ధరల మోత..!

ABN , First Publish Date - 2022-05-22T06:26:47+05:30 IST

అదీ ఇదీ అని కాదు.. నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి.

ధరల మోత..!

నిప్పులా.. ఉప్పూపప్పు

చుక్కలు చూపుతున్న గ్యాస్‌, పెట్రోల్‌

మిర్చి ఘాటు.. చింతపండు పోటు

కొనలేని స్థాయిలో కూరగాయలు

సామాన్యుడి జీవనం కకావికలం


ధరల పెంపు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యావసర సరుకుల ధరల మోత మోగుతోంది. సామాన్యుడు బతికే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. అసలే కరోనా కాలంలో లాక్‌డౌనతో అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితి కకావికలం కాగా ధరల పెరుగుదల గోరు చుట్టు మీద రోకలిపోటులా తయారైంది. ఏ వస్తువులు చూసినా భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు కొంతమేర అదుపులోనే ఉన్న ధరలు తర్వాత వ్యాపారుల మాయాజాలంతో చుక్కలనంటాయి. వీటికి తోడు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఇతర వస్తువులు సైతం తారస్థాయికి చేరడంతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. రోజు రోజుకు ధరలు అమాంతం పెరగడం తప్పా ఎక్కడా తగ్గించిన దాఖలాలు కనిపించడంలేదు. ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ప్రజలు నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట స్థితిలో విద్యుత చార్జీలను సైతం పెంచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ధరలను అదుపు చేసి ప్రజలకు అండగా నిలవాల్సిన పాలకులు తమకేమి పట్టనట్టు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ధర్మవరం 


అదీ ఇదీ అని కాదు.. నిత్యావసర  సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం  మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతున్న తరుణంలో సరుకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఇటీవలి కాలంలో రెండింతలైంది. వంట నూనెల దగ్గర నుంచి సబ్బుల వరకూ మనం రోజూవారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చుంది. ఇవి వేగంగా పెరగడమే కాదు, మునుపెన్నడూ చూడని స్థాయికి చేరిపోతున్నాయి. భరించలేని స్థాయికి చేరడంతో ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతో పాటు, పొదుపునూ తగ్గించాల్సి వస్తోంది.


సామాన్యుడిపై గ్యాస్‌ బండ

గ్యాస్‌ సిలిండర్‌ ధర వంటింటిలో చిచ్చుపెడుతోంది. రోజురోజుకు పెరుగుతూ సామాన్యుడికి మోయలేని భారంగా మారింది. ఐదునెలల క్రితం  గ్యాస్‌ ధర రూ.1,016 ఉండగా ప్రస్తుతం రూ.1,066 ధర చేరుకుని పట్టపగలే  చుక్కలు చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటు సిలిండర్‌ ధర పెంచుతూ అటు గ్యాస్‌ సబ్సిడీపై కోత విధిస్తూ సగటు జీవి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఈ భారాన్ని మోయలేక సామాన్య, మధ్యతరగతి విలవిల్లాడుతున్నారు.


రష్యా-ఉక్రెయిన యుద్ధం సాకుతో...

రెండు నెలలుగా రష్యా-ఉక్రెయిన దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి కొందరు వ్యాపారస్థులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. పప్పుదినుసుల ధరలను విపరీతంగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కందిబేడలు, శనగ, పెసరపప్పు తదితర వాటిపై రెట్టింపు ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. మరికొందరు వ్యాపారులు ఇది వరకే సరుకులను నిల్వచేసుకుని ప్రస్తుతం వాటిని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తేవాల్సిన ప్రభుత్వం ఆ వైపు దృష్టి పెట్టినట్లు ఏమాత్రం కనిపించడం లేదు.


కుటుంబ పోషణ భారమవుతోంది

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో కుటుంబ పోషణ భారమవుతోంది. గ్యాస్‌ సిలిండర్‌, వంటనూనెలు ధరలు పెరిగిపోవడంతో భవిష్యత్తును తలచుకుంటే భయమేస్తోంది. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. పరిస్థితిఇలాగే ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలు కుటుంబపోషణ భారమై వీధినపడేప్రమాదం ఉంది.

నాగూర్‌ బీ, గృహిణి


వాహనాలు నడిపే పరిస్థితి లేదు

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో వాహనాలు నడిపే పరిస్థితి లేదు. నెల వ్యవధిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఐదారు సార్లు పెంచేశారు. గతంలో పెట్రోల్‌ లీటరు ధర రూ.60 ఉండగా ప్రస్తుతం రూ.122కు చేరుకుంది. ఇలాగైతే వాహనాలను పక్కన పెట్టి తిరిగి సైకిల్‌ను వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

అశోక్‌, వాహనదారుడు

Updated Date - 2022-05-22T06:26:47+05:30 IST