వీడని గ్రహణం

ABN , First Publish Date - 2020-12-01T03:52:59+05:30 IST

వీడని గ్రహణం

వీడని గ్రహణం
ఆమనగల్లులో అసంపూర్తిగా నిలిచిన కళాశాల భవన నిర్మాణం

19 ఏళ్లుగా సొంతభవన నిర్మాణానికి నోచని జూనియర్‌ కాలేజీ

స్థలమున్నా ముందుకు సాగని నిర్మాణపనులు

ఆమనగల్లు  : ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. భవన నిర్మాణం విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయలోపం భవన నిర్మాణానికి ఆటకంగా మారింది. ఆమనగల్లు పట్టణానికి 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జూనియర్‌ కళాశాలను మంజూరు చేసింది. సొంత భవనం లేని కళాశాలను పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్‌లో కొనసాగిస్తున్నారు. పాఠశాలలో సరైన గదులు, వసతులు లేక విద్యార్థులు ఏళ్లకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. భవనం లేక విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

స్థల వివాదం

ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సొంత భవన నిర్మాణానికి 18 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కిష్టారెడ్డి దాతల సహకారంతో పట్టణ సమీపంలోని మాడ్గుల రోడ్డులో 9.15 ఎకాల భూమిని కొనుగోలు చేశారు. ఆభూమిని గవర్నర్‌ పేరిట రిజిష్ట్రేషన్‌ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో ప్రభుత్వం 2006లో కళాశాల భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న దివంగత సూదిని జైపాల్‌రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కొన్ని రోజులకే కళాశాల భవనం నిర్మిస్తున్న స్థలంపై తమకు హక్కులున్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత భూమి వివాద పరిష్కారానికి నేతలు, అధికారులు సరైన చొరవ చూపలేదు. మరో చోట భవన నిర్మాణానికి స్థలం కేటాయించనూ లేదు.

స్థలం స్వాధీనమైనా ప్రారంభం కాని పనులు

స్థల వివాద పరిష్కారం, భవన నిర్మాణం గురించి స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ గతంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి జమీల్‌ అహ్మద్‌ చొరవ తీసుకొని 5 నెలల క్రితం స్థలాన్ని స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్షింగ్‌  ఏర్పాటు చేశారు. కాగా నేటికి భవన నిర్మాణం పనులు ప్రారంభించలేదు. భవన నిర్మాణం గురించి పలుమార్లు విద్యార్థి సంఘాల, స్థానిక రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా, ఆందోళనలు , దీక్షలు చేపట్టినా ఫలితం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా భవన నిర్మాణం చేపట్టి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.


విద్యారంగంలో వెనుకబాటు

విద్యారంగంలో ఆమనగల్లు పూర్తిగా వెనుకబాటుకు గురైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా విద్యాసంస్థల్లో మౌలికవసతులు లేక, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు భవనం నిర్మించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ఆదిశగా ప్రజాప్రతినిదులు, అధికారులు చొరవ తీసుకోవాలి.

 - సురేశ్‌నాయక్‌, ఎన్‌ఎ్‌సయూఐ మండల అధ్యక్షుడు, ఆమనగల్లు 


వచ్చే ఏడాది భవన నిర్మాణం

ఆమనగల్లులో కళాశాల భవన నిర్మాణానికి ప్ర తిపాదనలు రూపొందించాం. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చొరవతో భూవివాదం పరిష్కారమైం ది. స్థలంచుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కొవిడ్‌ -19 కారణంగా భవన నిర్మాణంలో జాప్యం జరిగింది. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇం టర్‌ బోర్డు కార్యదర్శి అహ్మద్‌ దృష్టికి భవన నిర్మాణం గురించి తీసుకుపోగా వచ్చే ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు.

- అనురాధ పత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు 

Updated Date - 2020-12-01T03:52:59+05:30 IST