చీరలమ్ముకునే ఈయన జీవితంలో జరిగిన ఈ చిత్రం చూడండి..!

ABN , First Publish Date - 2022-06-25T06:47:35+05:30 IST

ఆయన పట్టు చీరల వ్యాపారి. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో మహిళకు చీరలు చూపించాడు.

చీరలమ్ముకునే ఈయన జీవితంలో జరిగిన ఈ చిత్రం చూడండి..!
మొక్కను చూపుతున్న రమణారెడ్డి

పండు తిని.. రైతుగా మారిన వ్యాపారి

మొదట్లో నష్టం.. 

ఎదురొడ్డి లాభాల బాట

థాయ్‌ నుంచి మొక్కలు 

తెప్పించి.. సాగు

పండ్లు.. మొక్కల

 విక్రయంతో ఆదాయం

అనంతపురం రూరల్‌, జూన 24: ఆయన పట్టు చీరల వ్యాపారి. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో మహిళకు చీరలు చూపించాడు. బేరసారాలు సాగుతుండగా.. ఆమె ఒక పండును కోసుకువచ్చి.. ఆ వ్యాపారి ముందు పెట్టింది. వ్యాపారి అంతకు ముందు ఎన్నడూ ఆ పండును చూసింది లేదు.. తినింది లేదు. ఓ ఒప్పును తిని చూశాక, ‘ఏం పండు మేడమ్‌? ఎక్కడా చూడలేదు. బాగా రుచిగా ఉంది’ అని అడిగాడు. ‘కొత్తపేట మార్కెట్‌లో కొని తీసుకువచ్చా. కిలో రూ.200’ అని చెప్పింది. ‘ఇక్కడ ఎక్కడా ఈ కాయలను పండించరట. అందుకే అంత రేటు’ అని కూడా చెప్పింది.  ఆమెతో సంభాషణ తరువాత చీరల వ్యాపారికి ఆసక్తి కలిగింది. ఆ మహిళ కాయను కొనుగోలు చేసిన మార్కెట్‌కు వెళ్లాడు. పండు గురించి ఆరా తీశాడు. దాని పేరు డ్రాగన ఫ్రూట్‌ అని తెలుసుకున్నాడు. తాను సాగు చేయాలని భావించాడు.  రాప్తాడు మండల పరిధిలోని మర్తాడు వద్ద ఏడెకరాల పొలం కొన్నాడు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి డ్రాగన ఫ్రూట్‌ మొక్కలను కొని తెచ్చి.. సాగు ప్రారంభించాడు. కొత్త పంట..! అందుకే మొదట దెబ్బతిన్నాడు. అయినా పట్టు వీడక.. సాగులో మెలకువలు తెలుసుకుని.. సిరుల పంట పండిస్తున్నాడు. 


విపత్తులకు ఎదురొడ్డి..

అనంతపురం మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్‌ నగర్‌కు చెందిన ఆయన పేరు కేవీ రమణారెడ్డి. మొదట్లో చీరల వ్యాపారం చేసే ఆయన.. ఆ పండు తిన్నాక రైతుగా మారాడు. గార్లదిన్నె మండలం మర్తాడు సమీపంలో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 2017లో తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి డ్రాగన ఫ్రూట్‌ (నాటి రకం) మొక్క ఒకటికి రూ.70 ప్రకారం కొని తెచ్చాడు. మొదట ప్రయోగాత్మకంగా మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ఎండలకు తట్టుకోలేక మొదట్లో మొక్కలు దెబ్బతిన్నాయి.  దీంతో రూ.10 లక్షలు నష్టపోయాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులను తట్టుకుని పెరిగే మొక్కల గురించి ఆరా తీశాడు. 2020లో థాయిలాండ్‌ నుంచి టిష్యు కల్చర్‌ రకం(జైన) అంటు కొనుగోలు చేసి తెప్పించాడు. కొవిడ్‌ సమయం కావడంతో మొక్కను జిల్లాకు తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డారు. మొక్క తన వద్దకు వచ్చేందుకు నెలన్నర పట్టిందని రమణారెడ్డి తెలిపాడు. దీంతోపాటు ఒక్కొక్క మొక్కకు రూ.250 ఖర్చు అయింది.  ఎకరానికి 2 వేల మొక్కలు చొప్పున మూడు ఎకరాలలో సాగు చేశాడు. మొక్కలకు ఆసరాగా స్తంభాలను నాటించాడు. పెట్టుబడి ఎకరానికి రూ.5లక్షల వరకు పెట్టాడు.


ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు

డ్రాగన మొక్కలకు ఆర్గానిక్‌ ఎరువులు వినియోగించాడు. మొదటి ఏడాది ఎక్కువ ఖర్చు వచ్చింది. మరుసటి ఏడాది నుంచి రూ.50 వేలకు మించలేదు. పంటకు నీటి వినియోగం తక్కువ. పదిహేను రోజులకు ఒక తడి సరిపోతుంది. జూన నుంచి ఫిబ్రవరి మధ్య సాగుకు అనుకూలం. మొక్క నాటిన ఎనిమిది నెలలకు కాపు మొదలవుతుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని నిలబడుతుంది. మొదటి ఏడాది నాలుగు టన్నులు దిగుబడి వచ్చిందని, రెండో ఏడాది ఇప్పటి వరకు 5 టన్నుల దిగుబడి వచ్చిందని రమణారెడ్డి తెలిపారు. ఈ ఏడాది నవంబరు వరకు పంట ఉంటుందని, మరో 20 టన్నుల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. 


టన్ను రూ.1.80 లక్షల వరకూ..

డ్రాగన ఫ్రూట్‌ రిటెయిల్‌గా అయితే కిలో రూ.150 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌గా టన్ను రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల మధ్య విక్రయిస్తున్నానని రైతు తెలిపారు. బెంగుళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాలకు కాయలను ఎగుమతి చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి కాయలను కిలోల ప్రకారం కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు. ఒక్కసారి మొక్కను నాటితే 30 ఏళ్లపాటు కాపు కాస్తుంది. ఏటా జూన నుంచి నవంబరు వరకు దిగుబడి వస్తుంది. కాయలు, మొక్కల అమ్మకంతో ఇప్పటి వరకు రూ.38 లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు వెల్లడించారు. 


-  డ్రాగన ఫ్రూట్‌ను విదేశాల్లో మాత్రమే పండించేవారు. మన ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ పంట సాగు ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. చవుడు భూమి మినహా అన్ని రకాల ఇతర భూముల్లో సాగుకు చేయవచ్చు.

- రమణా రెడ్డి, రైతు





Updated Date - 2022-06-25T06:47:35+05:30 IST