ముంచేసిన వాన

ABN , First Publish Date - 2021-10-18T04:53:21+05:30 IST

కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు కూరగాయల

ముంచేసిన వాన
చేవెళ్లలో వర్షాలకు పాడైన టమాట పంట

  • భారీ వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటలు
  • వరదనీటిలో మునిగిన టమాట పంట
  • పొలంలోనే కుళ్లిపోతున్న వైనం
  • నష్టాలతో బోరుమంటున్న రైతులు


కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు కూరగాయల రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు వరదనీటిలో మునిగి దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా టమాట పంటను వరదనీరు ముంచెత్తడంతో పూర్తిగా దెబ్బతింటుంది. పొలాల్లోనే టమాటలు కుళ్లిపోతుండటంతో రైతులు బోరుమంటున్నారు.


చేవెళ్ల : ఆరుగాలం కష్టంచి పండించి పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలకు దెబ్బతినడంతో రైతులు బోరుమంటున్నారు. చేవెళ్ల డివిజన్‌లో 15రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కూరగాయ పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. టమాట, క్యారెట్‌, వంగ తోటలతోపాటు ఆకుకూరలు సైతం వర్షాలకు పాడయ్యాయని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్‌ నగరానికి చేరువులో ఉన్న చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ తదితర మండలాల్లోని రైతులు పెద్దఎత్తున కూరగాయ పంటలను సాగు చేస్తుంటారు. చేవెళ్ల మండలంలోనే ఈ ఏడాది 1,400 ఎకరాల్లో టమాట, 600 ఎకరాల్లో క్యారెట్‌ పంటలను సాగు చేశారు. అలాగే షాబాద్‌ మండలంలో 700 ఎకరాల్లో టమాట, శంకర్‌పల్లి మండలంలో 500ఎకరాల్లో టమాట, మొయినాబాద్‌ మండలంలో 300 ఎకరాల్లో టమాట పంట సాగైందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 


భారీ వర్షాలకు దెబ్బతింటున్న టమాట

కష్టపడి పండించిన టమాట పంట చేతికి వచ్చే సమయంలో వర్షార్పణం అవుతుందని రైతులు వాపోతున్నారు. పొలంలోకి వరద నీరు చేరి టమాటలు పూర్తిగా కుళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదికంటే ఈ ఏడాది టమాట పంటను రైతులు అధికంగా సాగు చేశారు. మంచి లాభాలు వస్తాయని పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి టమాట పంటను పండించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీటిలో టమాట పంట కొట్టుకుపోవడం, పొలంలోనే కుళ్లిపోతుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కుళ్లిన టమాటను రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. కొద్దిరోజులుగా మార్కెట్‌లో టమాటకు ధరలు పెరుగుతున్నాయి. కానీ వర్షాలకు టమాట పంట దెబ్బతినడంతో మార్కెట్‌కు టమాటాలు రావడం లేదు. దీంతో టమాటకు ధరతోపాటు డిమాండ్‌ కూడా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎకరా టమాట సాగుకు రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు వచ్చిందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాల వలన టమాట పంటకు నష్టం వాటిల్లి రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేదు.


మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌

చేవెళ్ల డివిజన్‌పరిధిలోని రైతులు హైదరాబాద్‌ నగరంలోని గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి, మూసాపేట్‌ తదితర వ్యవసాయ మార్కెట్‌ యార్డులతోపాటు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌కు టమాటలను ప్రతి నిత్యం పెద్ద మొత్తంలో తరలిస్తుంటారు. అయితే చేవెళ్ల మార్కెట్‌ యార్డుకు ప్రస్తుతం 500 నుంచి వేయి వరకు టమాట బాక్స్‌లను రైతులు వివిధ గ్రామాల నుంచి విక్రయించేందుకు తెస్తున్నారు. అయితే మార్కెట్‌లో 25 కిలోల టమాట బాక్స్‌ రూ. 500 నుంచి రూ.800 వరకు అమ్ముడు పోతున్నాయని రైతులు చెబుతున్నారు. రైతుల నుంచి కిలో టమాట రూ.30  లోపు తీసుకుని బహిరంగ మార్కెట్‌లో దళారులు మాత్రం కిలో టమాటను రూ. 50 నుంచి రూ.60  వరకు అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ఎలాంటి లాభం లేకపోగా నష్టమే అధికంగా వస్తుందని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. 


వర్షాలతో టమాట పంటకు దెబ్బ

విస్తరంగా కురుస్తున్న వర్షాలకు టమాటలు పొలంలోనే దెబ్బతింటున్నాయి. పొలంలోనే కుళ్లిపోతున్నాయి. రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. చేతికొచ్చే సమయంలో భారీగా వర్షాలు కురువడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. చాలా గ్రామాల్లో కూరగాయల రైతులకు నష్టం వచ్చింది. మార్కెట్‌లో టమాటలకు డిమాండ్‌ ఉంది. కానీ సరిపడా టమాటలు పొలాల్లో లేవు. వర్షానికి పాడైన టమాటలు ఎవరూ కొనడం లేదు. 

- ఖాదర్‌ ఖాన్‌, టమాట రైతు, ఆలూర్‌ 



Updated Date - 2021-10-18T04:53:21+05:30 IST