వాహనాలను తిప్పలేం!

ABN , First Publish Date - 2021-05-27T04:59:59+05:30 IST

‘గత ఏడాది కరోనా సమయంలో సేవలందించాం. విపత్కర సమయంలో కుటుంబాలను వదిలి... బాధితులను ఆస్పత్రులకు తరలించాం. అయినా మాకు ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదు.

వాహనాలను తిప్పలేం!




గత ఏడాది బకాయిలే చెల్లించలేదు

ఇప్పుడు సమకూర్చమంటే ఎలా?

యజమానుల ఆవేదన

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

 ‘గత ఏడాది కరోనా సమయంలో సేవలందించాం. విపత్కర సమయంలో కుటుంబాలను వదిలి... బాధితులను ఆస్పత్రులకు తరలించాం. అయినా మాకు ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు మరోసారి వాహనాలను సమకూర్చమంటున్నారు. ఇది ఎంతవరకూ సమంజసం’..అంటూ ప్రైవేటు వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల బకాయిలు చెల్లిస్తేనే వాహనాలు సమకూర్చుతామని తెగేసి చెబుతున్నారు. గత ఏడాది కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో బాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు... ఆస్పత్రులకు తరలించేందుకు తగినన్ని అంబులెన్స్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో డీఆర్వో పర్యవేక్షణలో ఆర్టీఏలు తమ పరిధిలోని ప్రైవేటు వాహనాలను తహసీల్దారులకు అప్పగించారు. జిల్లావ్యాప్తంగా 120 వాహనాలను కేటాయించారు. రోజుకు వాహనానికి అద్దె రూ.1,500, డ్రైవర్‌ వేతనం రూ.700గా నిర్ణయించారు. కానీ చాలా మండలాల్లో వాహనదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు రెండో వ్యాప్తిలో  భాగంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరోసారి వాహనాలు సమకూర్చాలని అధికారులు ఆదేశించారు. పాత బకాయిలు చెల్లించకుండా వాహనాలు ఎలా సమకూరుస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. 


 పెండింగ్‌లోనే బిల్లులు

గత ఏడాది బిల్లులకు సంబంధించి పాలకొండ డివిజన్‌లో 45 వాహనాలకు రూ.91 లక్షలు చెల్లించాలి. కానీ రూ.60 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.30 లక్షలు బకాయిలు ఉన్నాయి. శ్రీకాకుళం డివిజన్‌లో 40 వాహనాలు వినియోగించారు. రూ.35 లక్షలు పెండింగ్‌లో ఉంది. టెక్కలి డివిజన్‌లో 48 వాహనాలకుగాను రూ.15 లక్షల వరకూ బకాయి ఉంది. ఏడాదిగా వాహనదారులు తహసీల్దారులు, ఆర్టీవోలను కలిసినా నిధుల కొరత ఉందని చెప్పి అరకొరగానే చెల్లించారు. ఇటీవల కలెక్టర్‌ నివాస్‌ను కూడా కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాత బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమపై కరుణచూపాలని వాహనదారులు కోరుతున్నారు. 



Updated Date - 2021-05-27T04:59:59+05:30 IST