వెలిగొండకు గండం

ABN , First Publish Date - 2021-07-17T05:55:50+05:30 IST

జిల్లావాసుల ఆశలపై తాజాగా కేంద్రం ప్రకటించిన గెజిట్‌ నీళ్లు చల్లింది.

వెలిగొండకు గండం
వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం

కేంద్ర గజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టుగా ప్రకటన

విభజన చట్టంలో ప్రాజెక్టుకు రక్షణ

 ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులు, సీమ 

ఎత్తిపోతలతోనే ముప్పుగా ఆందోళన

కేంద్రం తాజా గజిట్‌తో నీటి గార్యంటీపై అయోమయం

తక్షణం సీఎం చొరవ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

జిల్లావాసుల ఆశలపై తాజాగా కేంద్రం ప్రకటించిన గెజిట్‌ నీళ్లు చల్లింది. వెలిగొండ ప్రాజెక్టు తొలి టన్నెల్‌ పూర్తయి ఈ ఏడాది కాకపోతే మరో ఏడాది అయినా నీరు రాకపోతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇది  అశనిపాతమైంది. విభజన చట్టం-2014లో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది మిగులు జలాల ఆధారంగా నిర్మాణాలు చేపట్టిన ఆరు ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించి నీటి కేటాయింపులు చేయాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఆదేశించింది. అందులో వెలిగొండ కూడా ఉండటంతో నీటి లభ్యతపై ఇంతవరకూ భరోసా కనిపించింది. అయితే కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణపై గురువారం కేంద్ర జలశక్తిశాఖ ప్రకటించిన నోటిఫికేషన్‌లో వెలిగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా చూపింది. దీంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం ఎగువన తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణం, మరోవైపు సీమ ఎత్తిపోతల పేరుతో మన ప్రభుత్వం చేపట్టిన పథకాలతో వెలిగొండ, సాగర్‌ ఆయకట్టుకు భవిష్యత్‌లో నీటి లభ్యత ఉండదన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీనిపై ఐదారు రోజుల క్రితం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాశారు.  రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా ప్రాజెక్టులపై విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో  వెలిగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా కేంద్రం పేర్కొనడం జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒంగోలు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టుకు మరోగండం వచ్చిపడింది. దాదాపు పాతికేళ్ల క్రితం కృష్ణానది మిగులు జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఉన్న బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు దిగువ రాష్ట్రమైన మనకు ఉండటంతో దాని ఆధారంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇలా సీమలోని గాలేరు-నగరి, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీ అలాగే దక్షిణ తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీలను కూడా చేపట్టారు.  ఇవి నిర్మాణంలో ఉన్న సమయంలోనే కృష్ణానీటి పంపకాలపై కేంద్రం నియమించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఈ తరహా ప్రాజెక్టులకు శరాఘాతమైంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ మిగులు జలాలను వాడుకునే హక్కును దిగువ రాష్ట్రమైన ఏపీకి కేటాయించగా, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అందుకు విరుద్ధంగా మిగులు జలాలను కూడా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీంతో రాష్ట్రంలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి లభ్యత గందరగోళంగా మారింది. రాష్ట్ర విభజనతో సమస్య మరింత తీవ్రమైంది. ఇలా నిర్మాణంలో జరిగిన జాప్యం, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు వెలిగొండకు ప్రతిబంధకమయ్యాయి. అయితే ఆ తీర్పుపై ఉమ్మడి రాష్ట్రప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్‌ అమలులోకి రాలేదు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారమే నీటివాడకం జరుగుతూ వస్తోంది. 


 నీటి వివాదం తీవ్రం

రాష్ట్ర దాదాపు 400 టీఎంసీల అదనపు నీటిని వాడుకునేలా తెలంగాణ కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టింది. మరికొన్నింటికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పేరుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని విభజనతో కృష్ణానది నీటి వాడకం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరా  ఇటీవల వివాదమయంగా మారాయి. వీటిని ముందుగానే గుర్తించిన కేంద్రం రాష్ట్ర విభజన నాటికి నిర్మాణాలు పూర్తయిన ప్రాజెక్టులకు గతంలో వలే నీటి కేటాయింపులు కొనసాగించాలని ఆదేశించింది. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది మిగులుజలాల ఆధారంగా చేపట్టి నిర్మాణంలో ఉన్న ఆరు ప్రాజెక్టులను 2014 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొంది. అందులో వెలిగొండతోపాటు మన రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి, హంద్రీనీవా  ఉండగా తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఉన్నాయి. వాటికి నీటిని కేటాయించాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. అలా విభజన చట్టంలో వెలిగొండను చేర్చడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తయిన నీటి సరఫరా జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. ఈక్రమంలో గత టీడీపీ ప్రభుత్వంలో, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ వెలిగొండ మరింత వేగవంతమై తొలి టన్నెల్‌ పూర్తయి రానున్న కొద్దేళ్లలో నీరు వస్తుందన్న ఆశ ఆ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఏడాది కాలంగా రెండు రాష్ట్రాల మధ్య అక్రమ ప్రాజెక్టుల వివాదం పెద్దదైంది. తాజాగా మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. 


అక్రమ ప్రాజెక్టులకు తెర

దాదాపు 400 టీఎంసీల అదనపు నీటిని వాడుకునేలా తెలంగాణ కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టింది. మరికొన్నింటికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పేరుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్యుల కు పెంచేలా మన ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేపట్టింది. ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 800 నుంచి 825 అడుగులలోపు నీటిని తీసుకునేలా చేపట్టినవే కాగా రెండు రాష్ట్రాల వివాదాలను పెంచాయి. ఆ విషయం అలా ఉంచితే శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 840 అడుగులపైన ఉంటేనే వెలిగొండకు నీరు వచ్చేది. అలాగే శ్రీశైలం నిండి సాగర్‌ ప్రాజెక్టుకు నీరొస్తేనే జిల్లాలోని ప్రఽధాన నీటి వనరైన సాగర్‌ ఆయకట్టుకు నీరందేది. దీంతో అటు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఇటు సీమ ఎత్తిపోతలతో జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు, వెలిగొండ ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టులకు నీరు రాక జిల్లా ఏడారిగా మారుతుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ కోసం కేంద్రం తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టుగా వెలిగొండను పేర్కొనడం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


వెలిగొండను తక్షణం గెజిట్‌లో చేర్చాలి: టీడీపీ

కేంద్రం గెజిట్‌లో వెలిగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా చూపడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌; డాక్టర్‌ స్వామిలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణం గెజిట్‌లో అనుమతి ఉన్న జాబితాలో వెలిగొండను చేర్చాలని వారు డిమాండ్‌  చేశారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని సీఎం శుక్రవారం వారు లేఖ రాశారు. లేనిపక్షంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. 


సీఎం తక్షణం స్పందించాలి

టి. లక్ష్మీనారాయణ, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

కేంద్రం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితాలో వెలిగొండను చేర్చారు. కానీ రాష్ట్ర విభజన చట్టం-2014 చట్టబద్ధ జాబితాలో ఉన్న ఆరింటిలో వెలిగొండ కూడా ఉంది. మిగిలిన ఐదింటిని గెజిట్‌లో చేర్చి వెలిగొండను విస్మరించడం కరెక్టు కాదు. తక్షణం సీఎం స్పందించి వెలిగొండను గెజిట్‌లో చేర్చే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2021-07-17T05:55:50+05:30 IST