింపుకొంటున్నాయి. వ్యాట్‌ ను పెంచినప్పటికీ డీజిల్‌ వినియోగం మన దగ్గర తగ్గటం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావట్లేదు. ఈ ఆదాయాన్ని పొరుగు రాష్ర్టాలు పొందుతున్నాయి. ఈ లెక్కన చూస్తే వ్యాట్‌ను పెంచినా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావటం లేదన్నది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను 22.25 శాతం నుంచి 17 శాతానికి, పెట్రోల్‌పై విధిస్తున్న 33 శాతం వ్యాట్‌ను 28 శాతానికి తగ్గించాలని రవాణా రంగం కోరుతోంది. అలాగే, డీజిల్‌పై విధిస్తున్న అడిషనల్‌ ట్యాక్స్‌ (అదనపు పన్ను)ను రూ.4 నుంచి రూ.2కు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-11-08T05:26:58+05:30 IST