కొనలేం.. తినలేం..

ABN , First Publish Date - 2021-06-23T06:42:57+05:30 IST

సామాన్యులతోపాటు మధ్యతరగతి వర్గాలు కూరగాయలు కొనే పరిస్థితులు కనిపించడంలేదు.

కొనలేం.. తినలేం..

 భారీగా పెరిగిన ధరలతో ప్రజల బెంబేలు
 పచ్చిమిర్చికి విపరీతమైన డిమాండ్‌.. కిలో రూ.60
టమోటా కిలో రూ.30, వంకాయలు
రూ.40 పైనే
ఇతర కూరగాయలదీ ఇదే దారి
రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 22 : సామాన్యులతోపాటు మధ్యతరగతి వర్గాలు కూరగాయలు కొనే పరిస్థితులు కనిపించడంలేదు. బహిరంగ మార్కెట్లలో ధరలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుళ్లు, టమోటా.. ఇలా అన్నిటి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలతో పోల్చితే ధరలు కాస్త తక్కువగా ఉండే రాజమహేంద్రవరంలోనే కూరగాయల ధరలకు రెక్కలు రావడం గమనార్హం. ఇక పచ్చిమిర్చి ధర రికార్డు స్థా యిలో కిలో రూ.60కు ఎగబాకింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.10 నుంచి రూ.14కు దొరికే టమోటాలు ఇప్పుడు రూ.30లకు అమ్ముతున్నారు. దొమ్మేరు వంకాయలు కిలో రూ.40 పైమాటే. చిక్కుళ్లు ఏకంగా రూ.80 ధర పలుకుతున్నాయి. లోకల్‌ పంటలు ఇంకా చేతికి రాకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిరావడం వల్లే ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. కొద్దిరోజుల నుంచి భారీగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా రవాణా చార్జీలు తడిసిమోపెడై ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడుతోందని కూడా చెబుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ఽధరల్లో వేగవంతమైన పెరుగుదల నమోదు కావడం సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు, మూడువారాలపాటు ధరలు ఇలాగే కొనసాగవచ్చని, కొన్ని రకాలు మరింత పెరిగే అవ కాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కానీ రైతు బజార్లలో మాత్రం ధరలు కొంతవరకు పరవాలేదు. రాజమహేంద్రవరంలోని రైతుబజార్లలో మంగళవారం ధరలు పరిశీలిస్తే.. టమోటా రూ.18, దొమ్మేరు వంకాయలు రూ.36, ఇతర వంకాయ రకాలు రూ.26, బెండకాయలు రూ.34, పచ్చిమిర్చి రూ.36, బీరకాయలు రూ.30, కాకరకాయలు రూ.32 ధరలకు విక్రయించారు. ఇక చిక్కుళ్లు రూ.80, గోరుచిక్కుళ్లు రూ.42, కంద రూ.32, బీన్స్‌ కాయలు రూ.70, బీన్స్‌ గింజ లు రూ.64, కేప్సికం రూ.48, కేరట్‌ రూ.24, ఆకాకరకాయ రూ.62లు ధర ఉంది. ఒక్క దొండకాయలు మాత్రమే కిలో రూ.18కు అందుబాటులో కనిపిస్తోంది.
లోకల్‌ పంట లేకపోవడంతో...
సీతానగరం, కోరుకొండ, కడియం మండలాలతోపాటు రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు ఎక్కువగా రాజమహేంద్రవరం మార్కెట్లోకి వస్తుంటాయి. ఎండాకాలం కావడంతో లోకల్‌గా కూరగాయల సాగు తగ్గింది. దీంతో దిగుబడులు లేవు. అక్కడక్కడా బోర్లున్నచోట కొంతమేర సాగు చేస్తున్నా అవి మార్కెట్‌ అవసరాలకు సరిపోవడంలేదని చెబుతున్నారు. కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో రవాణా, ఇతర ఖర్చులన్నీ కలిసి ధరల మోత మోగుతోంది. టమోటాలు చిత్తూరు జిల్లా మదనపల్లి ఒక్క ప్రాంతం నుంచే వస్తున్నాయి. అయితే మదనపల్లి టమోటాలు ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ఎక్స్‌పోర్టు అవుతుండడంతో డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరిగినట్టు చెబుతున్నారు. అలాగే బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, వంటి వన్నీ స్థానికంగా సాగు అందుకోకపోవడంతో ధరల్లో పెరుగుదల తప్పడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కూరగాయల ధరలు ఇలా అనూహ్యంగా పెరిగిపోవడం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థికభారంగా మారుతోంది.

 


Updated Date - 2021-06-23T06:42:57+05:30 IST