ఇళ్లన్నారు.. ఎక్కడ?

ABN , First Publish Date - 2022-05-18T09:22:32+05:30 IST

‘‘ఇళ్లిస్తామని చెప్పారు. మూడేళ్లయినా స్థలాలు చూపించలేదు. పట్టాలు ఇవ్వలేదు. అమ్మఒడి కూడా ఇవ్వలేదు’’ అంటూ..

ఇళ్లన్నారు.. ఎక్కడ?

మూడేళ్లకు మేం గుర్తొచ్చామా?

మాజీ మంత్రి వెలంపల్లికి సెగ

ధర్మవరం ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

‘గడపగడప’లో తీవ్ర వ్యతిరేకత


విజయవాడ(భవానీపురం)/ధర్మవరం, మే 17: ‘‘ఇళ్లిస్తామని చెప్పారు. మూడేళ్లయినా స్థలాలు చూపించలేదు. పట్టాలు ఇవ్వలేదు. అమ్మఒడి కూడా ఇవ్వలేదు’’ అంటూ.. విజయవాడలోని 41వ డివిజన్‌ ప్రజలు మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెలంపల్లి పాల్గొన్నారు. కార్యకర్తలు తొలుత ఎంపిక చేసిన ఇళ్లకు వెళ్లారు. అయితే, పేర్లు పెట్టి పిలిస్తే గానీ ప్రజలు బయటకు రాలేదు. ఈ సందర్భంగా వెలంపల్లి వారితో మాట్లాడుతూ.. పథకాలు అందాయా? అని ప్రశ్నించారు. అయితే, స్వర్ణలత అనే గృహిణి ‘‘మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కనపడ్డారు. ఇల్లు లేదు. ఇంటి పట్టా ఇవ్వలేదు. ఆశలు వదిలేసుకున్నాం’’ అని నిట్టూర్చారు. వెల్లంపల్లి సమాధానమిస్తూ ‘‘నేను రెండు మూడు సార్లు ఇటువైపు పర్యటించాను. మీరు లేరేమో!’’ అన్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారంపై కోర్టులో కేసులు ఉన్నాయని, అవి తేలిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఎండీ మునీర్‌, అబ్దుల్‌ నబీ అనే వ్యక్తులు కూడా తమకు ఇళ్లు మంజూరు కాలేదని చెప్పారు. వీళ్ల పేర్లు రాసుకోవాలని అధికారులకు వెలంపల్లి సూచించారు. 


పథకాలొద్దు.. ఇళ్లివ్వండి చాలు..

రంగూన్‌ సాహెబ్‌ వీధిలో.. మోరంపూడి గౌరి అనే మహిళ మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వ పథకాలేవీ వద్దని, ఇల్లు ఇవ్వాలని కోరారు. తాను పలు మార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఉన్నాయని మంజూరు చేయలేదని, ప్రతి నెల రెండో తారీకున అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వలంటీర్‌ రాజు సమాచారం సరిగా ఇవ్వడం లేదని, రేషన్‌ వచ్చిన సంగతి కూడా చెప్పడం లేదని వెలంపల్లికి ఫిర్యాదు చేశారు.  కాగా, ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తే అవకాశం ఉండటంతో 20 మందికిపైగా భవానీపురం పోలీసులు మాజీ మంత్రికి పహారాగా నిలిచారు. 


‘రోజూ వస్తున్నారు.. కాలనీలో రోడ్లు చూస్తున్నారు. అయినా వేయించరు. ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించరు’ అని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓ వృద్ధుడు నిలదీశాడు. ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌లో ఎమ్మెల్యే కేతిరెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధుడు పైవిధంగా నిలదీశారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కాసేపు మౌనం వహించారు. ఆ తర్వాత ‘రోడ్లు వేయిస్తాం లేవయ్యా’ అన్నారు. ఇక, ప్రజల నుంచి నిరసనలు వస్తాయని భావించిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-18T09:22:32+05:30 IST