ఎక్కడ... ఏం జరిగింది!?

ABN , First Publish Date - 2021-12-23T06:06:13+05:30 IST

బెజవాడలో తీగలాగితే గూడూరు ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాల డొంక కదలడంతో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది.

ఎక్కడ... ఏం జరిగింది!?

వాహనాల వెరిఫికేషన్‌ ఎలా చేశారు!?

వసూళ్లు ఎంత.. తెర వెనుక ఎవరున్నారు?

పలు కోణాల్లో విచారణకు కమిటీ సన్నద్దం

2, 3 రోజుల్లో జిల్లాకు రాక

ఆర్టీఏ అధికారుల్లో తనిఖీల భయం

ఫోన్లలోనే టచ్‌లో ఉన్న దళారులు


బెజవాడలో లాగిన తీగకు తగులుకున్న ఆర్టీఏ అధికారుల్లో వణుకు మొదలైంది. సూళ్లూరుపేటలో ఎంవీఐ గోపీనాయక్‌ సస్పెన్షన్‌తో మొదలైన కొరడా ఇంకెందరిపై ఝుళిపిస్తుందోనని రవాణా శాఖ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన కమిటీ అతి త్వరలో జిల్లాకు చేరుకోనుంది. ఈలోపు ఎక్కడ.. ఏ ఏ పొరపాట్లు జరిగాయో జిల్లా అధికారులు నిశితంగా రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇలా రిజిస్టర్‌ అయిన వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట) డిసెంబరు 22: బెజవాడలో తీగలాగితే గూడూరు ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాల డొంక కదలడంతో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే గూడూరు ఆర్టీవో మల్లికార్జునను రవాణా శాఖ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయడం, సూళ్లూరుపేట ఎంవీఐ గోపీనాయక్‌ను సస్పెండ్‌ చేయడం, ఈ వ్యవహారంపై పూర్తి విచారణకు ఏలూరు డీటీసీతో విచారణ కమిటీ వేయడం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెల్లూరు రవాణా శాఖపై పడింది. ఈ క్రమంలో  జిల్లాలో  రవాణా శాఖ కార్యాలయాలకు ఏ క్షణాన ఎవరొచ్చి తనిఖీలు చేస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆర్టీవో కార్యాలయాల బయట వందల సంఖ్యల్లో ఉండే మధ్యవర్తులు బుధవారం తమ దుకాణాలను మూసివేసి ఫోన్లలో మాత్రమే టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


అతిత్వరలో కమిటీ రాక

రెండు మూడు రోజుల్లోనే విచారణ కమిటీ జిల్లాకు రానునట్లు సమాచారం. గూడూరు ఆర్టీవో కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వాహనాల ఫైళ్లను పరిశీలించనున్నారు. మరోవైపు రిజిస్ర్టేషన్‌ అయిన వాహనాల ఫిట్‌నె్‌సను పరిశీలించకుండానే ఫొటోలు అప్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేశారని ఇలా చేయడానికి ఒక్కో వాహనం నుంచి రూ.25-30 వేల వరకు వసూలు చేశారని ఆర్టీవో కార్యాలయ అధికారులే చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉంటే జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయడం సాధ్యమేనా అన్న కోణంలోనూ విచారణ సాగుతుందని తెలు స్తోంది. 


మధ్యవర్తులే కీలకం..

వాహన రిజిస్ట్రేషన్‌లో మధ్యవర్తులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా దళారుల దందాకు చెక్‌పెట్టామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు మాత్రమే చేస్తారు. ఆఫ్‌లైన్‌లో చేయాల్సిన ప్రక్రియ అంతా దళారులు, అధికారుల మధ్య సాగుతుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో పనులు కావాల్సిన వారు లొసుగులు ఉంటే నేరుగా కార్యాలయాల బయట ఉన్న సర్వీస్‌ సెంటర్లకు వెళ్లి వారి సమస్యను చెప్పుకుంటారు. దీంతో వారు పనిని బట్టి రేట్లు ఫిక్స్‌ చేసి ఆ ప్రకారం అధికారులతో చర్చించి పనులు కానిస్తారు.  


నాయకుల అండ...

ఇతర జిల్లాల నుంచి మన జిల్లా మీదుగా వెళ్లే భారీ లోడ్ల వాహనాలు ఏ సమయానికి జిల్లాకు చేరుకుంటాయి, ఏ సమయానికి బార్డర్‌ దాటుతాయి అన్న వివరాలను జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నేతలు రవాణాశాఖ అధికారులకు నెంబర్లతోపాటు ఇచ్చేస్తుంటారు. ఆ వాహనాలను మాత్రం అధికారులు అసలు టచ్‌ చేయరు. ఇసుక, మట్టి, గ్రావెల్‌ వంటి వాహనాలను సైతం అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తారు. 

 

ఆది నుంచి అంతే!

సూళ్లూరుపేట కేంద్రంగా నకిలీ రిజిస్ర్టేషన్లు

గుర్తించి ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు


నెల్లూరు, డిసెంబరు 22 : రవాణా శాఖలో ఇంటి దొంగలు మరోసారి చేతివాటం ప్రదర్శించారు. భారీ కుంభకోణానికి తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సమాయానికే ఉత్పత్తి అయిన బీఎస్‌-3,  బీఎస్‌-4 వాహనాలను తుక్కు ఇనుముగా ఆ  పరిశ్రమలు అమ్మేస్తుంటాయి. ఇలాంటి వాహనాలను కొందరు పెద్దలు కొనుగోలు చేసి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించి దర్జాగా రహదారులపై నడిపేస్తున్నారు. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలకు రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున చేస్తుండటం అధికారుల దృష్టిలో పడింది. దీంతోపాటు ఈ రిజిస్ట్రేషన్లు గోల్‌మాల్‌పై విజయవాడ ఆంధ్రజ్యోతిలో కథనం సైతం వెలువడింది. దీంతో ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారు. కొన్ని నెలలుగా సూళ్లూరుపేట కార్యాలయంలో ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లుగా గుర్తించారు. వాస్తవంగా ఇక్కడున్న రవాణా శాఖ అధికారి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున కార్యాలయానికి వచ్చి ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయనకు ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, మరో ప్రైవేట్‌ వ్యక్తికి ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఆయా వాహనాల ఫొటోలు సూళ్లూరుపేట కార్యాలయం వద్ద తీసిన ఫోటోలు కావని, అవి మరెక్కడో తీసిన ఫొటోలుగా ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో రెండు రోజుల క్రితం సదరు అధికారిని గూడూరుకు పిలిపించి విచారించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంతో సదరు వాహనాలు రిజిస్ట్రేషన్‌ సమయంలో కార్యాలయానికి వచ్చాయా లేదా!? కనీసం సమీప టోల్‌గేట్ల వద్ద అయినా నమోదు అయ్యిందా అన్న సమాచారాన్ని ఉన్నతాధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇలా రిజిస్టర్‌ అయిన వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయో తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-12-23T06:06:13+05:30 IST