వీడని వాన

ABN , First Publish Date - 2022-08-10T06:26:40+05:30 IST

పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురవగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. తాజా వర్షాలకు ఏజెన్సీలోని గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

వీడని వాన
వర్షానికి కొట్టుకుపోయిన జి.మాడుగుల మండలం బొయితిలి - చీకుపనస మధ్య వంతెన

- ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షాలు

- వర్షానికి కొట్టుకుపోయిన జి.మాడుగుల మండలంలోని వంతెన

- 10 గ్రామాల ప్రజల రాకపోకలకు ఆటంకం

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మన్యాన్ని వర్షాలు వదలడం లేదు. ఏజెన్సీ అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఈదురుగాలులు సైతం భారీగా వీస్తున్నాయి. మంగళవారం పాడేరుతో సహా ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. 

పాడేరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురవగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. తాజా వర్షాలకు ఏజెన్సీలోని గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ తీరం ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గిరిజనులు గెడ్డలు దాటలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. భారీ ఈదురుగాలులకు తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా వాతావరణం మాత్రం జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంది.  

జి.మాడుగులలో..

జి.మాడుగుల: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వంతెనలకు గండిపడి రవాణాకు అంతరాయం ఏర్పడింది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షానికి బొయితిలి - చీకుపనస గ్రామాల మధ్య ప్రధాన రహదారిలోని వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. కాగా కుంబిడిసింగి రహదారిలో సంఘం గ్రామం వద్ద కల్వర్టుకు గండిపడింది. మారుమూల కిల్లంకోట, కోడిమామిడి, బొర్రాతాడి, సంగులోయ, రాళ్లగెడ్డ ప్రాంతాల వాగులు పొంగి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న పలు రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చీకుపనస వంతెన కొట్టుకుపోవడం వల్ల సుమారు 10 పంచాయతీల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే చీకుపనస రహదారి నిర్మాణ దశలో ఉండగా గత వర్షాలకు గండిపడడంతో తాత్కలిక వంతెన నిర్మించారు. ప్రస్తుత వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంత ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. కిల్లంకోట, కోడిమామిడి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటపొలాలు వరద నీటితో నిండిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. పొలాలు నీటమునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీకేవీధి, చింతపల్లిలో కుండపోత

చింతపల్లి/గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆదివాసీ దినోత్సవం, వారపు సంతలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతుగెడ్డ వారపు సంత వద్ద వినియోగదారులు, వర్తకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా రహదారులు వాగులను తలపించాయి. 

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు:  మండలంలో కొద్ది రోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. లక్ష్మీపురం, బూసిపుట్టు, రంగబయలు, బరడ, బుంగాపుట్టు, బంగారుమెట్ట తదితర పంచాయతీల్లో పలు గ్రామాల్లో  మత్స్యగెడ్డ పాయలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 



Updated Date - 2022-08-10T06:26:40+05:30 IST